ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ నేడు బంద్‌ కి పిలుపునిచ్చారు.  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఏపీలో బంద్ ప్రారంభమైంది. ప్రధాన ప్రతిపక్షాలైన వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.  రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, గేట్‌మీటింగులు, ఇంటింటి ప్రచారాలు, కరపత్రాల పంపిణీ వంటి కార్యక్రమాల్ని పూర్తి చేశారు. బంద్‌కు మద్దతుగా జగన్‌ పాదయాత్రకు విరామం ప్రకటించారు. 


వైసిపి నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా బంద్‌కు మద్దతు ప్రకటించి, పాల్గోనున్నట్లు తెలిపింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ బంద్‌ను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలన్నీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. లారీలను నిలిపేసినట్లు ప్రకటించారు. 


పోలీసులు మాత్రం బంద్‌ వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని బంద్‌ నిర్వాహకులకు ముఖ్యంగా సిపిఎం నాయకులకు అన్ని పోలీసు స్టేషన్ల నుండి హెచ్చరిక నోటీసులు పంపించారు. నేటి ఉదయం ఐదు గంటల నుంచే బస్టాండ్ల వద్ద ధర్నాలు చేపట్టారు. దీంతో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. రోడ్డెక్కిన ఒకటీఅరా బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.  


అన్ని విద్యా సంస్థలూ సోమవారం సెలవు దినంగా ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రజా, ఉద్యోగ, కార్మిక, మహిళా సంఘాలు, విద్యార్ధి, యువజన సంఘాలు బంద్‌ సన్నాహాక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. ఈ బంద్‌కు విద్యార్థి సంఘాల జెఎసి కూడా మద్దతు ప్రకటించింది. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్‌కు టీడీపీ దూరంగా ఉంది. బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని వైసిసి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: