అనేక లెక్క‌లు, అంచ‌నాలు, కూడిక‌లు, తీసివేత‌లు.. ఇలా గ‌డిచిన రెండు మాసాలుగా ముఖ్యంగా గ‌డిచిన రెండు వారాలుగా దేశ ప్ర‌జ‌ల‌కు ప‌రీక్ష పెట్టిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా, ఏ ఒక్క‌రూ మాట‌కైనా అన‌లేని విధంగా బీజేపీని ఆకాశానికి ఎత్తేశాయి. క‌ర్నాట‌క అసెంబ్లీకి శ‌నివారం ముగిసిన ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభం కాగానే.. ఆది నుంచి కూడా బీజేపీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంది. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థి సిద్దూకు తిరుగులేద‌ని భావించిన కాంగ్రెస్ మాత్రం రెండో అంతంత మాత్రంగానే ముందుకు సాగింది. దీంతో ఇప్ప‌టి వ‌రకు వ‌చ్చిన అనేక స‌ర్వేలు, ఎగ్జిట్ పోల్ ఫ‌ల‌తాలు అన్నీ కూడా త‌ల్ల‌కిందులు అయ్యాయి. మొత్తంగా బీజేపీ మ‌రోసారి ద‌క్షిణాది రాష్ట్రంలో జెండా ఎగుర‌వేసింది. 


అయితే, క‌మ‌ల ద‌ళం ఇలా విజయదుందుభి మోగించడానికి పలు కారణాలు క‌నిపిస్తున్నాయి. మొద‌టి నుంచి కూడా రాష్ట్రంలోని లోపాల‌ను గుర్తించ‌డం, కాంగ్రెస్‌కు అనుకూల, వ్య‌తిరేక నియోజ‌క‌వ‌ర్గాల‌పై గ‌ట్టి ప‌ట్టు సాధించ‌డం, ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగ‌డం వంటివి క‌మ‌లానికి క‌లిసొచ్చాయి. ఇక‌, అదేస‌మ‌యంలో లింగాయత్ లకు మైనారిటీ హోదా కల్పించడంతోపాటు వారికి ప్రజాకర్షక పథకాలు ప్రకటించి వారి ఓట్లను కైవసం చేసుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్యను ఇరుకున పెట్టేలా మోడీ, అమిత్ షాలు చేసిన ప్ర‌చారం కూడా స‌క్సెస్ అయింది. మొత్తంగా  లింగాయత్ లు ప్రాబల్యమున్న 36 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

Image result for bjp

దీంతో కాంగ్రెస్ ప్రకటించిన లింగాయత్ ల ప్రజాకర్షక పథకాలు పనిచేయలేదని స్ప‌ష్ట‌మవుతోంది. లింగాయత్ లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ కేవలం 16 అసెంబ్లీ స్థానాల్లోనే ముందుంది. కావేరీ నదీ జలాల వివాదాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు జాప్యం చేయడం కర్ణాటకలో ఆ పార్టీకి లాభించింది. కర్ణాటకలో మఠాల ప్రభావం ఓటర్లపై అధికంగా ఉండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఇది ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించింది. ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, బెంగళూరు నగరంలోనూ బీజేపీ ఘన విజయం సాధించింది. 

Image result for bjp

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారం, అమిత్ షా రాజకీయ వ్యూహాలు,  బళ్లారిలో గాలి సోదరుల ప్రభావం, యెడ్యూర ప్ప రాజకీయ వ్యూహాలతో కర్ణాటకలో కమలం వికసించిందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చేందుకు బీజేపీ వ్యూహం పన్నడంతో కాంగ్రెస్ పరాజయం పాలైందని భావిస్తున్నారు. అతిపెద్ద పార్టీగా విజయపతాకం ఎగురవేసిన బీజేపీ కర్ణాటకలో సర్కారు ఏర్పాటు చేయనుంది. ఇక‌, ఇదేస‌మ‌యంలో ప్రాంతీయ పార్టీగా ఆధిక్యం సాధించి కింగ్ మేక‌ర్ కావాల‌ని భావించిన జేడీఎస్‌.. మూడో స్థానానికే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. ఈ ప‌రిణామాలు రాజ‌కీయ దురంధ‌రుల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: