ఉద్య‌మాల గడ్డ సిక్కోలు నుంచి పోరాట యాత్ర ప్రారంభించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నాడు. ప్ర‌భుత్వ‌ అవినీతిపై శ‌మ‌ర‌శంఖం పూరిస్తున్నాడు. స్థానిక నాయ‌కులు, ఎమ్మెల్యేలు, వారి బంధువుల అక్ర‌మాలపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు. ప్ర‌స్తుతం సిక్కోలులోని ఇచ్ఛాపురం నుంచి మొద‌లైన పోరాట యాత్ర‌.. మూడో రోజుకు చేరుకుంది. జీడిపప్పుకు ప్ర‌సిద్ధి చెందిన ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో యాత్ర కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శివాజీ అల్లుడి అవినీతిపై ప‌వ‌న్ గుప్పించిన సెటైర్లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. అల్లుడి గిల్లుడిపై ప‌వ‌న్ చేసిన కామెంట్ల‌కు స్థానికుల నుంచి వ‌స్తున్న మంచి స్పంద‌న రావ‌డం కూడా టీడీపీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. 

Image result for tdp

జ‌న‌సేన‌ను స్థానికంగా బ‌లోపేతం చేయ‌డంపై దృష్టిసారించిన ప‌వ‌న్‌.. అంతే స్థాయిలో టీడీపీ అవినీతిపై ఫోక‌స్ పెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కూ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పించి.. సంచ‌ల‌నం సృష్టించారు. ఇప్పుడు ఎమ్మెల్యేల అక్ర‌మాల‌పై దునుమాడుతున్నాడు. ప్రస్తుతం పోరాట యాత్ర పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ పర్యటిస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ప్రస్తుతం.. పవన్ యాత్ర శ్రీకాకుళంలో సాగుతోంది. కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన పవన్.. స్థానిక ఎమ్మెల్యే (పలాస) అల్లుడి అవినీతి భాగోతాన్ని ప్రస్తావించిన సంచలనం సృష్టించారు. ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో పన్నులు కడుతున్న ప్రజలు.. పలాసాలో ఎమ్మెల్యే అల్లుడికీ వ్యాపారులు జీఎస్టీ చెల్లించాల్సి వస్తోందంటూ మండిపడ్డారు. వీటిపై ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 

Image result for pawan kalyan

టీడీపీ సర్కారులో భూకబ్జాలు ఎక్కువయ్యాయని చెప్పిన పవన్.. పలాసాలో భూకబ్జాలు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయిన వైనాన్ని ప్రస్తావించారు. పవన్ నోటి నుంచి స్థానిక ఎమ్మెల్యే అల్లుడి ప్రస్తావన వచ్చినప్పుడు.. సభకు హాజరైన ప్రజల్లో విశేష స్పందన రావటం గమనార్హం. ప్రజల్లో ప్రభుత్వంపై.. స్థానిక నాయకత్వం మీదా వ్యతిరేకత ఇంత భారీగా పెరిగిన వైనాన్ని చంద్రబాబు ఎందుకు గుర్తించటం లేదన్నది ప్రశ్నగా మారింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో అవినీతి మీద అదే పనిగా మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు తన ప్రభుత్వంలోనూ అంతే తీవ్రతతో అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నా కిమ్మనని పరిస్థితి. 


మరింత సమాచారం తెలుసుకోండి: