కొంతకాలం క్రితం వరకూ దేశంలో ఎక్కడికెళ్లినా మళ్లీ మోదీ రావడం ఖాయమనే మాట వినిపిస్తూ వచ్చింది. బలమైన ప్రభుత్వం... మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం... అంతర్జాతీయంగా వెలిగిపోతున్న మోడీ ప్రభ... లాంటివి వచ్చే  సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడం ఖాయమనే భరోసా కల్పించాయి. అయితే ఇప్పుడు అవన్నీ నిజం కాదనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజా సర్వేలో మోదీ టైం ఏమాత్రం బాగోలేదని స్పష్టమైంది. మోడీకి ఎట్టిపరిస్ధితుల్లోనూ రెండోసారి అధికారం ఇవ్వకూడదని ఓటర్లు కోరుకుంటున్నారు. ABP-CSDS మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఈ విషయమే వెల్లడైంది. ఏప్రిల్ 22- మే 17  మధ్య 19 రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం రాకూడదని 47శాతం మంది ఓటర్లు కోరుకుంటున్నట్లు తేలింది. ఈ సర్వే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇన్నాళ్లూ మోదీ తప్ప మరో మాట వినిపించని నోట ఇప్పుడు కొత్త మాటలు వినిపిస్తున్నాయ్.

Image result for Narendra modi rule

కర్ణాటక శాసనసభ  ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ కూటమికి అధికారాన్ని కట్టబెట్టాయి. సీఎంగా ప్రమాణస్వీకారం చేసినా.. ఎమ్మెల్యేల కోసం బేరసారాలు సాగించినా.. చివరికి బీజేపీ నేత యడ్యూరప్పకు అధికారం అందని ద్రాక్షగానే మిగిలింది. ఇది కేవలం యడ్యూరప్పకే కాదు.. ఆయన వెనుక ఉన్న ప్రధాని  నరేంద్రమోదీకి, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు కూడా పెద్ద ఎదురు దెబ్బగానే భావించాల్సిన పరిస్ధితి. తమ చాణక్యంతో వరుసగా ఒక్కో రాష్ట్రాన్నీ తమ ఖాతాలో వేసుకుంటున్న బీజేపీకి కర్ణాటకలో తగిలిన ఎదురుదెబ్బ... భవిష్యత్ రాజకీయాలకు ఓ సూచిక కానుందా.. అంటే అవుననే అంటోంది ABP-CSDS మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే. మారిన పరిస్ధితుల్లో దేశవ్యాప్తంగా రెండు ప్రధాన రాజకీయ కూటములపై ప్రజల అంచనాలు ఎలా ఉన్నాయనే అంశంపై ABP-CSDS ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 15,859 మందితో ఈ సర్వే నిర్వహించగా...  ఇందులో 47శాతం మంది ఓటర్లు తాము రెండోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీకి కూడా ఈ సర్వే ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చినట్లయింది.

Image result for Narendra modi rule

దేశంలో మైనారిటీలు, ఆదివాసీలు, దళితులపై పెరిగిపోతున్న దాడులు, వాటిని అరికట్టడంలో ఎన్డీయే సర్కారు వైఫల్యం, మత రాజకీయాలు, అధికారం  కోసం ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడే తత్వం.. ఇవన్నీ  రాబోయే ఎన్నికల్లో మోడీ కొంపముంచేలా కనిపిస్తున్నాయి. ABP-CSDS మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే లో పాల్గొన్న వారిలో 47 శాతం మంది తాము మోడీ ప్రభుత్వానికి  రెండోసారి ఓటు వేయబోమని చెప్పగా.. 39 శాతం మంది ఓటేస్తామని చెప్పారు. మిగిలిన వారు ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు తాను సిద్ధమని యువనేత రాహుల్ గాంధీ సంకేతాలు ఇచ్చారు. అటు మోడీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో నాలుగింట మూడోవంతు ముస్లింలు, ఐదింట మూడోవంతు మంది క్రిస్టియన్లు, సగం మంది సిక్కులు మరోసారి మోడీని అధికారంలో చూడదలచుకోలేదని  సర్వేలో చెప్పారు. సంప్రదాయ ముస్లిం ఓటర్లే కాకుండా మెజారిటీ హిందూ ఓటర్లు కూడా మోడీని కోరుకోవడం లేదని ఈ సర్వే తేల్చింది.  మోడీకి మరోసారి అధికారం ఇచ్చే విషయంలో హిందూ ఓటర్లు రెండుగా చీలినట్లుఈ సర్వే స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో మోడీకి రెండోసారి అధికారం ఇవ్వాలని 44శాతం మంది హిందూ ఓటర్లు కోరుకోగా.. ఇవ్వకూడదని 42శాతం మంది తేల్చిచెప్పారు.

Image result for abp csds survey

సర్వేలో పాల్గొన్న దళితుల్లో 55 శాతం, ఆదివాసీల్లో 43శాతం, ఓబీసీల్లో 42శాతం మంది మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చూపారు. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి ఓటు వేస్తామని 32శాతం మంది ఓటర్లు చెప్పారు.. ఈ ఏడాది ప్రారంభంలో ఇదే సంస్ధ నిర్వహించిన సర్వేలో బీజేపీకి ఓటు వేస్తామని 34శాతం మంది చెప్పడం విశేషం. 2013లో ABP-CSDS నిర్వహించిన సర్వేలోనూ అప్పటి యూపీఏకు వ్యతిరేకంగా దాదాపు ఇవే ఫలితాలు వచ్చాయి. అప్పట్లో యూపీఏకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని 39శాతం మంది చెప్పగా... 31శాతం మంది తిరిగి ఓటేస్తామన్నారు. చివరికి ప్రజా వ్యతిరేకతో యూపీఏ ప్రభుత్వం కనీస సీట్లకు పరిమితం  కాగా.. బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి మాత్రం మోదీ హవా తగ్గుతున్నట్టు సర్వేలో స్పష్టమైంది. పైగా ఇప్పుడు ఎన్డీయే నుంచి శివసేన, టీడీపీ లాంటి కీలక పార్టీలు బయటికొచ్చాయి. వారితో కలుపుకుని చేసిన సర్వే ఇది. ఇప్పుడు ఆ పార్టీల బలాలను తీసేస్తే ఎన్డీయే కూటమికి కష్టకాలం తప్పకపోవచ్చు.

Image result for abp csds survey

మరింత సమాచారం తెలుసుకోండి: