గుజ‌రాత్‌కు చెందిన నీర‌వ్ మోదీ.. పేరు ఇటీవ‌ల కాలంలో వార్త‌ల్లో విస్తృతంగా వినిపించింది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు ను మోస‌గించిన నీర‌వ్‌పై దేశ‌వ్యాప్తంగా తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఉద్యోగుల‌కు జీతాలు సైతం ఎగ్గొట్టిన ఈ ప్ర‌ముఖ వ్యాపార వేత్త వ‌జ్రాభ‌ర‌ణ వ్యాపారంలో ప్ర‌సిద్ధుడు! అయితేనేం జ‌నాల సొమ్మును బ్యాంకుల రూపంలో భారీగానే భోం చేశాడు. ఇప్పుడు అచ్చు ఇలాంటి కేసే తెలంగాణ‌లోనూ వెలుగు చూసింది. మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కుమారులే నీర‌వ్ మోడీలుగా అవ‌తారమెత్తి.. బ్యాంకు సొమ్మును ఆబ‌గా భోంచేసిన‌ట్టు చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. మంత్రి జూపల్లి కుమారులు అరుణ్‌, వరుణ్‌.. శైలి ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. కంపెనీ అవసరాల రీత్యా.. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ)కి 74 కోట్ల రూపాయల మేర బకాయి పడింది. 

Image result for jupalli son arun

2013లో  ఎస్‌బీఐ నుంచి 60 కోట్ల రూపాయల మేర రుణం తీసుకున్న ఈ కంపెనీ.. ఇందుకుగాను కొల్లేటరల్‌ సెక్యూరి టీగా హైదరాబాద్‌ సమీపంలోని కిస్మత్‌పూర్‌లోని నాలుగు ఎకరాల భూమితో పాటు రాజేంద్రనగర్‌లోని గగన్‌పహాడ్‌ వద్ద మూడెకరాల భూమి, అమీర్‌పేట్‌లోని రాయల్‌ పెవీలియన్‌ అపార్ట్‌మెంట్‌లో మూడు ఫ్లాట్స్‌ను తనఖా పెట్టారు. జూపల్లి కుమారులతో పాటు మరో వ్యక్తి కిరణ్ రెడ్డి వాసిరెడ్డి కూడా ఇందులో భాగస్వామిగా ఉండ‌డం గ‌మ‌నార్హం.  కృష్ణారావు కుమారుల్లో ఒకరైన అరుణ్‌.. తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులు, వాటర్‌, రహదారుల ప్రాజెక్టులకు సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉన్న శైలి పారాడిమ్‌ ఇన్‌ఫ్రా ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2017 డిసెంబరు నాటికి తీసుకున్న రుణ మొత్తం వడ్డీతో సహా దాదాపు 86 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు  విశ్వసనీయ వర్గాల సమాచారం. 

Image result for jupalli son arun sbi

అయితే.. 2014లోనే శైలి పారాడిమ్‌ ఇన్‌ఫ్రాటెక్‌ను హైదరాబాద్‌కే చెందిన క్రిద్యా ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. కంపెనీని విక్రయించినప్పటికీ తీసుకున్న రుణాలకు అరుణ్‌, వరుణ్‌ సహా మరొక భాగస్వామి గ్యారెంట‌ర్‌గా వ్యవహరించారు. అంటే ప్రస్తుతం జూపల్లి కుమారులు ఈ కంపెనీలో డైరెక్టర్లుగా లేరన్నది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే కిరణ్‌ రెడ్డి మాత్రం క్రిద్యా ఇన్‌ఫ్రాలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.  ఏళ్లు గడుస్తున్నా.. శైలి ఇన్‌ఫ్రా తీసుకున్న రుణాలను క్రిద్యా ఇన్‌ఫ్రా చెల్లించకపోవటంతో 2014 జూన్‌లో ఎస్‌బీఐ వీటిని మొండి బకాయిలుగా ప్రకటించింది.  2015 డిసెంబరులో క్రిద్యా ఇన్‌ఫ్రాకు చివరిసారిగా డిమాండ్‌ నోటీసును ఎస్‌బీఐ జారీ చేసింది. ఇందుకు సదరు బాకీదారులు స్పందించ‌లేదు.  తాకట్టు పెట్టిన ఆస్తుల విక్రయానికి 2016 అక్టోబరులో ఎస్‌బీఐ నోటిఫికేషన్‌ ఇచ్చింది. 


కాగా ఆస్తుల వేలం ద్వారా మొత్తం రుణంలో 50 శాతాన్ని తిరిగి రాబట్టుకోవచ్చని ఎస్‌బీఐ భావించింది.  వేలంలో అన్ని ఆస్తులకు సంబంధించి ఏడు బిడ్లు రాగా 2.2 కోట్ల రూపాయల బిడ్‌ మొత్తాన్ని ఎస్‌బీఐ అందుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఎస్‌బీఐతో పాటు కార్పొరేషన్‌ బ్యాంక్‌ 11 కోట్ల రూపాయలు, శ్రేయీ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ దాదాపు 2 కోట్ల రూపాయల రుణాలు క్రిద్యా ఇన్‌ఫ్రా పేరు మీద ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  మొత్తంగా ఈ ప‌రిణామం రాజ‌కీయ రంగు పులుముకునే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా తెలంగాణ‌లోనూ నీర‌వ్‌లు వెలుగు చూడ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: