అనంత‌పురం టీడీపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా హీటెక్కాయి. ఇక్క‌డ కాంగ్రెస్‌లో హ‌వా చ‌లాయించి.. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డికి వ్య‌తిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తాను పార్టీలో చేర్చుకునేందుకు జేసీ చూపిన అత్యుత్సాహ‌మే దీనికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. అనంత‌పురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇప్పించుకునేందుకు జేసీ పెద్ద స్కెచ్ సిద్ధం చేశారు. ఈ క్ర‌మంలోనే త‌న మాట వినేవారిని టీడీపీలోకి తెస్తున్నారు. అయితే, ఇలాంటి చేరిక‌ల‌తో త‌మ‌కు పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని భావిస్తున్న సిట్టింగు ఎమ్మెల్యేలు జేసీకి ఎదురు తిరుగుతున్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఆయ‌న కొత్త‌వారిని పార్టీలోకి తేవాల్సిన అవ‌స‌రం లేద‌ని తెగేసి చెబుతున్నారు.
 Image result for tdp
విష‌యంలోకి వెళ్తే.. అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో తన ‘టీం’ను ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగంగా గురునాథ్‌రెడ్డి చేరికతో తొలి పావు కదిపిన జేసీ, గుంతకల్లులో మధుసూదన్‌గుప్తాను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. మహానాడు వేదికపైనే గుప్తాను పార్టీలోకి చేర్చుకునేలా ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలు స్తోంది. ఈ క్ర‌మంలోనే  గుప్తాను పార్టీలోకి చేర్చుకునేందుకు జేసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, తన నియోజకవర్గ నేత చేరికపై తనకు మాటమాత్రం కూడా సమాచారం ఇవ్వకుండా చేర్చుకోవడాన్ని ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ తీవ్రంగా తప్పుబట్టారు. తనకు తెలియకుండా చేరిక కు సిద్ధమయ్యారంటే, తనకు పొగ‌బెడుతున్నార‌న్న మాట నిజ‌మేన‌ని ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు.

Image result for chandrababu naidu

అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిదీ ఇదే పరిస్థితి. ఈయ‌న ఎప్ప‌టి నుంచో జేసీతో తీవ్రంగా విభేదిస్తున్నారు. దీంతో ఇద్దరూ ఏకమాయ్యరు. వీరిద్దరూ మంత్రి కాలవ శ్రీనివాసులను కలిసి విషయం చెప్పినట్లు తెలుస్తోంది. రాయదుర్గంలో తనకూ పొగబెట్టి, అల్లుడిని తెచ్చుకోవాలని జేసీ చూస్తున్నారని.. మంత్రిని కాబట్టి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయానని కాలవ చెప్పినట్లు చర్చ జరుగుతోంది. వీరిద్దరి ఆవేశాన్ని కాలవ అస్త్రంగా చేసుకుని చంద్రబాబు రాజకీ య సలహాదారు, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌కు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు జనార్దన్‌ను కలిశారు. గుప్తాను పార్టీలో చేర్చుకుంటే పార్టీలో కొనసాగే విషయంలో కూడా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. 


ఎమ్మెల్యేంతా జేసీపై ఫిర్యాదు చేయడంతో ముఖ్యమంత్రి వెంట‌నే స్పందించినట్లు తెలిసింది. అసలు ‘అనంత’ పార్లమెంట్‌ పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? వారి పని తీరు? ఎంపీ పనితీరు? ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం, ప్రజల అభిప్రాయంతో పాటు పూర్తి నివేదిక తనకు ఇవ్వాలని జనార్దన్‌కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో నివేదిక వచ్చే వరకూ గుప్తా చేరిక ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని టీడీపీ సీనియర్‌ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో ఎంపీ జేసీ హ‌వాకి అడ్డుక‌ట్ట ప‌డిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: