2019 వరకూ జరిగే ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ ఒక్కటే ప్రధాన శత్రువుగా పోరుసాగిస్తున్న ప్రాంతీయ, జాతీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఏకతాటిపై నిలబడతాయా.! సీట్ల సంఖ్యను, దక్కబోయే పదవిని దృష్టిలో పెట్టికుని వ్యవహరిస్తాయా.? ఇదే ఇప్పుడు జరుగుతోన్న ఉప ఎన్నికల ట్రెండ్ చూసిన వాళ్లను వేధిస్తున్న సమస్య. 2018 లో జరుగుతోన్న ప్రతి ఉపఎన్నికలోనూ బీజేపీపై వ్యతిరేకత ఒక్కటే అజెండాగా రాష్ట్రాల్లో, దేశంలో పార్టీలు ఏకమవుతున్నాయి. తమ మధ్య ఉన్న పాత, కొత్త విబేధాల్ని పక్కనబెట్టి ఐక్యంగా ఒకే సింబల్ పై అభ్యర్థిని నిలబెట్టి.. రాజకీయంగా బీజేపీని బెంబేలెత్తిస్తున్నాయి.

Image result for bjp vs regional parties

గత మార్చిలో జరిగిన ఉపఎన్నికల ఫలితాల్నే చూసుకుంటే.. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమూల మార్పుకు నాంది పలికాయి. బద్ధ శత్రువులైన ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్ మద్దతుతో ఉమ్మడిగా అభ్యర్థుల్ని నిలబెట్టి., బీజేపీని చిత్తుగా ఓడించాయి. కమలం కంచుకోటలని చెప్పుకుంటున్నప్రాంతాల్లోనే ఆ పార్టీని పరాజయం పాలు చేశాయి. ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఐదు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్ లో బీజేపీని తల్లకిందులు చేశాయి. సరిగ్గా నాలుగేళ్ల ముందు యూపీలో 53 శాతం ఓట్లతో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్ని శాసించిన బీజేపీ, అక్కడ అజేయంగా లేదు అన్న చేదునిజాన్ని కమలానికి తెలిసి వచ్చేలా చేశాయి…

Image result for bjp vs regional parties

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ బలం సన్నబడింది అనే సమాచారం బయటకు వెల్లడైన మరుక్షణంలోనే దేశరాజకీయాల్లో అనేక మార్పులు వేగంగా సంభవించాయి. మమత నేతృత్వంలో తృతీయ ఫ్రంట్ వ్యాఖ్యలు బాణాల్లా దూసుకువచ్చాయి. బడ్జెట్ సమావేశాల ఆఖరులో టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఏపీ హోదా విషయంలో కేంద్రం వైఖరిని నిరశిస్తూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. వెనకా ముందూ ఆలోచించకుండా.. మాజీ తృతీయ ఫ్రంట్ పార్టీలన్నీ బాబు పిలుపుపై ఫోకస్ పెట్టాయి. లోక్ సభలో చర్చ జరిగితే మోదీ సర్కార్ ను కూల్చేస్తాం అన్నంతగా ఒంటికాలిపై లేచాయి. వాటి ఉత్సాహం చూసి కాంగ్రెస్ పార్టీలో ఆవేశం కట్టలు తెంచుకుంది. తన వల్ల కానిది.. ప్రాంతీయ పార్టీల వల్ల సాధ్యం అవుతుందన్న బలమైన నమ్మకం ఆ పార్టీలో పెరిగిపోయింది… యూపీ తర్వాత అనేక ఉపఎన్నికల్లో ప్రాంతీయ జాతీయపార్టీలన్నీ యూపీ ప్రయోగాన్నే తమ అస్త్రంగా మలుచుకున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని తెరపైకి తెస్తూ.. 2019 ముందు అనేక ఎన్నికల్లో అనువైన వ్యూహాల్ని నిర్మించుకునే పనిలో పడ్డాయి…

Image result for bjp vs regional parties

దేశంలో ఎక్కడ ఉపఎన్నికలు జరుగుతున్నా.. రాజకీయా పార్టీలు యూపీ ఫార్ములానే అమల్లో పెట్టాయి. బీజేపీ బలంగా ఉన్నచోట ఐక్యంగా పోటీచేస్తూ.. కమలం దూసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ ట్రెండ్ రాబోయే రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిలుస్తుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ చేస్తున్న రాజకీయాలే ఇలాంటి అనుమానాలు రావటానికి ప్రధాన కారణం. ఎన్నికల్లో విడివిడిగా.. ఎవరి బలం వారు చూపించుకుంటూ పోటీ చేసినా.., ఎన్నికల తర్వాత ఎవ్వరికీ సరైన బలం లేని సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ ఏకమయ్యాయి. బీజేపీని అధికారంలోకి రానీయకూడదన్న ఏకైక అజెండాతో., మూడు రోజుల్లోనే యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని గద్దె దింపాయి. ఆ వెనువెంటనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి., 2019 ఎన్నికల తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ ఎలాంటి ప్రయోగాలు చేయబోతుందో తెలియజేసే నమూనాగా కర్ణాటక రాష్ట్రాన్ని ఉపయోగించాయి… ఇక్కడ వరకూ స్క్రీన్ ప్లే బాగున్నా.. ఆ తర్వాత అతిపెద్ద సవాల్ తెరపైకి తెచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరి పట్టుమని పదిరోజులు కాలేదు.. కాంగ్రెస్, జేడీఎస్ మంత్రులు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు, అప్పుడే ఇరుపార్టీలు ఉపఎన్నికల్లో ఉప్పూ-నిప్పై పోరాటం ప్రారంభించాయి. 2019 ముందే సంకీర్ణ ప్రయోగం ఎన్నిరకాలుగా వికటిస్తుందే ప్రత్యక్షంగా చూపించటం ప్రారంభించాయి.…

Image result for bjp vs regional parties

యూపీ ప్రయోగం అసలు ఉత్తరప్రదేశ్ లోనే సత్ఫలితాలు ఇస్తుందా అనే అనుమానాలు కర్ణాటక ఎపిసోడ్ చూశాక మొదలవుతున్నాయి. ఎస్పీ, బీఎస్పీ, అధినేతల్లో ఎవరికి వారిలో పీఎం పీఠంపై ఆశలు పదిలంగా ఉన్నాయి. ములాయం సింగ్ యాదవ్, మయావతీలు బీజేపీ పై కోపంతో తమ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని పణంగా పెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ మరో ప్రధానాంశం కాంగ్రెస్ రోల్. ఇప్పటి వరకూ ఉపఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల్ని సమర్థిస్తూ.. బీజేపీ విజయాల్ని సమర్థవంతంగా అడ్డుకుంటున్న కాంగ్రెస్, 2019లో ఇలాగే తోడ్పాటు ఇస్తుందా అంటే నిర్మోహమాటంగా ఉండదనే అనుకోవచ్చు. ఎక్కువ సీట్లు గెలవటం ద్వారా రాహుల్ గాంధీని పీఎం సీట్లో కూర్చోబెట్టాలని ఆ పార్టీ ఆశిస్తోంది. అందుకు అనుకూలంగా ఉన్న సీట్లన్నింటిలోనూ పోటీ చేయటానికి వెనకాడదు. ఆ త్యాగాలు కూడా ఎస్పీనో, బీఎస్పీనో చేయాలని కోరుకుంటుంది. అక్కడే కథ మళ్లీ మొదటికి వస్తుంది. ఇలా ప్రధాని పోస్టో లక్ష్యంగా బీజేపీతో ప్రతిపార్టీ విడివిడిగా పోరాడి.., అంతిమంగా మోదీకి మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కర్ణాటక ప్రయోగంలో లుకలుకలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి…

Image result for bjp vs regional parties

ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన అన్నీ పార్టీలు ఉమ్మడిగా బీజేపీని తిడుతున్నా.. ఆ పార్టీని ఓడించేందుకు ఏ ఒక్కటీ తమ ప్రయోజనాల్ని త్యాగం చేసే పరిస్థితులు లేవు. టీడీపీ స్వయంగా 25 లోక్ సభ సీట్లను తమకు కట్టబెట్టాలని పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. తృతీయ ఫ్రంట్ లో ప్రధానిని నిర్ణయించే అధికారం తమకే ఉండాలని పట్టుదలగా ఉంది. తెలంగాణలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. ప్రధానపోటీ అంతా కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్యే. 2019లో ప్రాంతీయపార్టీల మద్దతు లేకుండా కమలం ఢిల్లీ పగ్గాలు చేపట్టే పరిస్థితి ఏ కూటమికీ లేదని నమ్ముతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గరిష్టంగా సీట్లు గెలుచుకోవటం పైనే దృష్టి పెట్టి ఫైట్ చేస్తున్నారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచటమే ఏకైక అజెండా అని చెబుతున్న పార్టీలు, రాష్ట్రాల్లో సొంత ప్రయోజనాలు గుర్తొచ్చిప్పుడల్లా.. బీజేపీ ని, వారి మధ్య ఉన్న ఉమ్మడి పగను మర్చిపోతున్నాయి. సొంత అజెండానే కీలకంగా మారుతోంది. కర్ణాటక సాక్షిగా 2019 ఎన్నికలకు ఏడాది ముందే ఈ విషయం స్పష్టమైంది. అంటే తృతియ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రెంట్ అనేవి చెప్పుకోటానికి ప్రత్యామ్నాయాలేగానీ, వాస్తవంలో బీజేపీని నిలువరించే శక్తులు కావన్న విషయం స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: