రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు జగన్ తో తలపడడం సంగతి దేవుడెరుగు కానీ ఎన్నికలు వచ్చేలోగా పార్టీలోని నేతలను బుజ్జగించడం లేదా అదుపులోపెట్టడం కత్తిమీద సాములా తయారయింది. అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల కు ప్రాధాన్యత కల్పించడంతో, ఇటు ఫిరాయింపు నియోజకవర్గాల్లో ఓడిపోయిన టీడీపీ నేతలకు వచ్చేసారి టిక్కెట్ ఇవ్వరేమోనన్న గుబులు వారిని పట్టుకుంది. ఇందునుబట్టే ఫిరాయించిన వారిపై ఓడిపోయినవారు విమర్శిస్తూ వస్తున్నారు.


ముఖ్యంగా బాబుకు రాయలసీమ రాజకీయాలు కొత్త తలనొప్పులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఆళ్లగడ్డ ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియ మధ్య పంచాయితీ చేసిన బాబు భవిష్యత్తులో కడప నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే ఫిరాయించి మంత్రి పదవి సాధించిన ఆదినారాయణరెడ్డి పై జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గరం గరం గా ఉన్న విషయం తెలిసిందే.


తాజాగా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, మంత్రి ఆది పైన సంచలన వాఖ్యలు చేశారు. ఆది తమపై పెత్తనం చేయాలని చూస్తే సహించేది లేదని చెప్పారు. ప్రత్యేక హోదాకై ర్యాలీ చేపడుతున్నట్లు తమకు సమాచారం ఇవ్వకపోగా నిందలు మోపటం ఏమిటని ప్రశ్నించారు. ఆది కూడా జంప్ జిలానీనే, అదృష్టం బాగుండి మంత్రి అయ్యాడని చెప్పారు. తాము  ప్రభుత్వ ఉద్యోగాలు మానుకొని రాజకీయాల్లో చేరినట్లు, ఆది  డబ్బులు దాచిపెట్టుకోవటానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: