కర్నాటక ఎన్నికలు బహుశా బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటాయి. దేశవ్యాప్తంగా అప్రహతిహత విజయాలు సాధిస్తూ వస్తున్న బీజేపీ.. కర్నాటకలో కూడా కమలవికాసమేనని ధీమాగా ఉండేది. అయితే ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనంత సంఖ్యాబలం లభించలేదు. అయినా ఎలాగోలా మద్దతు కూడగట్టగలమనే ధీమాతో గవర్నర్ అండదండలతో యడ్యూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది బీజేపీ అధిష్టానం. అయితే సుప్రీంకోర్టు అక్షింతలతో నిర్దేశిత గడువు కంటే ముందుగానే బలనిరూపణ చేసుకోవాల్సి రావడంతో యడ్యూరప్ప చేతులెత్తేయాల్సి వచ్చింది. బలం నిరూపించుకోకముందే రాజీనామా చేసి కాస్త పరువు నిలుపుకున్నారు.

Image result for karnataka

          సంఖ్యాబలం లేకపోయినా పాలనాపగ్గాలు చేపట్టి మూడ్రోజుల్లోపే చేతులు కాల్చుకున్న బీజేపీ మరో తప్పిదం చేసింది. కుమార స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారం రోజుల్లోపు బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. అయితే శుక్రవారమే బలనిరూపణకు దిగారు కుమారస్వామి. ఇంతలో స్పీకర్ రేసులో తమ అభ్యర్థిని నిలపాలని భావించింది బీజేపీ. రాజాజీనగర నుంచి ఎన్నికైన ఎస్.సురేష్ కుమార్ ను స్పీకర్ రేసులో నిలిపింది. స్పీకర్ ఎన్నిక సమయానికి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి కె.ఆర్.రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Image result for karnataka

          తమకు తగినంతమంది మద్దతు లేదని తెలిసీ ఓసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి చేతులు కాల్చుకుంది బీజేపీ. ఇప్పుడు స్పీకర్ రేసులో తమ అభ్యర్థిని నిలబెట్టి మరోసారి పరువు తీసుకుంది. స్పీకర్ పదవి చేపట్టేందుకు అవసరమైన సంఖ్యాబలం ఉంటే ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దక్కేది. అంత బలం లేకనే చేతికొచ్చిన అవకాశాన్ని వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆ విషయం తెలిసీ స్పీకర పదవికి పోటీ పెట్టడం, చివరి నిమిషంలో వైదొలగడం ఆ పార్టీ అసంబద్ధ చర్యలకు నిదర్శనం.

Image result for karnataka

          స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకే వైదొలిగాం అని చెప్పుకోవడానికి బీజేపీ ఈ పని చేసి ఉండొచ్చు. కనీసం కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత బల నిరూపణ సమయం వరకూ కూడా బీజేపీ వెయిట్ చేయలేదు. విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కుమారస్వామి కాసేపు మాట్లాడారు. అనంతరం మాట్లాడిన ప్రతిపక్షనేత యడ్యూరప్ప.. సీఎం కుమారస్వామిపై నిప్పులు చెరిగారు. చివరకు ఓటింగ్ వరకూ వెయిట్ చేయకుండా వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో కుమారస్వామి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.

Image result for karnataka

తమ సభ్యులు కూడా ఎక్కడ చేజారిపోతారోననే భయం బీజేపీకి పట్టుకోవడం వల్లే వాకౌట్ చేసిందని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆరోపించారు. అయితే కాగ్రెస్ – జేడీఎస్ ఆరోపణలు బీజేపీ ఖండించింది. అప్రజాస్వామిక పొత్తును నిరసిస్తూ సోమవారం కర్నాటక బంద్ చేపట్టనున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఏదైతేనేం.. కర్నాటక ఎన్నికలు మాత్రం బీజేపీకి గట్టి గుణపాఠం నేర్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: