ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల జోరు కొనసాగుతుంది.  ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మద్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఎవరి గెలుపు పై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ మరోవైపు కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు రాహూల్ గాంధీ ముమ్మరంగా ప్రచారాలు చేశారు.  అయితే కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి తమ పార్టీ నేత యడ్యూరప్పేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. నెలరోజులకు పైగా కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో పర్యటించానని, ప్రతి జిల్లాలోనూ ప్రజలు బీజేపీకి నీరాజనాలు పలికారని తమ పార్టీ నేత గెలుపు తధ్యం అని అన్నారు.
 సిద్ధరామయ్యకు రెండింట్లోనూ ఓటమి తప్పదు
అంతే కాదు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో 130కిపైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. సిద్ధరామయ్య మరో నాలుగు రోజులు మాత్రమే సీఎం కుర్చీలో ఉంటారని, ఆ తర్వాత తమ పార్టీ నేత యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపడతారని జోస్యం చెప్పారు. సీఎంగా యడ్యూరప్ప బాధ్యతలు చేపట్టాక కేంద్రం నుంచి కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారని, దేశంలోనే కర్ణాటకను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకెళతామని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తోందని దుయ్యబట్టారు. దీనినిబట్టి కాంగ్రెస్ ఎంత నైరాశ్యంలో ఉందో తేటతెల్లమవుతోందన్నారు.

ఆ పార్టీకి కేవలం ఎన్నికల్లో గెలుపు మాత్రమే కావాలని, నైతికత, చట్టాలు అక్కర్లేదని ఆరోపించారు. ఏదోలా గెలవానుకేనే కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీపై విమర్శలు గుప్పిస్తోందని అన్నారు.  సిద్ధరామయ్య ప్రభుత్వం మన దేశంలో అత్యంత అవినీతికర ప్రభుత్వమని ఆరోపించారు. కాంగ్రెస్ వలలో పడవద్దని నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నవారిని కోరుతున్నట్లు తెలిపారు.
130సీట్లతో ప్రభుత్వం.. యడ్డీ ఐదేళ్ల సీఎం..
ప్రజలకు సేవ చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తమకు ఓ అవకాశం ఇవ్వాలని కర్ణాటక ప్రజలను కోరారు.మహారాష్ర్టలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలను తగ్గించిందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అమిత్ షా ఆరోపించారు. సిద్ధరామయ్య ప్రభుత్వం బెంగళూరుకు చేసిందేమీ లేదని, బెంగళూరులో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: