2019 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు సర్వ సన్నద్ధంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పక్కాగా రూపొందిస్తున్న ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళదామని పార్టీ ప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు. నిన్న మంగళవారం హైదరాబాదులోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో 13 జిల్లాల నుంచి వచ్చిన పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు.


ఈ సందర్భంగా జనసేన పార్టీ ముఖ్య రాజకీయ వ్యూహకర్త శ్రీ దేవ్ ను హాజరయిన పార్టీ ముఖ్య కార్యకర్తలకు  పరిచయం చేశారు. ఎన్నికల ప్రణాళికలు, సంస్థాగత నిర్మాణపరమైన విధానాల రూపకల్పనకు దేవ్ పార్టీతో ఉంటారని, ఆయన పది నెలలుగా జనసేన పార్టీతో కలిసి పని చేస్తున్నారని కూడా పవన్ వారికి వివరించారు. ఎన్నికల ముందే కాదు, తరువాత కూడా శ్రీ దేవ్ సహాయ సహకారాలను వినియోగించుకుంటామని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.  


మరోవైపు తెలంగాణాకు సంబంధించి క్యాడర్ ను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు రెండవ వారం నాటికి తెలంగాణాలో పోటీకి సంబంధించి ప్రాథమిక ప్రణాళికను  ప్రకటిస్తానని ఆయన తెలిపారు. అంతేగాక అంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు సాధనపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజా సమస్యలను తెలియపరచేలా ప్రజలలోకి వెళ్ళడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ నెల 11 వ తేదీలోపు వెల్లడి చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: