హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లను బహిష్కరిస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. ఇది కేసీఆర్ సర్కార్ కు చెంపపెట్టు అని వ్యాఖ్యానించింది.

Image result for kcr highcourt

తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు. గవర్నర్ ప్రసంగం కాపీలను చించి ఎగరేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైక్ విసిరడంతో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు తగిలింది. ఆయన ఆసుపత్రిపాలయ్యారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ సర్కార్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లను బాధ్యులుగా గుర్తించింది. క్రమశిక్షణారాహిత్య చర్యల కింద వారిని అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం వారి శాసనసభ్యత్వం రద్దయినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది.

Image result for komatireddy venkat reddy

తమను అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తూ, శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం .. శాసనసభ్యత్వం రద్దు చేయడం సరికాదని తీర్పు చెప్పింది. వారు తప్పు చేశారని భావిస్తే.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు కానీ బహిష్కరణ సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. హైకోర్టు తీర్పుతోనైనా కేసీఆర్ సర్కాక్ కళ్లు తెరవాలని కోమటి రెడ్డి అభిప్రాయపడ్డారు.

Image result for komatireddy venkat reddy

నిరంకుశ టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. దురహంకారంతో విర్రవీగుతున్న కేసీఆర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆయన సూచించారు. కేసీఆర్ కు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి, సంపత్ లపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ శ్రేణుల్లో సంతోషం నింపింది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: