ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, సంప‌త్‌కుమార్‌ల శాస‌న స‌భ్య‌త్వాల ర‌ద్దు చెల్ల‌దంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అసెంబ్లీ స్వీక‌రిస్తుందా..?  ప్ర‌భుత్వం గౌర‌విస్తుందా..? త‌దుప‌రి చ‌ర్య‌లు ఎలా ఉంటాయి..?  ఎన్నిక‌ల సంఘం ఏం చేయ‌బోతోంది..?  కాంగ్రెస్ నేతల‌కు ఇచ్చిన హామీతో  ఇక ఆ రెండు స్థానాల్లో ఉప ఎన్నిక‌లు లేన‌ట్టేనా..?  ఇలా అనేక ప్ర‌శ్న‌ల‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే స‌భ్య‌త్వ పున‌రుద్ధ‌ర‌ణ‌పై ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. ఎలాగైన త‌న పంతం నెగ్గించుకోవడానికి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. 11మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ వ్యాజ్యం దాఖ‌లు చేయించింది. అయితే త‌క్ష‌ణ విచార‌ణ‌కు కోర్టు నిరాక‌రించింది. 

Related image

ఇదిలా ఉండ‌గా.. కాంగ్రెస్ నేత‌లు కూడా ఇద్ద‌రు ఎమ్మెల్యేల శాస‌న స‌భ్య‌త్వం పున‌రుద్ధ‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, సంప‌త్‌కుమార్‌, మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి, న్యాయ‌వాది జంధ్యాల ర‌విశంక‌ర్‌లు క‌లిశారు. త‌మ‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తూ ఉప ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. 

Related image

తెలంగాణ అసెంబ్లీ ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను హైకోర్టు కోట్టేసిందని, అందువల్ల రద్దు చేసిన అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు ప్రభుత్వం పంపిన నోటిఫికేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోరాదని కోరారు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని, ఉప ఎన్నికల కోసం అందిన నోటిఫికేషన్‌పై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి హామీ ఇచ్చినట్టు నేతలు ధీమాగా చెబుతున్నారు. నిజంగానే.. ఎన్నిక‌ల సంఘం హామీ ఇస్తే.. ఇక న‌ల్ల‌గొండ‌, ఆలంపూర్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు లేన‌ట్టేన‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మార్గం సుగ‌మం చేసుకోవాల‌ని అధికార టీఆర్ఎస్ పార్టీ భావించింది. 


కానీ, ఊహించ‌ని రీతిలో హైకోర్టు తీర్పు రావ‌డంతో అధికార‌ప‌క్షం ఇర‌కాటంలో ప‌డిపోయింది. నిజానికి ఉప ఎన్నిక‌ల‌కు గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి, ఎన్నిక‌ల సంఘానికి పంపిన వెంట‌నే ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల‌ను సీఎం కేసీఆర్ అప్ర‌మ‌త్తం చేశారు. న‌ల్ల‌గొండ‌, ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌ర‌గ్ జిల్లాల‌కు చెందిన మంత్రుల‌ను అల‌ర్ట్ చేశారు. ఉప ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు బాధ్య‌త మీదేనంటూ ఆదేశించిన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే హైకోర్టు తీర్పు, ఎన్నిక‌ల సంఘం హామీతో ఇక ఆ రెండు స్థాన‌ల్లో ఉప ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశ‌మే లేద‌నే వాద‌న వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: