మిత్ర పక్షాలతో జాతీయ పార్టీల వైఖరి క్రమంగా మారుతోంది. గతంలో వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే అనుసరించిన విధానం వేరు. ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాల పట్ల అనుసరిస్తోన్న వైఖరి వేరు. వాజపేయి హయాంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఎన్డీయే మిత్రపక్షాలకు స్వేచ్ఛ లేదనేది వారి మాట. అప్పట్లో ఎన్డీయే సర్కారు మనుగడకు మిత్రుల అండదండలు అవసరమయ్యాయి.. కానీ ఇప్పుడు మోదీకి ఆ అవసరం లేకపోవడమే.. బీజేపీ ప్రస్తుత వ్యవహారశైలికి ప్రధాన కారణమన్నది అందరూ ఒప్పుకునే విషయమే. వాజపేయి హయాంలో ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు చక్రం తిప్పారు.. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన కూడా ఓ భాగస్వామ్యపక్షానికే పరిమితమయ్యారు.

Image result for regional parties in india

తొలి ఎన్డీయే సర్కారులో మిత్రులకు ఎంతో వెసులుబాటు ఉండేది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో అవి మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ప్రస్తుతం మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం.. అమిత్ షా సారథ్యంలోని బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ మిత్రులను బుజ్జగించేందుకు రాజీ పడట్లేదు. తెలుగుదేశం మంత్రులు రాజీనామా చేసిన వెంటనే.. వాటిని ఆమోదించడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. అంతేకాదు దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలో అధికారం సంపాదించుకుంటూ, ఓటర్లను ఆకర్షించుకుంటూ అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రాల్లోనూ బలంగా దూసుకెళ్లేంత కాలం మిత్రపక్షాల నుంచి వచ్చే ఇబ్బంది కూడా ఏమీ ఉండదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

Image result for regional parties in india

తాజా పరిణామాలతో దేశవ్యాప్తంగా మళ్లీ ప్రాంతీయ పార్టీల హవా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల అడుగులు ఎటువైపు పడతాయన్న అంశంపైనే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు, తాజాగా వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అన్నివర్గాల దృష్టి ఈ అంశం పై కేంద్రీకృతమైంది. గతంలో రెండుసార్లు యూపీఏను అధికారంలోకి తీసుకురావడంలో ప్రాంతీయ పార్టీలు ముఖ్యపాత్ర పోషించాయి. 2014సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సొంతంగానే తిరుగులేని ఆధిక్యం లభించినా, ప్రాంతీయ పార్టీలు అందించిన బలంతో ఎన్డీఏ విజయం సంపూర్ణమైంది. అయితే వివిధ కారణాలవల్ల ఎన్డీఏని ఒక్కొటొక్కటిగా ప్రాంతీయ పార్టీలు విడిపోతుండడం, కొత్తకూటముల ఏర్పాటు దిశగా మరోపక్క ప్రయత్నాలు జరుగుతుండడం.. కమలనాథుల్ని కలవరపరుస్తోంది.

Image result for regional parties in india

గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు దేశవ్యాప్తంగా 27.8 కోట్ల మంది ఓట్లు వేస్తే.. ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులకు 23.6 కోట్ల మంది ఓట్లు వేశారు. ఇంతటి కీలకమైన స్థానాన్ని దక్కించుకున్న ప్రాంతీయ పార్టీలు ఒక్కొటొక్కటిగా ఎన్డీఏని వీడిపోతున్నాయి. ప్రధాన మిత్రపక్షాలైన శివసేన, తెలుగుదేశం బీజేపీకు కటీఫ్ చెప్పేశాయి. ఎన్డీయేలో భాగం కాకపోయినా.. నాలుగేళ్ల నుంచి బీజేపీ తీసుకున్న నిర్ణయాల్లోనూ బేషరతుగా మద్దతు తెలిపిన టీఆరెస్ పార్టీ.. ఎన్డీఏ కూటమిని విమర్శిస్తూ తృతీయ కూటమి ఏర్పాటు చొరవ చూపిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప్పు-నిప్పులా ఉండే ఎస్పీ, బీఎస్పీలు తాజా ఉప ఎన్నికల మాదిరిగా ఇకపైనా కలిసి పనిచేస్తే అది బీజేపీకు మింగుడుపడని పరిణామమే.

Image result for regional parties in india

తమిళనాడులో పాతవాటితో పాటు కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకువస్తున్నా అవి బీజేపీతో కలిసి నడుస్తాయని ఖాయంగా చెప్పలేని పరిస్థితి. కర్ణాటక రాజకీయం ఎలా ఉంటుందనేది త్వరలో అక్కడ జరగబోయే శాసనసభ ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. బిహార్‌లో జేడీయు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పట్టుబిగిస్తున్నందు వల్ల బీజేపీతో ఎంతవరకు కలిసి ఉంటుందనేది అనుమానమే. ముఖ్యంగా శరద్‌యాదవ్‌ ఎటువైపు మొగ్గు చూపిస్తారనేది తేలాలి. మహారాష్ట్రలో కాంగ్రెస్‌- నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్య కొనసాగనున్న చెలిమి బీజేపీకి మింగుడుపడని పరిణామమే. పంజాబ్‌లోని అకాలీదళ్‌ సైతం వాజ్‌పేయీ మాదిరి సంకీర్ణ ధర్మాన్ని మోదీ సర్కారు పాటించాలని బాహాటంగానే చెబుతోంది. ఇలా దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితి నుంచి కమలనాధులు ఎలా బయట పడతారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Image result for regional parties in india

1998 ఎన్నికలకు ముందు ఏర్పడిన ఎన్డీఏ కూటమిలో 14 పార్టీలు ఉంటే ఆ తర్వాత ఏడాది ఎన్నికల నాటికి అవి 17కి చేరాయి. 2004 ఎన్నికల్లో లోక్‌ జనశక్తి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, డీఎంకేలు ఎన్డీఏని వదిలేశాయి. చివరకు బీజేపీతో శివసేన, అకాలీదళ్‌ మాత్రమే ఉన్న పరిస్థితి నుంచి గత ఎన్నికల నాటికి చిన్నా చితక కలిపి దాదాపు 46 పార్టీలను ఎన్డీఏ తన గూటికి చేర్చుకొని కాంగ్రెస్‌ను దెబ్బ తీయగలిగింది. ప్రాంతీయ అవసరాలో, ఇతర అనివార్యతలో ఎన్డీఏలోని భాగస్వాములను ఒక్కతాటిపైకి తెచ్చినా క్రమేణా వాటి దృక్కోణంలో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా గుజరాత్‌ స్థానిక సంస్థలు, రాజస్థాన్‌ ఉప ఎన్నికల తర్వాత వాటి వైఖరిలో మార్పు కనిపిస్తోంది. తాజాగా యూపీలో బీజేపీ కంచుకోటల్లాంటి లోక్‌సభ స్థానాల్లోనూ కమలనాథులు ఓడిపోవడంతో అవి మరింత దూకుడుగా వెళ్లే అవకాశాలున్నాయి.

Image result for regional parties in india

ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే 2019లో కేంద్రంలో సంకీర్ణం ఏర్పడుతుందనీ, అప్పుడు తాము చక్రం తిప్పడానికి ఆస్కారం ఉంటుందనీ ప్రాంతీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అధికారంలోకి వచ్చే అవకాశమున్న సంకీర్ణంతో జత కట్టేందుకు ఉత్సాహం చూపించే ఈ పార్టీలు రాబోయే నెలల్లో ఏం చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: