ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అస్వ‌స్ధ‌త‌కు గుర‌య్యారు.  గ‌డ‌చిన 177 రోజులుగా విశ్రాంతి తీసుకోకుండా చేస్తున్న పాద‌యాత్ర వ‌ల్ల జ‌గ‌న్ పూర్తిగా అల‌సిపోయారు. దానికితోడు మండిపోతున్న ఎండ‌ల‌ను సైతం ఏమాత్రం లెక్క చేయ‌కుండా  రోజుకు సుమారు 20 కిలోమీట‌ర్లు న‌డుస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ పాద‌యాత్ర  చేస్తున్న విష‌యం తెలిసిందే. మూడు రోజులుగా జ‌గ‌న్ ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్నారు. రెండు రోజుల క్రితం కొద్దిగా జ్వ‌రం వ‌చ్చిన‌ట్లు ఫీల‌య్యారు. అయినా పాద‌యాత్ర‌కు విరామం ఇవ్వ‌కుండా న‌డ‌క‌ను కొన‌సాగించారు. దాంతో మంగ‌ళ‌వారం న‌డ‌వ‌లేని ప‌రిస్ధితి త‌లెత్తింది. వెంట‌నే వైద్యుల‌ను పిలిపించి ప‌రీక్ష‌లు చేయించారు. జ‌గ‌న్ కు వ‌డ‌దెబ్బ త‌గిలింద‌ని వైద్యులు నిర్ధారించారు. దాంతో మూడు రోజుల పాటు ఎక్క‌డికీ క‌ద‌లవ‌ద్ద‌ని పూర్తిగా విశ్రాంతి అవ‌స‌ర‌మైని వైద్యులు సూచించారు.  దాంతో నేత‌లు కూడా జ‌గ‌న్ ను విశ్రాంతి తీసుకోమ‌నే ఒత్తిడి పెడుతున్నారు. ఎందుకంటే, గ‌తంలో కూడా అంటే చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న‌పుడు కూడా ఇదే విధంగా జ‌గ‌న్ ఇబ్బంది ప‌డ్డారు. అప్పుడు కూడా వైద్యులు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌నే సూచించారు. అయినా జ‌గ‌న్ ఎవ్వ‌రి సూచ‌న‌ల‌ను లెక్క చేయ‌కుండా పాద‌యాత్ర‌ను కొన‌సాగించిన విష‌యం గుర్తుండే ఉంటుంది. ఇపుడు కూడా అదే జ‌రుగుతోంది. వ‌డ‌దెబ్బ‌ను సైతం లెక్క చేయ‌కుండా బుధ‌వారం ఉద‌యం పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. దాంతో జ‌గ‌న్ ఎంత మొండోడో అన్న విష‌యం అంద‌రికీ అర్ధ‌మ‌వుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: