విజయవాడలో పౌరోహిత్యం చేసుకొంటూ చాలీచాలని సంపాదనతో సత్తిరాజు విజయకృష్ణ తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆ పేద పురోహితుని చిన్న కుమార్తె రేవతికి పుట్టుకతోనే కండరాలకు సంబంధించిన మస్క్యులర్ డిస్ట్రఫీ అనే వ్యాధితో బాధపడుతోంది. కాళ్ళు, చేతులు బిగుసుకుపోవడం, మెడ నిలబెట్టలేకపోవడం లాంటి సమస్యలతో రేవతి ఇబ్బందిపడుతోంది. తగిన వైద్యం చేయించకపోతే ఒక్కో అవయవం క్షీణించిపోయే ప్రమాదం ఉంది.  


విశాఖపట్నంలో ఈ రోజు ఉదయం సత్తిరాజు విజయకృష్ణ కుటుంబం  పవన్ కళ్యాణ్ ని కలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి రేవతిని చూసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఒక్కసారే చలించిపోయారు. రేవతిని బెంగళూరులోని నిమ్ హన్స్ ఆసుపత్రిలో చూపించామని, పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు వైద్యం ఉందనీ, ఖర్చు చాలా అవుతుందని వైద్యులు చెప్పారని పవన్ కు రేవతి తల్లిదండ్రులు చెప్పారు. ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయించాల్సి వస్తోందని, ఒకవేళ చేయించకపోతే కండరాలు బిగుసుకుపోయి చాలా బాధపడుతోందని ఆమె తల్లి చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ కళ్లు చెమర్చాయి. 

ఆ చిన్నారికి అవసరమైన బ్యాటరీ వీల్ ఛైర్ సమకూర్చడంతో పాటు వైద్యం కోసం మైసూరుకు వెళ్ళేందుకు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని పవన్ కోరుకున్నారు.  పవన్ కల్యాణ్ హామీతో ఆ కుటుంబం ఎంతో సంతోషపడింది.పవన్ కళ్యాణ్ ఒళ్లో కూర్చున్న చిన్నారి రేవతి ఎన్నో ముచ్చట్లు చెప్పింది.

గబ్బర్ సింగ్ సినిమా అంటే తకు ఇష్టమని చెప్పింది. ఆ సినిమాలో   పాటలు పాడి, డైలాగ్స్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఎంతో ముచ్చట పడ్డారు. రేవతి పాడిన అన్నమయ్య కీర్తనలు విని ‘ఈ కీర్తనలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా’ అని అడిగితే  ‘మా సంగీతం మిస్ నేర్పుతున్నారు’ అని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: