తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మూడు రోజుల పండగ మొదలయింది. టీడీపీ శ్రేణులన్నీ ఒక పండగలా  భావించే మహానాడు నేడు విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో అట్టహాసంగా ప్రారంభమయింది. మొదటగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్కడి నుండి మహానాడు ప్రాంగణానికి తన కార్యకర్తలతో భారీ ర్యాలీతో చేరుకున్నారు. బాబు బుల్లెట్ బైక్ నడుపుతూ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపగా వారు ఆయనను అనుసరించారు. 


మహానాడు ప్రాంగణానికి చేరుకున్న వెంటనే డ్వాక్రా బజార్‌, ఫోటో ప్రదర్శన ప్రారంభించి, సందర్శించిన ఆయన అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, ఆ తరువాత మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించాడు. మహానాడు ద్వారా కేంద్రంపై తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని టీడీపీ భావిస్తోంది. అంతేగాక ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి కాబట్టి కార్యకర్తలకు ఎన్నికల దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. మొత్తం 36 తీర్మానాలను మహానాడులో ప్రవేశపెట్టనున్నారు.


ఇక మహానాడు ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నిందితులను గుర్తించేందుకు వీలుగా అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మహిళల భద్రత దృష్ట్యా వారికి కూర్చోడానికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటుచేశారు. ఇక భోజనం ఏర్పాట్లు కూడా లోటు లేకుండా చేశారు. సుమారు 20 రకాల వంటకాలను వడ్డించనున్నారు. రోజూ 25 వేల మందికి అల్పాహారం, 40 వేల మందికి మధ్యాహ్న, రాత్రి విందులను ఏర్పాటు చేసేలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: