తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి 40 ఏళ్ల రాజకీయ అనుభవముంది. క్లిష్ట సమయాల్లో పార్టీని కాపాడుకున్న నేతగా ఆయనకు పేరుంది. ఎన్నో సమస్యలను ఆయన చాకచక్యంగా డీల్ చేశారు. ఆయన ప్రయోగాలు ఒక్కోసారి సూపర్ సక్సెస్ అయితే మరికొన్నిసార్లు మాత్రం సూపర్ ఫ్లాప్ అయ్యాయి. రాజకీయాల్లో గెలుపు ఓటములు కామన్ కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.


          2019 ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయముంది. ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ముఖ్యంగా కర్నాటక ఎన్నికలు దేశ రాజకీయాలను ఓ మలుపు తిప్పాయి. పార్టీలన్నీ ఆ గట్టో.. ఈ గట్టో.. తేల్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి. బీజేపీ ఓటమిని కోరుకుంటున్న పార్టీలన్నీ బెంగళూరులో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరయై తమ గట్టు ఇదీ అని తేల్చేశాయి. దేశంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ ఇక్కడ తేలడంతో వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ తప్పదనే సంకేతాలిచ్చాయి.

Image result for tdp trs and congress

          కర్నాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణం చేశారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఆయన కాంగ్రెస్ అధినేతలతో కలిసి వేదిక పంచుకోవడం ఇదే తొలిసారి. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్  వైపు వెళ్తారనే ఊహాగానాలకు బలం చేకూరింది. రాహుల్ గాంధీతో కరచాలనం చేసి.. ఆయన భుజం తట్టారు చంద్రబాబు. ఇవి గతంలో ఎన్నడూ చూడని చిత్రాలు. కాంగ్రెస్ – టీడీపీల స్నేహం వచ్చే ఎన్నికల్లో సరికొత్త సమీకరణాలు తీసుకొస్తుందని కొంతమంది భావిస్తున్నారు.

Image result for tdp trs

          తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయాధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెస్ ను ఒక్క మాట కూడా అనలేదు.. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ ను కనీసం ప్రస్తావించలేదు. దీంతో చంద్రబాబు ఇలా చేశారేంటి... అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. తెలంగాణలో చాలా మంది టీడీపీ నేతలు టీఆర్ఎస్ తో కలసి పనిచేయాలని కోరుకుంటున్నారు. పార్టీ మనుగడ సాధించాలంటే టీఆర్ఎస్ తో పొత్తు తప్పదని చంద్రబాబుకు సూచించారు. అదే సమయంలో కాంగ్రెస్ ను కూడా విమర్శించకుండా చంద్రబాబు చాకచక్యత ప్రదర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షహోదాలో బలంగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లాల్సి వస్తే... తెలంగాణలో కూడా హస్తం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశముంది. ఎన్నికల ముందు టీఆర్ఎస్, కాంగ్రెస్ లతో ఏ పార్టీతో ఎక్కువ మేలు జరుగుతందని భావిస్తే ఆ పార్టీతో కలిసి వెళ్లే అవకాశముంది. అందుకే మహానాడులో బాబు సేఫ్ గేమ్ ఆడారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: