ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో టీఆర్ ఎస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది.  స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల చారి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 2009 ఎన్నికల్లో వేణుగోపాలా చారి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అంత‌కు ముందు టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయ‌న 2009లో టీడీపీ నుంచి ముథోల్‌లో కేవ‌లం 92 ఓట్ల‌తో గెలిచారు. అనంత‌రం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరపున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 

Image result for telangana

ఈ ఎన్నికల తర్వాత విఠల్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో పార్టీ క్యాడర్ లో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిని కాంగ్రెస్‌ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది.  2019 ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ  నేత, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఆయనకే దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క బీజేపీ కూడా నియోజకవర్గంపై కన్నేసి చాపకింద నీరులా తన బలాన్ని పెంచుకొంటుంది. 

Image result for trs

మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్‌ కంచుకోటగా ఉండేది. ఆ పార్టీ నుంచి గ‌డ్డం గడ్డన్న 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గంతో పాటు జిల్లాలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పారు. ఆయన వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన విఠల్‌రెడ్డి ఇటీవల ప్రజల మద్దతు పొందలేకపోతున్నారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రజల నుంచి ఎమ్మెల్యేకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నియోజకవర్గాన్ని పట్టించుకోరని పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండరని అపవాదు ఉంది. 

Image result for trs

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు వేణుగోపాల చారికి దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. విఠ‌ల్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేర‌డంతో కేసీఆర్ వేణుగోపాలాచారిని ఢిల్లీలో పార్టీ త‌ర‌పున సెక్ర‌ట‌రీగా నియ‌మించారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇక్క‌డ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్ని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి మింగుడుపడడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు గుర్తింపు ఇవ్వడం లేదని,  వ్యూహాత్మకంగానే వేణుగోపాల చారిని తెరపైకి తెస్తున్నాడని ఎమ్మెల్యే బహిరంగంగా ఆరోపించడం పార్టీలో కలకలం రేపుతోంది. 


పార్టీలో తనకు గౌరవం లేదని, టీఆర్ ఎస్ అధినేతను నేరుగా కలిసే అవకాశం కూడా లేదని తన అనుచరుల వద్ద ఎమ్మెల్యే తన ఆవేదనను వెల్లగక్కినట్లు సమాచారం.  పరిస్థితి ఇలాగే ఉంటే సొంత గూటికి చేరుకోవడమే మేలని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలుస్తోంది.  మరోపక్క కాంగ్రెస్‌ పార్టీ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి టీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ  చేసే అవకాశం ఉన్నట్లు పార్టీలో, జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: