జాతీయంగా, అంతర్జాతీయంగా అంతులేని ఖ్యాతి గాంచిన మోదీ పాలన ఆర్థికంగా మాత్రం ఈ నాలుగేళ్లలో ఎన్నో అనుమానాల్ని తెరపైకి తెచ్చింది. నోట్ల రద్దుతో రాజు-పేద అనే బేధం లేకుండా అన్ని వర్గాల నడ్డి విరిచింది. జీఎస్టీ వ్యాపారుల్లో కొత్త భయాల్ని రాజేసింది. నల్లధనం వెనక్కి రాకుండానే.. ఉన్న ధనాన్ని మాల్యాలు, మోదీలు దోచుకుపోవటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జన్ ధన్ ఖాతాల్లో పేదలకు 15 లక్షలు జమ చేస్తానని చెప్పిన మోదీ.., నగదురహిత లావాదేవీలు అంటూ, ఖాతాల్లో ఉన్న పాతిక, పరకను సైతం ఖాళీ చేస్తున్నారన్న అసంతృప్తి పెరిగిపోయింది. ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ మాటల్లో చెప్పాలంటే మోదీ పాలనలో బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పోయింది. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.

Image result for modi government schemes

కేంద్రంలో కొలువుతీరిన నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్థిక వ్యవస్థకు తలకొరివి పెట్టిందని మాజీ ప్రధాని నుంచి ఆర్థిక మేధావుల వరకూ అంతా ముక్తకంఠంతో ఒకటే విమర్శ చేస్తున్నారు. ప్రపంచ ఆర్థికరంగంలో జరిగే ప్రతిఘటన దేశీయ ఆర్థిక వ్యవస్థల్ని ఏదో ఒకస్థాయిలో ప్రభావితం చేస్తున్నప్రస్తుత దశలో అంతర్జాతీయ చమురు ధరల నుంచి అమెరికా – చైనా మధ్య వాణిజ్య ఆంక్షల వరకూ, రూపాయి మారకవిలువ నుంచి దేశీయ ద్రవ్యోల్బణం సహా అనేక అంశాలతో అనుసంధానించి చూస్తే., నాలుగేళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఆందోళన కలిగించ స్థాయిలోనే ఉందనేది ప్రధాన విమర్శ. మోదీ ప్రభుత్వం గద్దెను ఎక్కడానికి ప్రధానంగా దొహదం చేసిన అంశం నల్లధనంపై పోరాటం. దేశంలో నల్లకుబేరులు విదేశాల్లో దాచుకున్న సంపదను వెనక్కి రప్పించి., ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమచేస్తానంటూ తొడగొట్టి చెప్పిన మోదీ, పూర్తిగా విఫలమయ్యారు. కోట్లాది జన్ ధన్ ఖాతాలు తెరిపించి పేదలల్లో ఆశలు పెంచటం తప్ప.. ఒక్క పైసా కూడా వారి జేబుల్లో జమచేయలేకపోయారు…

Image result for demonetisation

ఈ నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం అనేక ఆర్థిక సంస్కరణల్ని తెరపైకి తెచ్చింది. రక్షణ, రైల్వే పరికరాలు వంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచేసింది. బ్యాంకుల నిరర్థక వ్యయాల సమస్యను పరిష్కరించేందుకు రుణగ్రస్తత - దివాలా స్మృతిని రూపొందించడం, ముద్రా బ్యాంకు ఏర్పాటు ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నిధులు అందించడం వంటి అనేక ప్రయోగాలు చేసింది. వీటిలో కొన్ని సంస్కరణలు నిస్సందేహంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు దోహదపడ్డాయి. అయితే అది నాణానికి ఒకవైపే. రెండో వైపు ఆర్థిక వ్యవస్థనే ప్రశ్నార్థకం చేసేలా నోట్ల రద్దు, ప్రతిసేవకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి వంటి నిర్ణయాలు  వివాదాస్పదంగా మారాయి… పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ మధ్యతరగతిని తీవ్రంగా దెబ్బకొట్టింది. నల్లధనాన్ని తుడిచిపెట్టి, ప్రజలను నగదు లావాదేవీల నుంచి డిజిటల్‌ లావాదేవీలకు మళ్ళించే లక్ష్యంతో 2016 నవంబరులో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఫలితాలు తేలని పద్దుగానే మిగిలిపోయింది. కేవలం పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగిందన్న ఊరటను మినహాయిస్తే., నల్లధనం తగ్గుముఖం పట్టిందనేందుకు సరైన ఆధారాల్లేవు. నగదు కొరత దేశ ప్రజలను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టింది. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ముఖ్యంగా అసంఘటిత రంగంలోని 55శాతం సంస్థలు తమ కూలీలకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో పడిపోయాయి. పరిశ్రమల కార్యకలాపాలపై భారీ దెబ్బ పడింది. దేశంలోని ఏ ప్రాంతంలో ఎంత మొత్తం నగదు అవసరమన్న కనీస అవగాహన కొరవడిన ప్రభుత్వం- బ్యాంకుల్లోనూ, ఏటీఎంలలోనూ సరిపడా డబ్బు ఉంచకపోవడం ద్వారా సామాన్యుడిని ముప్పుతిప్పలు పెట్టింది…

Image result for demonetisation

ఫైనాన్షియల్‌ రెజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ - ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లును  బ్యాంకుల నష్టాలను ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించడం ద్వారా భర్తీ చేసేందుకే ప్రవేశపెడుతున్నారన్న వార్తలూ ప్రజలను ఆందోళనలో పడవేశాయి. భారతీయ బ్యాంకుల్లో మొండి బకాయిలు గడచిన నాలుగేళ్లలో అమాంతం పెరిగి రూ.11.5 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో నిరర్థక ఆస్తుల వాటా 80 శాతానికి పైమాటే..! నిరర్థక ఆస్తులు పైపైకి దూసుకువెళ్ళడంతో బ్యాంకుల లాభాలు హరించుకుపోయాయి. ఫలితంగా బ్యాంకుల నుంచి మదుపరులకు రావలసిన ఆదాయాలు తగ్గిపోయాయి. ఈ రకంగా నష్టపోయినవారిలో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టే మధ్యతరగతి ప్రజానీకమే అధిక భాగం.! మోదీ ప్రధాని అయ్యాక భారీగా పడిపోయిన క్రూడ్ ఆయిల్ ధరలు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోటానికి చక్కని అవకాశంగా కలసి వచ్చాయి. ఏటా లక్షల కోట్లు మిలిగినా,  మోదీ అనుభవరాహిత్యంతో నోట్లు రద్దుకు పాల్పడి, పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థను తిరోగమనం వైపు మళ్లించారనే విమర్శ మూటగట్టుకున్నారు. గడచిన నాలుగేళ్ల కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు సగటున 7.3 శాతంగా నమోదైంది. అదే సమయంలో పారిశ్రామిక వృద్ధి రేటు సగటున కేవలం నాలుగు శాతంగా మాత్రమే ఉంది. ఫలితంగా దేశంలో ఉద్యోగ కల్పన ఆశించిన స్థాయిలో జరగలేదు…

Image result for demonetisation

దేశ జనాభాలో 60 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు మోదీ టీం ఆర్థిక నిర్ణయాలతో తీవ్రంగా ప్రభావితమయ్యారు. పెరిగిన వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజల్‌ ధరలు వారిని ఈ నాలుగేళ్ల కాలంలో ఉక్కిరిబిక్కిరి చేశాయి. 2018 మార్చినాటికి మొత్తం సబ్సిడీని తీసివేయాలని ప్రభుత్వం చమురు కంపెనీలకు సూచించిన నేపథ్యంలో సబ్సిడీ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఈ నాలుగేళ్లలో విపరీతంగా పెరిగింది… ఒకవైపు అంతర్జాతీయ ముడి చమురు ధర తగ్గుతుంటే- ప్రభుత్వం ఆ మేరకు పన్ను శాతాన్ని వంట గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌లపై పెంచుకుంటూ పోయింది. నాలుగేళ్లలో ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో ప్రభుత్వం 2.42 లక్షల కోట్లు ఆర్జించింది. ప్రపంచవిపణిలో ఒకవైపు ముడి చమురు ధర తగ్గిపోతున్నా దేశీయ వినియోగదారుడికి ఆ లబ్ధిని బదలాయించలేదన్న అప్రతిష్ట మూటగట్టుకుంది. ఎన్నడూ లేనంత భారీగా చమురు ధరలు పెరిగిపోయాయి. పెట్రోలు లీటరుకు రూ 82, డీజిల్‌ లీటరుకు రూ 75 దాటుతున్న పరిస్థితి. నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలన ముగిసిన వేళ సర్వత్రా చర్చనీయాంశమవుతున్న అంశమిది. తగ్గించడానికి కేంద్రం ఆపసోపాలు పడుతోంది.  జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల్ని చూస్తుంటే ఇప్పట్లో క్రూడ్ ధరలు దిగివచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ట్రంప్ ఏకకాలంలో ఉత్తర కొరియా, ఇరాన్ తో రచ్చ పెట్టుకుని ప్రపంచాన్ని తీవ్ర ఆందోళన వైపు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా ఇది ముడి చమురు ధరల్ని మరింత ఎగదోసే అంశమే. చివరిఏడాదిలో చమురు ధర మోదీ పాలిట గుదిబండగా నిలవటం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: