టీడీపీ – బీజేపీ మధ్య బంధం తెగిపోయిన తర్వాత ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. రెండు పార్టీల నేతలూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా మహానాడులో బీజేపీని ఉద్దేశించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కామెంట్స్ పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. చంద్రబాబుపై విరుచుకుపడింది.           ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా ఎదగాలనుకుంటున్న బీజేపీ.. అందుకు ప్రధానంగా టీడీపీనే టార్గెట్ గా ఎంచుకుంది. ఎన్డీయే నుంచి బయటకి వచ్చి బీజేపీపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడంతో కమలం పార్టీలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇటు టీడీపీ కూడా నమ్మి బీజేపీతో నడిస్తే.. నట్టేట ముంచేసిందని ఆరోపిస్తోంది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని విమర్శిస్తోంది. విభజన హామీలు నెరవేర్చకుండా సాకులు చెప్తోందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీని టార్గెట్ గా చేసుకుని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Image result for babu at mahanadu

          మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కలకలం సృష్టించాయి. గుజరాత్ లోని దోలేరా నగర నిర్మాణానికి 98వేల కోట్లు కేటాయించిన మోదీ.. రాజధానిలేని ఆంధ్రప్రదేశ్ కు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన గుజరాత్ లోని దోలేరా లాగా ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఉండకూడదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకంత చులకన అని నిలదీశారు.

Image result for babu at mahanadu

          అయితే మహానాడులో చంద్రబాబు చేసిన కామెంట్స్ ను బీజేపీ తిప్పికొట్టింది. దొలేరా అనేది రాజధాని కాదని, అదొక ఇండస్ట్రియల్ కారిడార్ అని ఆ పార్టీ నేత జి.వి.ఎల్.నరసింహారావు వివరించారు. ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా నాడు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని తెలిపారు. దీనికి కేంద్రం కేవలం రూ.2500 కోట్లు మాత్రమే ఇస్తోందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం దీనికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదన్నారు. మహానాడులో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలేనని జి.వి.ఎల్. మండిపడ్డారు. వెంటనే ఆయన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే.. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి కేంద్రం 3వేల కోట్లు ఇస్తోందని బాబు చెప్పారన్నారు. అయితే కేంద్రం ఇచ్చింది కేవలం 3వందల కోట్లు మాత్రమేనని జీవీఎల్ చెప్పారు.

Image result for gvl narasimha rao

బీజేపీ అధికారంలోకి వచ్చాక అత్యధికంగా లాభపడ్డ రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని జి.వి.ఎల్. వివరించారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 5 కారిడార్లలో భాగంగా కృష్ణపట్నం పోర్టుకు దోలేరా లాగా నిధులు వస్తాయని తెలిపారు. దొలేరా లాంటి సిటీలు ఏపీలో 3 వస్తాయన్న జీవీఎల్.. మరే రాష్ట్రానికి ఇన్ని సిటీలు ఇవ్వలేదన్నారు. ఈ సిటీల నిర్మాణం పూర్తయితే ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా సొల్లు కబుర్లు చెప్తున్నారని జి.వి.ఎల్ విమర్శించారు. ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: