దేశవ్యాప్తంగా కాషాయ జెండాను రెపరెపలాడించడమే ధ్యేయంగా ప్రకటించింది బీజేపీ. అందుకు తగ్గట్లే దేశవ్యాప్తంగా మెరుగైన ఫలితాలు కూడా సాధిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అలా దేశంలో అన్ని ప్రాంతాల మీద ఆధిపత్యం చలాయిస్తున్న ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మాత్రం చేతులెత్తేస్తోంది. కనీసం పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిని కూడా నిర్ణయించుకోలేని అయోమయంలో పడిపోయింది.

Image result for ap bjp

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును ఆ పదవి నుంచి తొలగించనున్నారు. ఆయన స్థానంలో సరికొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం భారీ కసరత్తే చేస్తోంది. హరిబాబు మెతక వైఖరి పట్ల బీజేపీ అధిష్ఠానం అసంతృప్తితో ఉండటమే ఈ మార్పుకు కారణమని తెలుస్తోంది. నిజానికి హరిబాబు పదవీకాలం ఇంతకుముందే ముగిసిపోయింది. అయినా కొన్ని వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో పదవిలో కొనసాగించారు. ఇప్పుడు ఏపీలో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో, హరిబాబు దూకుడుగా వ్యవహరించ లేకపోతున్నారని అధిష్ఠానం భావిస్తోంది.

Image result for ap bjp

బీజేపీపై.. ప్రధాని నరేంద్ర మోదీఫై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా.. టీడీపీ నేతలు విరుచుకు పడుతున్న వేళ.. రాష్ట్ర అధ్యక్షుడు దూకుడుగా లేకపోతే బీజేపీకి ఇబ్బందికరంగా మారుతుందనే భావనకు అగ్ర నేతలు వచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి పదవికి మాణిక్యాలరావు, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణల పేర్లను పరిశీలించింది. వీరు ముగ్గురు కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. చివరికి వీరిలో మాణిక్యాలరావు వైపు అధిష్ఠానం మొగ్గుచూపింది.

Image result for manikyala rao

మాణిక్యాలరావును నియమించాలనేది.. ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ రామ్ మాధవ్ వ్యూహం. సోము వీర్రాజు వైపు తొలుత మొగ్గు చూపినప్పటికీ.. ఆయన కొన్ని సందర్భాల్లో నోరు జారే అవకాశం ఉందని రామ్ మాధవ్ అంచనా. అధ్యక్ష పదవిలో ఉన్నవారికి దూకుడుతో పాటు, కొన్ని సమయాల్లో సంయమనం కూడా అవసరమని ఆయన భావించారు. దూకుడు, సంయమనం రెండూ ఉన్న వ్యక్తి మాణిక్యాలరావు అని తుది నిర్ణయానికి వచ్చారు. అధ్యక్ష పదవిని ఆశించిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలను బుజ్జగించేందుకు.. వారిని జాతీయ కమిటీలోకి తీసుకుంటామనీ వారికి చెప్పారు. ఇలా నిర్ణయాలు తీసుకున్న బీజేపీ అధిష్ఠానానికి ఎక్కడా వ్యతిరేకత రాకపోవడంతో అంతా సవ్యంగానే ఉందని త్వరలోనే అధికారికంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిని ప్రకటిద్దామని భావించారు.

Image result for ap bjp

ఇలాంటి సమయంలో బీజేపీ అధిష్ఠాన నేతలకు మాణిక్యాలరావు షాక్ ఇచ్చారు. అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు ససేమిరా అంటూ వెనుకడుగు వేశారు. అగ్రనేతలు నచ్చచెప్పటానికి ప్రయత్నించినప్పటికీ ఆయన మెత్తబడనట్లు తెలుస్తోంది. దాంతో మళ్లీ పరిస్థితి మొదటకే వచ్చింది. మిగిలిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజుల్లో ఎవరో ఒకరిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కన్నాకు పదవి ఇవ్వడానికి అధిష్ఠానం సిద్ధమైనా.. క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. వేరే పార్టీ నుంచి వచ్చిన నేతకు ఏకంగా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై చాలా మంది నేతలు కూడా కినుకు వహిస్తున్నారట.

Image result for ap bjp

అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే.. స్వీకరించేందుకు వీర్రాజు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఆయన నోటి జోరు పార్టీకి మైనస్ అవుతుందనేది అత్యధికుల భావన. తనకు కాకపోతే మాణిక్యాలరావుకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని సోము వీర్రాజు అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ.. తనదైన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరి నాలుగేళ్లు దాటుతున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు. అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే బీజేపీ అంటే ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. కాబట్టి బీజేపీని వదిలేసి వైసీపీ చేరితేనే రాజకీయంగా భవిష్యత్ ఉంటుందన్న ఆలోచనలో కన్నా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడిని ఖారారు చేస్తే.. కన్నా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పిన చంద్రబాబును దెబ్బకు దెబ్బతియ్యాలన్నది బీజేపీ హైకమాండ్ ఆలోచన. ఇందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదన్న పట్టుదలతో ఉన్న మోదీ-అమిత్ షా ద్వయం ఉన్నారు. కానీ వాళ్లకి ఏపీలో పార్టీ పరిస్థితే ఏమీ అర్థం కావట్లేదు. కనీసం అధ్యక్షుడిని కూడా నియమించుకోలేని పరిస్థితి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: