ప్ర‌పంచ స్థాయిలో అత్యుత్త‌మ నిపుణుల‌తో నిర్మించ‌బోతున్న రాజ‌ధాని అమరావ‌తి న‌గ‌రంలో భ‌వ‌నాలు ఎలా ఉండ‌బోతున్నాయో.. ఏపీ ప్ర‌భుత్వం ఆగమేఘాల‌పై నిర్మించిన‌ ఏపీ అసెంబ్లీ భ‌వ‌నాల‌ ప‌రిస్థితి చూస్తే స‌రిపోతుందేమో?! `అసెంబ్లీ, తాత్కాలిక స‌చివాల‌యం అధ‌ర‌హో, అద్భుతం` అంటూ కితాబులిచ్చిన వాళ్లు కూడా ఇప్పుడు ముక్కున వేలేసుకోక త‌ప్ప‌దేమో?! వ‌ర్షం నీళ్లు ఇంట్లోకి రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుని ప‌క్కాగా, నాణ్య‌త‌తో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం! అలాంటిది రాష్ట్ర ప‌రిపాల‌నా భ‌వనాన్ని అంటే ఇంకెంత నాణ్య‌త‌తో నిర్మించాలి! కానీ ఏపీ మంత్రి నారాయ‌ణ మాత్రం వీటిని ప‌ట్టించుకున్న దాఖ‌లాలే క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మ‌రోసారి ఈ తాత్కాలిక‌ భ‌వ‌నాల్లో లీకులు బ‌య‌ట‌ప‌డ్డాయి. చిన్నపాటి వ‌ర్షం వ‌స్తే చాలు.. అన్ని కార్యాల‌యాల్లోకి నీరు చేరుతుండ‌టంతో అంతా విస్తుపోతున్నారు. 

Related image

నాణ్య‌త న‌ల్ల‌పూస! అంతా డొల్ల.. అని ఎలా పిలుచుకున్నా అది నిజ‌మే అనిపించ‌క మాన‌దు! ఎందుకంటే నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో నిర్మించాల్సిన అద్భుత భ‌వనాన్ని.. సీఎం చంద్ర‌బాబు హ‌డావుడి, మంత్రుల అరకొర ప‌ర్య‌వేక్ష‌ణ మ‌ధ్య ఆగ‌మేఘాల‌పై నాలుగు స్తంభాలు, నాలుగు చాంబ‌ర్లు, నాలుగు కుర్చీలు, నాలుగు టేబుళ్లు వేసి సిద్ధం చేసేశారు. అందులోనే హైటెక్ వ‌స‌తులు క‌ల్పించారు. హైదరాబాద్‌లో ప‌దేళ్ల వ‌ర‌కూ ఉండేందుకు అవ‌కాశం ఉన్నా.. వాట‌న్నిం టినీ కాద‌ని సొంత రాష్ట్రం నుంచే పాల‌న కొన‌సాగించాల‌న్న మొండి ప‌ట్టుద‌ల‌తో తాత్కాలికంగా స‌చివాల‌యాన్ని నిర్మించి అధికారులు, ఉద్యోగులంద‌రినీ హుటాహుటిన ఇక్క‌డికి ర‌ప్పించేశారు. అయితే ఈ ప‌నుల్లో నాణ్య‌త ఎక్క‌డ ఉందో భూత‌ద్దం వేసినా క‌నిపించ‌ద‌ని వ‌ర్షం వ‌చ్చిన ప్ర‌తిసారీ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో లీకులు రావ‌డం ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తోంది. అందులోనూ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ చాంబ‌ర్‌లోకే రావ‌డం ఆశ్చర్యం క‌లిగించేదే!

Image result for ap assembly

కొత్త ఇల్లు క‌ట్టిన‌ప్పుడు వ‌ర్షం ప‌డితే.. ఎక్క‌డో ఒక‌చోట నుంచి వ‌ర్ష‌పు నీరు రావ‌డం స‌హ‌జమే! కొత్త ఇల్లు కదా అని ఊరుకోవ‌డం మామూలే! కానీ మ‌ళ్లీ మ‌ళ్లీ లీకులు అవుతుంటే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిందే! ఇప్పుడు ఇలాంటి సంఘ‌ట‌నే ఏపీ స‌చివాల‌యం, అసెంబ్లీ భ‌వ‌నాల్లో జ‌రుగుతోంది. ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ దగ్గరుండి మరీ కట్టించిన `అసెంబ్లీ భవనాల` పరిస్థితి విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఒక్క వర్షం కురిస్తే చాలు.. జలపాతాల నుంచి నీరు కారినట్లు గదుల్లోకి నీరు వస్తూ ఉంది. గ‌తంలో కురిసిన చిన్న‌ వర్షానికే ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్లోకి నీరు వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ‌చ్చాయి. దీనిపై ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ప్ర‌భుత్వంపై తీవ్రంగా విమర్శ‌లు గుప్పించారు. ఇందులో కుట్ర జ‌రిగింద‌ని, జ‌గ‌న్  చాంబ‌ర్‌లోకి వెళ్లే పైప్‌లైన్‌ను కోసేశార‌ని మంత్రి నారాయ‌ణ బ‌దులిచ్చారు.

Image result for ap assembly jagan chamber water leak

అంతేగాక మ‌రో ముందుకు అడుగు వేసి సీబీసీఐడీ ఎంక్వైరీకి స‌ర్కారు ఆదేశించింది. విచారణలో నిజం నిగ్గు తేలుతుందని ప్రకటించారు మంత్రులు. అయితే ఆతర్వాత ఇది మ‌రుగున ప‌డిపోయింది. మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. ఓ వర్షం దెబ్బకు జగన్ ఛాంబర్లలోకి నీరు ధారగా కారింది. ఇక టీడీపీ నేతలు ఇప్పుడు కూడా జగన్ పైపులు కోశారని చెప్పటం తప్ప.. మరో మార్గం ఉండ‌దేమో మరి.
Image result for ap assembly jagan chamber water leak
రూ. కోట్లు ఖర్చు పెట్టి కట్టించిన అద్భుతమైన భవనాలు కదా? అసెంబ్లీలోనే కాదు, సచివాలయం గేట్‌-2 వెయిటింగ్‌ హాల్‌ సైతం వర్షపు నీరు లీకేజీ అవుతోంది. వర్షం వచ్చినప్పుడల్లా సచివాలయం, అసెంబ్లీ భవనాల నాణ్యత ఏపీ ప్రజలకు తెలిసిపోతోంది. మ‌రి ఇప్పుడే ఇలా ఉంటే.. మ‌రి ఆకాశ‌హ‌ర్మ్యాల్లాంటి రాజ‌ధాని నిర్మాణాల ప‌రిస్థితి ఏంటో!!


మరింత సమాచారం తెలుసుకోండి: