అమరావతి ఇప్పుడు ఏపీలో అత్యథికంగా రేటు పలుకుతున్న భూములు ఇక్కడ ఉన్నాయి. రాజధాని నగరం కావడంలో ఎకరం కోట్లలోనే పలుకుతోంది. రాజధానిగా ప్రకటించకముందు ఉన్న రేట్లు.. రాజధాని ప్రకటనతో అనేక రెట్లు పెరిగాయి. అయితే రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం తన చేతిలో పనే కాబట్టి చంద్రబాబు దాన్ని దుర్వినియోగం చేశారని సాక్షి ఆరోపిస్తూ సంచలన కథనం వెల్లడించింది. 


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని స్థలం ఎంపిక కు ముందుగానే ఆయనకు చెందిన హెరిటేజ్ పుడ్ సంస్థ అక్కడ భూమిని కొనుగోలు చేసిందట. ఆ కొనుగోలు తర్వాతే చంద్రబాబు రాజదాని ప్రకటన చేశారట. అంతే కాదు.. హెరిటేజ్ కొన్న ఆ భూమి కూడా లాండ్ పూలింగ్ లో పోకుండా జాగ్రత్తలు కూడా  తీసుకున్నారట. అంతేనా.. ఆ భూమికి సమీపం గుండా రింగ్ రోడ్డు వెళ్లేలా ప్లాన్ చేశారట. ఇదీ సాక్షి చెబుతున్న కథనం.. 


ఊరికే గాలిపోగేసి కథనం రాయకుండా కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టారు. 2014, జూలై 7న గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో పలుచోట్ల హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ భూములు కొనుగోలు చేసిందట. సర్వే నంబర్లు 27/3బి, 22/2ఎ, 63/1, 62/2బి, 27/3ఎలలో మొత్తం 7.21 ఎకరాలు కొన్నారట. రేటు ఎంతో తెలుసా.. మొత్తం ఏడు ఎకరాలు రూ.67.68లక్షలేనట. 


తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో భూములు కొనుగోలు పూర్తయ్యాకే చంద్రబాబు రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేస్తూ 2014, డిసెంబర్‌ 28న ప్రకటన విడుదల చేశారు. అప్పటివరకూ ఎకరం 10 నుంచి 15 లక్షలు ఉన్నరేటు ఏకంగా 3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు చేరింది. అలా చంద్రబాబు తన పదవిని దుర్వినియోగం చేశారంటూ సాక్షి బాంబు పేల్చింది. మరి దీనిపై చంద్రబాబు ఏమంటారో..!



మరింత సమాచారం తెలుసుకోండి: