మంత్రి ఆదినారాయణ రెడ్డి భోళా మనిషి. ఆఫ్ రికార్డులో చాలా మాటలు ఓపెన్ గా మాట్లాడేస్తుంటారాయన. ఒకప్పుడు వై.ఎస్.తో సన్నిహితంగా మెలిగిన ఆయన.. ఆ తర్వాత జగన్ పంచన చేరారు. పొసగకపోవడంతో వైసీపీని వదిలేసి టీడీపీలో చేరి ఏకంగా మంత్రి పదవి అధిష్టించారు. సందర్భం వచ్చినప్పుడల్లా జగన్ ను ఏకిపారేస్తుంటారు. తాజాగా వై.ఎస్. గెలుపుపై ఆదినారాయణ రెడ్డి ఓ స్టోరీ చెప్పారు.

Image result for ysr

          కడప జిల్లా జమ్మలమడుగులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలు మాట్లాడారు. తమ వల్లే వై.ఎస్.కు జమ్మలమడుగుపై పట్టు చిక్కిందన్నారు. 1989లో వై.ఎస్. పోటీ చేసినప్పుడు కనీసం జమ్మలమడుగులో అడుగు పెట్టలేకపోయారన్నారు. ముద్దనూరు మండలం పెనికలపాడులో వై.ఎస్.ను రానివ్వలేదన్నారు. అలాగే వై.ఎస్. తండ్రి రాజారెడ్డిని చిన్నముడియం గ్రామంలోకి అడుగు పెట్టకుండా గ్రామస్థులు అడ్డుకున్నారన్నారు. తదనంతరం 1999లో తాము అండగా నిలిచి జమ్మలమడుగులో మెజారిటీ తీసుకొచ్చామన్నారు. అప్పుడు జమ్మలమడుగులో తప్ప మరే ఇతర నియోజకవర్గంలో వై.ఎస్.కు మెజారిటీ రాలేదన్నారు. కడపలో ఎమ్మెల్యేతో పాటు జడ్పీ ఛైర్మన్, రవీంద్రనాథ్ రెడ్డి పోరాడినా 23 వేల ఓట్లు కోల్పోయారని వివరించారు.

Image result for adi narayana reddy

          ఈ మధ్య తమ వల్లే ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారని జగన్ చెప్తున్నారని, అది వాస్తవం కాదని ఆదినారాయణ రెడ్డి వివరించారు. తమ పక్కా వ్యూహం వల్లే ఎమ్మెల్సీగా అన్నను గెలిపించుకున్నట్టు చెప్పారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్య రాచమల్లు ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, అంజాద్ భాషా లాంటి వాళ్లను బార్న్ బేబీలుగా కొట్టిపారేశారు ఆదినారాయణ రెడ్డి. వాళ్లు చాలా ఎదగాలని, వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు. చివరగా.. ఇది ఫ్యాక్షన్ గడ్డ అన్న మంత్రి, ఇక్కడ ఎప్పుడు ఎలా నడుచుకోవాలో తమకు తెలుసన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: