వ‌చ్చే ఎన్నిక‌ల్లో అత్య‌ధిక నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే విష‌యమై కాపు సామాజిక‌వ‌ర్గం క‌న్నేసిందా ? క్షేత్ర‌స్ధాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. రెండు రోజుల క్రితం కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నేతృత్వంలో కీల‌క  స‌మావేశం జ‌రిగింది. ఆయ‌న స్వ‌గృహంలో జ‌రిగిన కాపు జెఎసి నేత‌ల స‌మావేశంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపులు పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య‌పైనే  ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఆ సంఖ్య ఏ ఒక్క పార్టీకో ప‌రిమితం కాకూడ‌ద‌న్న‌ది వారి ఆలోచ‌న‌. అన్నీ పార్టీల‌తోనూ చ‌ర్చ‌లు జ‌ర‌పటం ద్వారా వీలైన‌న్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కాపు నేత‌లు పోటీకి దిగాల‌ని స‌మావేశంలో నిర్ణ‌య‌మైంది. అంటే త‌క్కువ‌లో త‌క్కువ‌గా 60 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాపు నేత‌లతో పోటీ చేయించాల‌ని కూడా స‌మావేశం నిర్ణ‌యించింది. ఎందుకంటే, ప్ర‌స్తుత అసెంబ్లీలో అన్నీ పార్టీల త‌ర‌పు నుండి 30 మంది కాపు ఎంఎల్ఏలున్నారు. ఈ సంఖ్య‌ను రెట్టింపు చేయాల‌న్న‌ది ముద్ర‌గ‌డ ప‌ట్టుద‌ల‌గా క‌నిపిస్తోంది. 

Image result for kapu jac

నియోజ‌క‌వ‌ర్గాల గుర్తింపు మొద‌లైందా ?
కాపులంటే రాష్ట్రం మొత్తం మీద ప్ర‌ధానంగా ఉభ‌య గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ‌గా ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. రాయ‌ల‌సీమ‌లో బ‌లిజ‌లని ఉత్త‌రాంధ్ర‌లో ఇత‌ర పేర్ల‌తో పిలుస్తారు. ప్రాంత‌మేదైనా, పేరేదైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో కాపుల ప్రాతినిధ్యం రెట్టింపు చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌లో కాపు సామాజిక‌వ‌ర్గం ఉన్న‌ద‌న్న విష‌యం అర్ధ‌మైపోతోంది. అయితే, ఏ పార్టీ ఎంత‌మంది కాపుల‌కు టిక్కెట్లు ఇస్తుంద‌న్న విష‌యం కాపు జెఏసి చేతిలో లేద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే త‌న మాట చెల్లుబాట‌వుతుంది అని అనుకుంటున్న పార్టీల‌తో ముద్ర‌గ‌డ ఇప్ప‌టికే చ‌ర్చ‌లు మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. అన్నీ పార్టీల్లో క‌లిపే అయినా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాపుల‌కే 60 సీట్లంటే మామూలు విష‌యం కాదు. 

Image result for kapu jac

చంద్ర‌బాబే టార్గెట్టా ?
వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబునాయుడును ఓడించ‌ట‌మే ఏకైక ల‌క్ష్యంతో ముద్ర‌గ‌డ ఉన్నారు. అందుకు త‌గ్గ‌ట్లే పావులు క‌దుపుతున్నారు. కాపు నేత‌ల‌కు ఎక్కువ సీట్లు ఇప్పించుకోవ‌టంలో భాగంగా ముద్ర‌గ‌డ ఇప్ప‌టికే అటు వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో పాటు ఇటు బిజెపి అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌తో కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఎవ‌రితో చ‌ర్చ‌లు జ‌రిపినా టిడిపి అభ్య‌ర్ధుల ఓట‌మినే ముద్ర‌గ‌డ ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుక‌నే ఒక నియోజ‌క‌వ‌ర్గంలో అన్నీ పార్టీలు కాపుల‌కే టిక్కెట్లు ఇచ్చేపక్షంలో టిడిపి అభ్య‌ర్ధిని పోటీ నుండి త‌ప్పుకోవాల‌ని అడ‌గాల‌ని కూడా ముద్ర‌గ‌డ నిర్ణ‌యించుకున్నార‌ట‌.  త‌ర్వాత అదే విధంగా జ‌న‌సేన అభ్య‌ర్ధిని కూడా పోటీ నుండి త‌ప్పించాల‌ని జేఏసిలో చ‌ర్చ జ‌రిగింది. ముద్ర‌గ‌డ లేక‌పోతే జెఏసి పిలుపు మేర‌కు పోటీలో నుండి పై పార్టీల అభ్య‌ర్ధులు త‌ప్పుకోక‌పోతే వారి ఓట‌మికి కృషి చేయాల‌ని కూడా జెఏసిలో చ‌ర్చ జ‌రిగింది. 
 Image result for kapu jac
కాపుల ఓట్లు ఇక్క‌డే ఎక్కువా ?
అందుబాటులో ఉన్న స‌మాచారం ప్ర‌కారం కాపులు ఓట్లు అన్నీ జిల్లాల్లోనూ  బాగానే ఉంది. ప్ర‌ధానంగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు, కృష్ణ‌, గుంటూరుతో పాటు రాయ‌ల‌సీమ‌, నెల్లూరు జిల్లాలో ఎక్కువుగా ఉంది. అందుక‌నే, తాడేప‌ల్లి గూడెం, కాకినాడ‌, కాకినాడ రూర‌ల్, తిరుప‌తి, నెల్లూరు, నిడ‌ద‌వోలు, పాల‌కొల్లు, న‌ర‌సాపురం, ఏలూరు, ప్ర‌త్తిపాడు లాంటి నియోజ‌క‌వ‌ర్గాల‌పైనే జెఏసి దృష్టిపెట్టింది. 

Image result for kapu jac

ముద్ర‌గ‌డ మాట చెల్లుబాట‌వుతుందా ?
కాపుల సంక్షేమం కోసం ముద్ర‌గ‌డ‌ ఉద్య‌మాలు చేశారు, నిరాహార‌దీక్ష‌లు చేశారు, చంద్ర‌బాబుతో పోరాడారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. కాపులంద‌రూ ముద్ర‌గ‌డ మాట‌ను ఎంత వ‌ర‌కూ వింటార‌న్న‌దే పెద్ద ప్ర‌శ్న‌. ముద్ర‌గ‌డ ఏదైనా ఉద్య‌మం అన‌గానే కాపు నేత‌లు, సామాజిక‌వ‌ర్గం పెద్ద ఎత్తున  స్పందిస్తున్న మాట‌లో సందేహం అవ‌స‌రం లేదు. అయితే, ముద్ర‌గ‌డ చెప్పిన‌ట్లు ఓట్లు వేస్తారా అన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌. ఎందుకంటే, కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మం బాగా జ‌రుగుతున్న స‌మ‌యంలోనే నంద్యాల ఉప ఎన్నిక జ‌రిగింది. అప్పుడు టిడిపికి వ్య‌తిరేకంగా ఓట్లు వేయాల్సిందిగా ముద్ర‌గ‌డ పిలుపిచ్చారు. అయితే, ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అలాగే, త‌న సొంత జిల్లాలోని కాకినాడ కార్పొరేషన్ కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా ముద్ర‌గ‌డ అదే పిలుపిచ్చారు. పైగా కాకినాడ స్వంత ఊరు కిర్లంపూడికి ఆనుకునే ఉంటుంది. అయినా టిడిపి అభ్య‌ర్ధులే ఎక్కువ మంది గెలిచారు. దాంతో అస‌లు ముద్ర‌గ‌డ  నాయ‌క‌త్వం మీదే అంద‌రికీ అనుమానం వ‌చ్చేసింది. రేపు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా అదే సీన్ రిపీట‌వ్వ‌ద‌ని గ్యారెంటీ ఏంట‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. చూడాలి ఏం జ‌రుగుతుందో ?

Image result for kapu jac


మరింత సమాచారం తెలుసుకోండి: