తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా  సోష‌ల్ మీడియా హ‌వా స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంది. సోష‌ల్ మీడియా డామినేష‌న్ గ‌డ‌చిన నాలుగేళ్ళ‌ల్లో బాగా ఎక్కువైపోయింది. మీడియా ఫెయిల్ అయిన చోటే సోష‌ల్ మీడియా ప్ర‌స్ధానం మొద‌లైంది. మీడియా చేయ‌ని ప‌నిని సోష‌ల్ మీడియా చేసి చూపిస్తోంది. ఎప్పుడైతే మీడియా వివిధ కార‌ణాల వ‌ల్ల త‌న బాధ్య‌త‌నుండి ప‌క్క‌కు త‌ప్పుకుందో ఆ బాధ్య‌త‌ను సోష‌ల్ మీడియా భ‌ర్తీ చేస్తోంది. మీడియా యాజ‌మాన్యం చాలా కొద్ది మంది చేతుల్లోనే ఉంటే సోష‌ల్ మీడియాలో ఎవరికి వారే య‌జ‌మాని. ఈ సౌల‌భ్యం వ‌ల్లే సోష‌ల్ మీడియా క్రేజ్ పెరిగిపోతోంది. ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, వాట్స‌ప్, ఇన‌స్టాగ్రామ్ లాంటి వాటిల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవ‌టానికి ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు  పెట్ట‌క్క‌ర్లేదు. ఒక‌సారి అకౌంట్ ఓపెన్  చేసుకుంటే చాలు య‌ధేచ్చ‌గా ఎవ‌రికి వారు త‌మ అభిప్రాయాల‌ను జనాల‌తో పంచుకోవ‌చ్చు. స‌రే, మీడియాలో ఉండే ప్ల‌స్ లు, మైన‌స్ లు ఇక్క‌డా త‌ప్ప‌వ‌నుకోండి అది వేరే సంగ‌తి.  కాక‌పోతే మీడియాకుండే స‌రిహ‌ద్దులు సోష‌ల్ మీడియాకు లేక‌పోవ‌టంతోనే కొన్ని సార్లు హ‌ద్దులు కూడా చెరిగిపోతుండటంతో స‌మ‌స్య అక్క‌డే వ‌స్తోంది.

Image result for social media

ఏపిలో ప‌రిస్ధితేంటి ?
పోయిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబునాయుడు అధికారంలోకి రావ‌టానికి మీడియా ఎంత‌టి పాత్ర పోషించిందో సోష‌ల్ మీడియా కూడా అంతే పాత్ర పోషించింద‌న‌టంలో సందేహమే అవ‌స‌రం లేదు. చంద్ర‌బాబు గురించి, టిడిపి గురించి పాజిటివ్ ప్ర‌చారం కోసం కొన్ని వంద‌ల మంది ఐటి నిపుణులు 24 గంట‌లూ ప‌నిచేశారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌టం కోసం టిడిపిలో ఏకంగా పెద్ద విభాగ‌మే ప‌నిచేసింది. పోయిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన రుణ‌మాఫీ, ప్ర‌త్యేక‌హోదా, కాపుల‌ను బిసిల్లో చేర్చ‌టం, నిరుద్యోగ భృతి, జాబు కావాలంటే బాబు రావాలి అనే హామీల‌ను నినాదాల రూపంలో  టిడిపి సోష‌ల్ మీడియా విభాగ‌మే విస్తృతంగా జ‌నాల్లోకి తీసుకెళ్ళింది. ఎటుతిరిగీ సోష‌ల్ మీడియాలో ఖాతాలు క‌లిగిన వారి సంఖ్య ఎటుతిరిగీ ల‌క్ష‌ల్లోనే ఉంటుంది. కాబ‌ట్టి చంద్ర‌బాబు నినాదాలు,హామీల‌న్నీ జ‌నాల‌కు నిముషాల్లో చేరిపోయేవి. 

Image result for social media war in ap

సోష‌ల్ మీడియాలో టిడిపి పాత్ర‌
సోష‌ల్ మీడియాను టిడిపి ఉప‌యోగంచుకున్న‌ట్లుగా ఇంకే పార్టీ కూడా ఉప‌యోగించుకోలేదు. జ‌నాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు వీలుగా టిడిపి మ‌ద్ద‌తుదారుల‌తో ఫేస్ బుక్, ట్విట్ట‌ర్, వాట్స్ ప్ లాంటి వాటిల్లో గ్రూపులు ఏర్పాటు చేయించి వాటిద్వారా వేలాది మందిని ఖాతాదారులుగా చేర్పించింది. ఆ ఖాతాల్లో టిడిపి భ‌వ‌జాలాన్ని ప‌దే ప‌దే ప్ర‌చారం చేయించ‌టం ద్వారా  పార్టీల‌తో ఎటువంటి సంబంధం లేని న్యూట్ర‌ల్స్ మైండ్ సెట్ అనుకూలంగా  మార్చుకోవ‌టంలో టిడిపి స‌క్సెస్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో టిడిపిది ఒక‌టే అజెండా. చంద్ర‌బాబును ఆకాశానికి ఎత్తేయ‌టంతో పాటు వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని చూచిగా చూపించ‌ట‌మే. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ హ‌యాంలో ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అవినీతి జ‌రిగింద‌ని, అందులో జ‌గన్ దే ప్ర‌ధాన పాత్ర అని సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్ర‌చారం చేయ‌టం. మీడియాకు తోడు సోష‌ల్ మీడియా కూడా తోడ‌వ్వ‌టం, భార‌తీయ జ‌న‌తా పార్టీ, జ‌న‌సేన కూడా సోష‌ల్ మీడియాను ఉప‌యోగంచుకోవ‌టంతో టిడిపి-భాజ‌పా-జ‌న‌సేన కూట‌మి ల‌బ్దిపొందింది. 
Image result for tdp social media workshop
జ‌గ‌న్ ఎక్క‌డ ఫెయిల‌య్యారు ?
ప్ర‌త్య‌ర్ధులు అంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి త‌న‌పై చేస్తున్న పోరాటాన్ని జ‌గ‌న్ చాలా త‌క్కువ‌గా అంచ‌నా వేశారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ ఛ‌రిష్మానే త‌న‌ను గెలిపించేస్తుంద‌న్న గుడ్డి న‌మ్మ‌కమే జ‌గ‌న్లో క‌నిపించింది. అందుకే మీడియాలో ప్రాచారంపైనే కాకుండా సోష‌ల్ మీడియాను కూడా నిర్ల‌క్ష్యం చేశారు. అస‌లే, మీడియాలో 90 శాతం జ‌గ‌న్ కు వ్య‌తిరేకం. దానికితోడు అంత‌కుముందే  జైలు నుండి బెయిలు పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఓదార్పుయాత్ర‌లో జ‌గ‌న్ ఎక్క‌డ ప‌ర్య‌టించినా విప‌రీత‌మైన జ‌నాలు క‌నిపించారు.దాంతో  ఎప్పుడు ఎన్నిక‌లు పెట్టినా అధికారంలోకి వ‌చ్చేసిన‌ట్లే అని జ‌గ‌న్ లో ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ క‌న‌బ‌డేది. దాంతో అటు మీడియానే కాకుండా సోష‌ల్ మీడియాను కూడా నిర్ల‌క్ష్యం చేశారు. ఆ అవ‌కాశాన్ని టిడిపి కూట‌మి, చంద్ర‌బాబు బృందం బాగా ఉప‌యోగించుకున్న‌ది. దాంతో ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో జ‌గ‌న్  త‌ల‌బొప్పి క‌ట్టింది.
   
మేలుకున్న జ‌గన్
పోయిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో జ‌గ‌న్ మేలుకున్న‌ట్లే క‌న‌బ‌డుతోంది. త‌న ప్ర‌చారం కోసం సొంత మీడియాను మాత్ర‌మే న‌మ్మ‌కుంటే లాభం లేద‌న్న విష‌యం అర్ధ‌మైన‌ట్లే ఉంది. ఎటు తిరిగి మిగిలిన మీడియాలో అత్య‌ధికం ఎటూ పూర్తిగా వ్య‌తిరేక‌మే కాబ‌ట్టి జ‌గ‌న్ కు సోష‌ల్ మీడియానే దిక్కైంది. అందుక‌నే పైన చెప్పుకున్న సోష‌ల్ మీడియా పై పూర్తి దృష్టి పెట్టారు. దాదాపు మూడేళ్ళ క్రిత‌మే ప్ర‌త్యేకంగా సోష‌ల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేసుకుని త‌న‌కు అనుకూలంగా ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టేశారు. దానికితోడు చంద్ర‌బాబు వ్య‌తిరేకులు కూడా జ‌గ‌న్ సోష‌ల్ మీడియా ప్ర‌చారంలో భాగ‌స్ధుల‌య్యారు. దాంతో ఇపుడు చంద్ర‌బాబులో ఆందోళ‌న పెరిగిపోతోంది. సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు, లోకేష్ ల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ప్ర‌చారం అంతా ఇంతా కాదు. వాళిద్ద‌రి నోటి నుండి ఒక్క మాట త‌ప్పుగా వ‌చ్చినా స‌రే, సోష‌ల్ మీడియా వాళ్ళ‌ని రోజుల త‌ర‌బ‌డి చీల్చి చెండాడేస్తోంది. సోష‌ల్ మీడియాలో త‌మ‌పై వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్న వారిని అరెస్టులు చేయిస్తున్నారంటేనే సోష‌ల్ మీడియా అంటే వాళ్ళిద్ద‌రిలో ఎంత భ‌యం మొద‌లైందో అర్ధ‌మైపోతోంది. 

Gadapa Gadapaku YSR

చంద్ర‌బాబుపై ముప్పేట దాడి
మారిన రాజకీయ ప‌రిస్ధితుల్లో చంద్ర‌బాబుపై మూడు వైపుల నుండి పెద్ద ఎత్తున దాడి మొద‌లైంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసిపితో పాటు శ‌తృవులుగా మారిన మిత్రులు భాజ‌పా, జ‌న‌సేన కూడా సోషల్ మీడియాలో చంద్ర‌బాబుపై పెద్ద ఎత్తున పోరాటం మొద‌లుపెట్టాయి. దాంతో చంద్ర‌బాబు, లోకేష్ ఉక్కిరిబిక్కిరి అవ‌తున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌రప‌డే కొద్దీ రాష్ట్రంలో  సోష‌ల్ మీడియా వార్ మ‌రింత పెరిగిపోవ‌టం మాత్రం ఖాయం. చూడ‌బోతే భ‌విష్య‌త్తంతా సోష‌ల్ మీడియాదే అన‌టంలో ఎటువంటి  సందేహ‌మూ అవ‌స‌రం లేదు. 

 mosagadu

మరింత సమాచారం తెలుసుకోండి: