5 రోజులుగా ఉత్తరాంధ్రలో మకాం వేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇవాళ టెక్కలిలో కవాతు నిర్వహించిన జనసేనాని .. చంద్రబాబు సర్కార్ పై నిప్పులు చెరిగారు. అసమర్థ, చేతగాని ప్రభుత్వంగా అభివర్ణించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిస్తే తానే 2014లో పోటీ చేసేవాణ్ణని పవన్ అన్నారు. తప్పు చేశానని ఒప్పుకున్నారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా పోరాటానికి టీడీపీ తూట్లు పొడుస్తూ.. ధర్మపోరాట సభలు నిర్వహించడం విడ్డూరమని పవన్ ఆరోపించారు. టెక్కలిలో ప్రసంగించిన ఆయన.. ధర్మపోరాట సభకు 40 లక్షలు ఖర్చు చేసిన టీడీపీ.. ఇక్కడ మంచి నీళ్లు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాను తూట్లు పొడిచిన చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ధర్మపోరాట దీక్షలు చేయడం విడ్డూరమని విమర్శించారు. 24 గంటల్లోగా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు పరిష్కరం కాకపోతే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు వైద్యం అందడం లేదని.. కనీసం ఆరోగ్య శాఖ మంత్రి కూడా లేని స్థితిలో రాష్ట్రం ఉందని ఎద్దేవా చేశారు.  


టెక్కలిలో నిరసన కవాతు జరగకుండా ఉండేందుకు లారీలు అడ్డంపెట్టారని.. అలాగే పలాసలో కిరాయి రౌడీల చేత తనపై దాడి చేయించారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఎవరికి భయపడేది లేదని.. అన్ని వదులుకుని జనం కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే జనసేన అధికారంలోకి రావాలని పవన్ పిలుపునిచ్చారు.


దేశంలో ఎక్కడికెళ్లినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సైనికుడు కనిపిస్తాడని, సెల్యూట్ చేస్తుంటాడని పవన్ చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళంలో భరతమాతకు గుడి ఉందన్నారు. స్వేచ్ఛామాతకు పుట్టినిల్లయిన శ్రీకాకుళంలో తాను పోరాట యాత్ర చేపట్టడం గర్వంగా ఉందన్నారు. అందుకే తాను మిలటరీ చొక్కా వేసుకున్నానని పవన్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: