రాష్ట్రం మొత్తం ప్రత్యేక హోదాపైనే చర్చ జరుగుతోంది. కేంద్రం మోసం చేసిందంటూ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ కోడై కూస్తున్నాయి. పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే నిన్నటివరకూ టీడీపీతో అంటకాగి, తాజాగా రివర్స్ అయిన పవన్ కల్యాణ్ పై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.


          ఎవరైనా వ్యక్తిపై ఆరోపణలు చేయడం చాలా కామన్. అయితే కొంతమంది మాత్రం తమ కోపాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రధాని మోదీపై మండిపడుతున్న టీడీపీ నేతలు.. రోజుకో రకంగా మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వెరైటీ నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా పవన్ కు, మోదీకి సంప్రదాయబద్దంగా పెళ్ళి జరిపించారు. ఈ తతంగమంతా సందడిగా సాగింది. నగరంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.


          శ్రీకాళహస్తిలో నరేంద్రమోడీ - పవన్ కళ్యాణ్ పెళ్లి అంగరంగ వైభవంగా సాగింది. ఆకాశమంత పందిరి, భూలోకమంత పీట వేసి సపరివారసమేతంగా వివాహం జరిగింది. శ్రీకాళహస్తి టీడీపీ యువనేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి నేతృత్వంలో ఈ పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లి మండపం పక్కనే వినాయకుడి విగ్రహం వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వివాహ తంతు ప్రారంభించారు. అనంతం వరుడు మోదీని, వధువు పవన్ కల్యాణ్ ను పెళ్లిపీటలపై కూర్చోబెట్టి వివాహం జరిపించారు. అక్షింతలతో ఆశీర్వదించారు. పట్టణంలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.


రాష్ట్రాభివృద్ధికి సహకరించని మోదీ, పవన్ కల్యాణ్ లపై అసంతృప్తితోనే టీడీపీ నేతలు ఈ పెళ్లి జరిపించారు. మోదీ చెప్పినట్టు పవన్ నాటకమాడుతున్నారని బొజ్జల సుధీర్ ఆరోపించారు. నాడు హోదాకోసం కాంగ్రెస్ ను డిమాండ్ చేసిన మోదీ.. ఇప్పుడు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీకి రాష్ట్రంలో నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు. మోదీ ఏపీలో తిరగలేరని .. కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని స్పష్టం చేశారు. ఏదైతేనేం.. పవన్ – మోదీ పెళ్లి మాత్రం సందడిగా జరగడంతో చూసేవారంతా వింతగా చూశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: