చంద్రబాబుకు ఆగష్టు గండం వెంటాడుతోందా?నిన్న బాలకృష్ణ కుమార్తె  తేజస్విని వివాహానికి డుమ్మా కొట్టడం ద్వారా హరికృష్ణ జూనియర్ లు  స్పష్ట మైన సంకేతాలు చంద్రబాబుకు పంపారని  జరుగుతున్న పరిణామాలు చూసి విశ్లేషకులు అంటున్నారు. ఆగస్టు నెల అంటే తెలుగుదేశం పార్టీకి గండంలాంటిది. ఈసారి కూడా తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పదు  అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రూపంలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఈ సారి ఈ సంక్షోభం తాకుతుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ప్రజా చైతన్య రథయాత్రలు కోస్తా ఆంధ్రాలో చేస్తానని నిన్న ప్రకటించారు. చంద్రబాబు రాష్ట్ర విభజన పై చేపట్ట దలిచిన బస్సు యాత్రకు పోటీగా హరికృష్ణ చేయనున్న ఈ ప్రజా చైతన్య యాత్రను పేర్కుకుoటున్నారు.

చరిత్ర పరిశీలిస్తే  ఎన్టీ రామారావు హయాం నుంచి తెలుగుదేశం పార్టీకి ఆగస్టు గండాలు తప్పడం లేదు. ఆగస్టు వస్తుందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడుతుంటారు. ఎన్టీ రామారావుకు గతంలో ఆగస్టు నెలలో రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. రెండు సార్లు కూడా ఆయన అధికారాన్ని కోల్పోయారు. 1984 ఆగస్టు 15వ తేదీన నాదెండ్ల భాస్కర రావు ఎన్టీ రామారావుపై తిరుగుబాటు చేశారు. ఎన్టీ రామారావును గద్దె దింపారు. ఆ తర్వాత సరిగ్గా 11 ఏళ్లకు ఎన్టీ రామరావుపై ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేశారు. ఇది 1995 ఆగస్టులో జరిగింది. అయితే, ఈసారి ఎన్టీ రామారావు తిరిగి అధికారాన్ని పొందలేకపోయారు.  ప్రతి యేటా ఆగస్టులో తెలుగుదేశం ఏదో ఒక సమస్యకు గురవుతూనే ఉన్నది. అయితే, ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభం కాంగ్రెసును చుట్టుకుంటుందని  భావించారు. కానీ అది తెలుగుదేశం పార్టీకి చుట్టుకునేలా ఉంది. చాలా కాలంగా చంద్రబాబు తీరు పై అసంతృప్తితో ఉన్న నందమూరి హరికృష్ణ తిరుగుబాటుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీ రామారావుకు విధేయులై ఉండి కూడా చంద్రబాబు విధానాల వల్ల పార్టీకి దూరం అయిన ప్రముఖులను కలుపుకుని ప్రస్తుతం నాయకుడు లేకుండా సాగుతున్న సమైఖ్య ఆంధ్రా ఉద్యమంలో చేరుతారనే అభిప్రాయం ఉంది. వారంతా కలిసి హరికృష్ణకు మద్దతు ఇస్తారా అనే విషయం పై స్పష్టత లేకపోయినా ధైర్యంగా హరికృష్ణ సమైఖ్య ఉద్యమంలో పాల్గొని తన సత్తా చాటాలని హరికృష్ణ భావిస్తున్నారని, అందుకే తన తమ్ముడి కూతురి వివాహానికి కూడా దూరంగా ఉంటూ స్పష్టమైన సంకేతాలు పంపడమే కాకుండా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఈ విషయానికి బహిరంగంగా జూనియర్ తన తండ్రికి మద్దతు తెలపక పోయినా తెర వెనుక ఉండి ఆట నడిపే ఆలోచనలో ఉన్నాడని అందువల్లనే నిన్న జరిగిన బాలకృష్ణ కుమార్తె వివాహానికి రాకుండా ఉండటమే కాకుండా రామోజీ ఫిలిం సిటీలో దిల్ రాజ్ నిర్మిస్తున్న ‘రామయ్య వస్తావయ్యా’ క్లైమేక్స్  సన్నివేశాల చిత్రీకరణలో చిక్కుకు పోయానని తన బాబాయ్ కి తెలివిగా మెసేజ్ పంపాడని అంటున్నారు. ‘తెలుగు ఆత్మ గౌరవ యాత్ర’ పేరుతో చంద్రబాబు చేయబోతున్న బస్సు యాత్రకు పోటీగా సమైఖ్య నినాదంతో ఎవరి మాటా వినని సీతయ్య హరికృష్ణ తల పెట్టిన ‘ప్రజా చైతన్య రధయాత్ర’ మరో ఆగస్టు సంక్షోభానికి దారి తీసే ప్రాతిపదిక నిన్న బాలయ్య కుమార్తె వివాహం నుండే మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బాలయ్య గారి ఇంట్లో పెళ్ళి తెలుగు దేశ పార్టీకి మరో ఆగస్టు సంక్షోభానికి సంకేతమా అంటూ మాటలు వినిపిస్తున్నాయి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: