సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కన్నా లక్ష్మినారాయణకు బీజేపీ అధ్యక్షపదవి దక్కింది. ఊహించని విధంగా కన్నా లక్ష్మినారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించడం ఆ పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే కన్నాకు అధ్యక్ష పదవి బీజేపీకి కొన్ని లాభాలతో పాటు నష్టాలను కూడా తీసుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది.

Image result for kanna lakshmi narayana

          కన్నా లక్ష్మినారాయణ కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ పైన ముఖ్యంగా చంద్రబాబుపై విరుచుకుపడడంలో సిద్ధహస్తుడు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని అంచనా వేసిన కన్నా లక్ష్మినారాయణ.. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బీజేపీలో చేరిపోయారు. నాలుగేళ్లుగా ఆ పార్టీలో కొనసాగుతున్నారు. నాలుగేళ్లలో బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. అయితే కంభంపాటి హరిబాబు తర్వాత అధ్యక్ష పదవి తనకు దక్కుతుందని ఆశించారు కన్నా. అయితే తనకు బదులు సోము వీర్రాజుకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఊహాగానాలు రాగానే వెంటనే వైసీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. చివరి నిమిషంలో బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగించడంతో శాంతించారు. ఆసుపత్రిలో చేరి వైసీపీలో చేరకుండా తప్పించుకున్నారు.

Image result for kanna lakshmi narayana

          పది రోజుల క్రితం పార్టీనే మారాలనుకున్న వ్యక్తికి ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవి దక్కింది. ఇది బీజేపీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కన్నా లక్ష్మినారాయణ బీజేపీ మూలాలున్న వ్యక్తి కాదు. ఇది మైనస్. సుమారు 3 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ భావజాలాన్ని నింపుకున్న వ్యక్తి. అయినా నాలుగేళ్లుగా బీజేపీలో ఉంటున్నారు కాబట్టి ఆయన్ను కాదనలేం. అయితే బీజేపీలోనే పుట్టి పెరిగిన అనేక మందిని కాదని నాలుగేళ్ల క్రితం పార్టీలో చేరిన వ్యక్తికి పట్టం కట్టడం బీజేపీ శ్రేణులకు రుచించడం లేదు. బీజేపీ అధిష్టానం మాటను తు.చ. తప్పకుండా పాటించే సోము వీర్రాజే అధిష్టానం నిర్ణయంపై ధిక్కార స్వరం వినిపించాడంటే ఇక ఇతరుల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కన్నాను అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే సోము వీర్రాజు వర్గం రాజీనామాలు చేసింది. మిగిలిన నేతలు బయటపడకపోయినా త్వరలోనే వీళ్లంతా కన్నాకు వ్యతిరేకంగా సంఘటితమయ్యే అవకాశముంది. మరికొంతమంది పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.

Image result for kanna lakshmi narayana

          ఇక కన్నాకు అధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక కులం ప్రధాన పాత్ర పోషించింది. రాజకీయ అధికారం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నాకు పదవి ఇవ్వడం వల్ల సహజంగా ఆ వర్గం ఓట్లు వస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికే చెందిన నేత కావడంతో ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ ఇబ్బందిని బీజేపీ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి. కన్నా నియామకం ద్వారా బీజేపీ కొన్ని సిద్ధాంతాలను పక్కనపెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. సంఘ్ భావజాలంతో పనిలేకుండా కులం, ఆర్థకబలం ఉన్నవారికి పదవులు కట్టబెట్టడం ద్వారా తమకు రాజ్యాధికారమే ముఖ్యమని చాటిచెప్పినట్టయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: