మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. జూన్ 7న జరిగే RSS సమావేశాలకు హాజరవుతానంటూ ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటన.. దేశ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. ఎంతో మంది మాజీ ప్రధానులు, రాష్ట్రపతులు RSS సమావేశాలకు హాజరైతే రానంత రచ్చ, ప్రణబ్  విషయంలోనే రాజుకుంటోంది. కాంగ్రెస్ భీష్ముడిగా ఖ్యాతినొందిన మాజీ రాష్ట్రపతి కాంగ్రెస్ తీవ్రంగా ద్వేషించే పరివార్ సమావేశాల్లో పాల్గొనటం “హస్తం” ప్రయోజనాలకే ఎసరంటూ రాహుల్ టీం మథనపడిపోతోంది. అధ్యక్షుడి హోదాలో రాహుల్ RSSపై విమర్శల డోసు పెంచాకే దాదా ఇలాంటి నిర్ణయం తీసుకోటం కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భవిష్యత్తులో సంఘ పరివార్ ను టార్గెట్ చేస్తూ రాహుల్ చేసే ఏ విమర్శకీ ప్రజల్లో ప్రభావం ఉండదన్న భయం హస్తాన్ని వెంటాడుతోంది. మాజీరాష్ట్రపతిని నేరుగా ఆదేశించలేని పరిస్థితుల్లో పరోక్షంగానైనా దాదాను వెనక్కులాగేందుకు కాంగ్రెస్ నానా పాట్లూ పడుతోంది. జీవితాంతం కాంగ్రె‌స్ వాదిగా ఉన్న ప్రణబ్‌ ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తారని, తిరస్కరించాలని ఆశించిన కాంగ్రెస్ కు నిరాసే ఎదురైంది. 2017లో పదవీ విరమణకు ముందే తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, అనారోగ్య కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రణబ్ ప్రకటించాక.. ఆయన అన్ని పార్టీలూ, అన్ని వర్గాలతో కలివిడిగా ఉంటున్నారు. కానీ RSS వ్యవహారంలోనే కాంగ్రెస్ ఆయన నిర్ణయాన్ని తట్టుకోలేకపోతోంది…

Image result for pranab mukherjee

          2019లో ప్రధాని పీఠంపై కన్నేసిన రాహుల్ గాంధీ.., వారానికోసారి ఆరెస్సెస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. సంఘ్‌ను విమర్శించినందుకు కోర్టుకేసుల్ని కూడా ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరాటంగా మార్చేశారు. బీజేపీ పరివార్ పై కాంగ్రెస్ అధ్యక్షుడి హోదా లో చేస్తున్న రాహుల్ విమర్శలు, ఆ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఎంతో కీలకమైనవి. కానీ.., ప్రణబ్ వంటి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదుల నిర్ణయాలు వాటికి చేటు తెస్తాయేమో అన్న భయం హస్తం క్యాడర్ ను కలవరపెడుతోంది. రాహుల్ తన రాజకీయ గురువుగ చెప్పుకున్న ప్రణబ్ నిర్ణయం.. రాహుల్ ప్రధాని ఆశలపైనే గండికొట్టే స్థాయిలో ప్రభావం చూపటం ఖాయమని కాంగ్రెస్ భయపడుతోంది.

Image result for pranab mukherjee

ప్రణబ్ పదవుల నుంచి మాజీ అయినా కాంగ్రెస్ ప్రయోజనాల విషయంలో తాజాగానే స్పందించాలని గట్టిగా కోరుకుంటోంది. ఇదే విషయాన్ని నేరుగా చెప్పలేక, ద్వితీయశ్రేణి నేతలతో చెప్పిస్తోంది. సంఘ్‌ కార్యక్రమానికి హాజరు కావాలనే నిర్ణయంపై పునరాలోచించుకోవాలని, దేశ లౌకిక వాద ప్రయోజనాల దృష్ట్యా నాగ్‌పూర్‌ వెళ్లవద్దని ప్రణబ్‌ను కోరుతూ కేంద్ర మాజీ మంత్రి జాఫర్‌ షరీఫ్‌ లేఖరాశారు. సీనియర్ నేత చిదంబం లౌక్యంగా స్పందించారు. ఆహ్వానాన్ని ప్రణబ్‌ అంగీకరించారు కనుక ఇప్పుడు మనం చేసేదేమీ లేదంటూనే.., ప్రణబ్‌జీ! మీరు నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్‌ను నిలదీయండి అంటూ డిమాండ్ చేశారు. ఇందిర, రాజీవ్‌, సోనియా.. గత కాంగ్రెస్ అధ్యక్షులంతా మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.., ఆరెస్సెస్‌ సమావేశాలకు వెళ్లటాన్ని మానుకోండి అంటూ.., కాంగ్రెస్ సీనియర్‌ నేత, ఏఐసీసీ మాజీ కార్యదర్శి వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.

Image result for pranab mukherjee

1962లో చైనాతో జరిగిన యుద్ధంలో సంఘ్‌ భారతీయ సైనికులకు సాయం చేసింది. సంఘ్ సేవలకు ముగ్ధులైన నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, 1963 గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనాలని సంఘ్‌కు ఆహ్వానం పంపిన విషయాన్ని ఆరెస్సెస్‌ సీనియర్‌ సభ్యుడు రతన్‌ శారద గుర్తుచేశారు. నెహ్రూ ఆహ్వానం మేరకు 3 వేల మంది సంఘ్ కార్యకర్తలు కవాతు చేసిన విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయిందా అని నిలదీస్తున్నారు. కన్యాకుమారిలో ఆరెస్సెస్‌కు వాస్తు శిల్పి ఏక్‌నాథ్‌ రనడే నిర్మించిన వివేకానంద స్మారకాన్ని 1977లో ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. నిర్వహణ తీరును చూసి ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల్ని అభినందించారు. నాటి కాంగ్రెస్ నేతలు అందర్నీ కలుపుకుపోతే.., వాళ్ల వారసులమి చెప్పుకుంటున్న రాహుల్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థంకావటం లేదంటూ సంఘ్ నేరుగా నిలదీస్తోంది. మరి దాదా ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: