గత కొంత కాలంగా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయాలపై విరుచుకు పడుతున్నారు.  ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ రాజకీయాలను, ప్రధాని మోడీ వైఖరిని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రశ్నిస్తూ వస్తున్నారు.  కొంత కాలంగా తాను వెళ్లిన ప్రతి చోట కొందరు మతఛాందసవాదులు ఆవు పేడతో కళ్లాపి చల్లి, గోమూత్రంతో శుద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.

గోవు, కొబ్బరికాయ ఎప్పుడు హిందూ మతం పుచ్చుకున్నాయని ప్రశ్నించారు. ఖర్జూరం, గొర్రె ముస్లిం మతంలో ఎప్పుడు చేరాయని నిలదీశారు. పసుపు, కాషాయ వర్ణాలది ఏ జాతి అని ప్రశ్నించారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కానని, అణగారిన వర్గాలకు ఎప్పడూ అండగా ఉంటానని తేల్చి చెప్పారు. భారతీయ జనతా పార్టీపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. కర్ణాటకలోని శివమొగ్గలో జరిగిన దళిత వ్యతిరేక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
 'పోస్ట్ కార్డ్'పై ప్రకాశ్ రాజ్ కేసు:
రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన నేతలు, తర్వాత ఆ రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారని, దళితులను శునకాలతో పోలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోని మనుషుల్ని జీవన్మృతులుగా భావించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. జర్నలిస్టులు సైతం ప్రశ్నించే తత్వాన్ని మరిచిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. గోహత్య చేసిన వారు తల్లి తలను నరికిన వారితో సమానమని కన్నడ నటుడు చిరంజీవి సర్జా నటించిన సీజర్‌ చిత్రంలో ఆక్షేపణీయమైన మాటలు రాశారన్నారు.

తప్పుడు మాటలు, తప్పుడు సందేశాలు ఇచ్చే బీజేపీ నేతలను ప్రశ్నించేందుకు 2500 మందితో ఓ బృందాన్ని తయారు చేసినట్టు ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో దాచిన నల్లధనం తిరిగి తెస్తానన్న వాగ్దానాలు ఏమయ్యాయని అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చే నరేంద్ర మోదీని ప్రశ్నించాలని ఆయన కోరారు. మతఛాందసవాదులను, రాజ్యాంగ వ్యతిరేక శక్తులను శాసనసభ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చి జిగ్నేశ్, నిరుద్యోగాన్ని అదుపు చేయడంలో కేంద్రంలోని మోదీ సర్కారు విఫలమైందని దుయ్యబట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: