క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో తెలుగోడి నాడి మీద బీజేపీ తెగ ఆందోళ‌న‌కు గుర‌వుతోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని ఆ పార్టీపై తీవ్ర ఆగ్ర‌హంతో తెలుగు ప్ర‌జ‌లు ఉన్నారు. ఈఎన్నిక‌ల్లో క‌మ‌ల‌ద‌ళానికి చుక్కులు చూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. క‌ర్ణాట‌క‌లోని తెలుగు ప్రాబ‌ల్య ప్రాంతాల్లోని బీజేపీ నేత‌ల‌కు క‌ష్టాలు త‌ప్పేలా లేవు. కర్ణాటకకు సరిహద్దు ఎక్కువుగా ఉన్నది తెలుగు రాష్ట్రాలతోనే. తుంగభద్ర జలాశయం నిర్మాణానికి ముందు- ఆ తర్వాత కోస్తా జిల్లాల నుంచి ఇక్కడికి వలసలు వచ్చిన వారు ఎక్కువ‌గా ఉన్నారు. నారాయణపుర జలాశయం కాల్వల నిర్మాణంతో కృష్ణా నది పరిధిలో వలస రైతులు పెరిగారు. 

Image result for karnataka elections

అలాగే కొప్పళ, రాయచూరు జిల్లాల్లో తెలుగువారి నివాసాలు ఎక్కువ‌. తుంగభద్ర ఎడమకాల్వ పరిధిలోని గంగావతిలో 10, కనకగిరిలో 20, సింధనూరులో 90 ప్రధాన క్యాంపులున్నాయి. కర్ణాటకకు గుత్తేదార్లు, చిన్న, పెద్ద పారిశ్రామిక వేత్తలు, వలస కూలీలు రావడంతో.. సెటిలర్ల సంఖ్య ఎక్కువ‌గా పెరిగింది. సేద్యంతో పాటు విద్య, వ్యాపార రంగాన్ని వీరు ఎంచుకున్నారు. ఇప్పుడు కర్ణాటకలో తెలుగు వారి జనాభా 85 లక్షల వరకు పెరిగినట్లు అంచ‌నా. కర్ణాటక జనాభా 6 కోట్లు. ఓట్ల పరంగా పాతిక లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. బీదర్‌, బెంగళూరు, మైసూరు, బళ్లారి, కొప్పళ, రాయచూరు, కలబురగి, యాదగిరి, హుబ్బళ్లి-ధార్వాడ, చిత్రదుర్గం, తుమకూరు, శివమొగ్గ, దావణగెరె, కోలారులో తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువ‌. ఇప్పుడు వీరంతా ఏ పార్టీవైపు మొగ్గుచూపుతార‌న్న‌దే క‌న్న‌డ రాజ‌కీయాల్లో ఆస‌క్తిని రేపుతోంది. 

Image result for karnataka elections

అయితే క్ర‌మంలో తెలుగు వారు కూడా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. ప‌ద‌వులూ పొందుతున్నారు. దీంతో మొద‌ట్లో అభ్య‌ర్థిని చూసి గంప‌గుత్త‌గా ఓట్లు వేసిన తెలుగు ప్ర‌జ‌లు కూడా పార్టీల‌వారీగా విడిపోయారు. భాజపా, కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) మూడు పార్టీల్లోనూ ఇక్కడివారు మమేకమయ్యారు. తాజాగా ఏపీలో నెల‌కొన్న ప్ర‌త్యేక ప‌రిస్థితులు, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డం.. త‌దిత‌ర అంశాలన్నీ మ‌ళ్లీ క‌ర్ణాట‌క‌లోని తెలుగుప్ర‌జ‌ల్ని రాజ‌కీయాల‌కు అతీతంగా నిర్ణ‌యం తీసుకునేలా చేస్తున్నాయి. రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్‌పై, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా మోసం చేసిన బీజేపీపైన కోపంతో తెలుగు ప్ర‌జ‌లు త‌మ‌కే ఓటు వేస్తార‌న్న‌ధీమాతో జేడీఎస్ నేత‌లు ఉన్నారు. ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలే బెంగళూరులో పర్యటించి జనతాదళ్‌(ఎస్‌)కు తెలుగువారు ఓటేయాలని పిలుపునిచ్చారు.  కోస్తాతో సంబంధాలు కొనసాగించే వారు, బంధుత్వాలు ఉండేవారు బీజేపీపై గుర్రుగా ఉన్నారు.

Image result for karnataka elections

కర్ణాటకలో సుమారు 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఉంటుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. వీరు ఏ పార్టీ వైపు మొగ్గితే వారికే విజయావకాశాలు మెరుగుపడుతాయ‌ని చెబుతున్నారు. బెంగళూరులోని సగం చోట్ల తెలుగువాళ్లు ఎక్కువగా నివసిస్తున్నారు. రాయచూరు జిల్లా సింధనూరులో 30 వేలు, కొప్పళ జిల్లా గంగావతిలో 20 వేలు, కనకగిరిలో 25 వేలు ఓట్లు తెలుగువారివే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ విభజించిందన్న కోపంతో గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కోస్తా, రాయలసీమకు చెందిన వారంతా బీజేపీకే జై కొట్టారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన ప్ర‌క‌ట‌న కూడా తెలుగుప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని ప‌లువురు అంటున్నారు.

Image result for karnataka elections

 ప్రస్తుతం బీజేపీ కర్ణాటక బాధ్యులుగా తెలంగాణ‌కు చెందిన మురళీధరరావు , ఏపీకి చెందిన‌ పురందేశ్వరి ఇప్ప‌టికే ఇక్కడ పనిచేస్తున్నారు. తెలుగువారిని ఆకట్టుకునేందుకు ముమ్మ‌రంగా ప్రయత్నం చేస్తున్నారు. తెలుగువారి ప్రాంతాల్లో విస్త‌`తంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ప‌లువురు తెలుగువారు కొల్లా శేషగిరిరావు(సింధనూరు), హెచ్‌.ఆర్‌.శ్రీనాథ్‌(గంగావతి), గాలి సోమశేఖరరెడ్డి, సురేశ్‌బాబు, నాగేంద్ర(బళ్లారి జిల్లా), బి.శ్రీరాములు(ఈసారి చిత్రదుర్గం జిల్లా), మంత్రులు రమేష్‌కుమార్‌(శ్రీనివాసపురం, కోలారు), రామలింగారెడ్డి(బెంగళూరు), వెంకటరమణప్ప(పావగడ, తుమకూరు జిల్లా), కట్టా సుబ్రమణ్యం నాయుడు(బెంగళూరు) పోటీచేస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో జ‌న‌సేన అధినేత  పవన్‌కల్యాణ్‌ చేత ప్రచారం చేయించాలని జేడీఎస్ నేత‌, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆలోచిస్తున్నారు. చిరంజీవిని రంగంలోకి దింపాలని కాంగ్రెస్ చూస్తోంది. బీజేపీ తరఫున సినీనటుడు సాయికుమార్‌ ప్రచారం ఎంత వరకు లాభిస్తుందో తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: