దీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ –జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని ఇరుపార్టీలు భావిస్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీతో నిన్న జరిగిన భేటీలో జేడీఎస్ నేత, కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గంలో భాగస్వామ్యపక్షాల ప్రాతినిధ్యంతో పాటు పలు అంశాలను ఆయన చర్చించారు. రేపటి తన ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని రాహుల్, సోనియాను ఆయన కోరారు...

Image result for jds congress

దేశవ్యాప్తంగా వరుస విజయాలతో ఊపుమీదున్న బీజేపీని కర్ణాటకలో నిలువరించడం ద్వారా భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించిన కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు .. మరో అడుగు ముందుకేశాయి. గతంలో ఇరుపార్టీల మధ్య నెలకొన్న విభేదాలను మర్చిపోయి దీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. బుధవారం జరిగే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్లిన కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి.. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు రాహుల్, సోనియాతో చర్చలు జరిపారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం ఎక్కువ కాలం కొనసాగబోదంటూ వస్తున్న ఊహాగానాల్ని కొట్టిపారేసిన ఇరు పార్టీల నేతలు... ప్రభుత్వ నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు వీలుగా ఆరుగురు సభ్యులతో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

Image result for jds congress

బుధవారం ఏర్పాటయ్యే కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన ఒక్కొక్కరిని ఉపమఖ్యమంత్రులుగా తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే ఉండేలా వీరి మధ్య ఒప్పందం కుదిరింది. తమ పార్టీ నుంచి ఉపముఖ్యమంత్రి, స్పీకర్ అభ్యర్ధులను ఇవాళ కాంగ్రెస్ ప్రకటించనుంది. కాంగ్రెస్ తరఫున డిప్యూటీ సీఎం రేసులో కేపీసీసీ ఛీఫ్ పరమేశ్వర ముందున్నారు. మిగతా మంత్రులపై ఏకాభిప్రాయ సాధన కోసం కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కేకే వేణుగోపాల్.. జేడీఎస్ నేతలతో ఇవాళ చర్చలు జరపనున్నారు.

Image result for jds congress

రేపు సీఎం కుమారస్వామితో పాటు డిప్యూటీ సీఎంలు, మరికొందరు మంత్రులు మాత్రమే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం 24 గంటల్లో బలపరీక్ష నిర్వహించడంతో పాటు స్పీకర్ ఎంపికను కూడా పూర్తిచేయాలని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు భావిస్తున్నారు. రేపటి తన ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కుమారస్వామి ఆహ్వానించారు. భేటీ అనంతరం తాను కర్ణాటక ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరవుతున్నట్లు రాహుల్ గాంధీ ట్విట్టర్ లో వెల్లడించారు. కుమారస్వామి తన ప్రమాణస్వీకారానికి నాలుగు బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రివాల్ లను ఆహ్వానిస్తున్నారు. వీరితో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ లను కూడా ఆహ్వానిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు భవిష్యత్తులోనూ కలిసి పనిచేయాలని కాంగ్రెస్-జేడీఎస్ నిర్ణయించాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలోని 28 పార్లమెంటు స్ధానాల్లోనూ తాము కలిసే పోటీ చేస్తామని ఇరుపార్టీల నేతలు చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: