కర్నాటకలో బీజేపీకి గట్టిదెబ్బే తగిలింది. సంఖ్యాబలం లేకపోయినా గవర్నర్ అండదండలతో ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన యడ్యూరప్ప బలపరీక్షకు ముందే తప్పుకున్నారు. మరికొన్ని నిమిషాల్లో బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా.. భావోద్యేగ ప్రసంగం చేసిన యడ్యూరప్ప తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ నుంచి నేరుగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించారు.

Image result for karnataka

          కర్నాటక అసెంబ్లీలో నాటకీయ పరిణామాల మధ్య యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 3.30 గంటలకు సభ సమావేశమైంది. కొంతమంది సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం యడ్యూరప్ప ప్రసంగం ప్రారంభించారు. విశ్వాసతీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాతే ప్రసంగించాల్సిందిగా కాంగ్రెస్, జేడీఎస్ లు పట్టుబట్టడంతో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు యడ్యూరప్ప. అనంతరం భావోద్వేగంతో ప్రసంగించారు.

Image result for karnataka

          ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినందుకు, ఇందుకు సహకరించిన ప్రజలకు యడ్యూరప్ప ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారం చేశానన్నారు. కాంగ్రెస్ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారన్నారు.  ఏ రాష్ట్రంలో లేని విధంగా మోడీ, అమిత్‌షా తనను ముందే సీఎం అభ్యర్థిగా ప్రకటించారన్నారు యెడ్డీ. అయితే.. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా కాంగ్రెస్, జేడీఎస్ లు ప్రభుత్వ ఏర్పాటుకు యత్నించడం బాధాకరమన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా మాకు ప్రజాసేవ చేసుకునే భాగ్యం దక్కకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా సిద్ధరామయ్య మొండి నిర్ణయాలు తీసుకున్నారని ఆయన హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. రైతులకు మంచి చేద్దామనుకున్నానని తెలిపారు. మోడీ పాలన చూసి కర్ణాటక ప్రజలు మాకు 104 సీట్లు ఇచ్చారన్న యెడ్యూరప్ప.. వారి కన్నీళ్లు తుడుద్దామనుకున్నానన్నారు. లక్షన్నరలోపు రైతుల అప్పులను రుణమాఫీ ద్వారా తీర్చేద్దామనుకున్నానని చెప్పారు. అయితే తన ప్రయత్నం ఫలించలేదన్నారు. సిద్ధరామయ్య ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు. ఆదర్శ రాష్ట్రంగా కర్నాటకను తీర్చిదిద్దాలనుకున్నానని అది సాధ్యం కావడం లేదని ఆవేదన చెందారు. ప్రతి ఇంటి సమస్యను పరిష్కరిద్దామనుకున్నానని.. అయితే తగిన బలం లేకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

Image result for karnataka

          అసెంబ్లీలో ప్రసంగం అనంతరం యడ్యూరప్ప నేరుగా రాజ్ భవన్ కు చేరుకుని రాజీనామా సమర్పించారు. గతంలో రెండుసార్లు ముఖ్యమంత్రి పదవికి అర్ధాంతరంగా రాజీనామా చేసిన యడ్యూరప్ప.. ఇప్పుడు కేవలం 3 రోజుల్లోనే రాజీనామా చేశారు. యెడ్డీ రాజీనామాతో కాంగ్రెస్- జేడీఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: