ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ వైసీపీ నేత‌లు చేస్తున్న పోరాటాలు, దీక్ష‌ల్లో స్ప‌ష్ట‌త క‌రువైందా? ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌లోనే ఈ అంశంపై ఒక క్లారిటీ లేకుండా ఉందా? ఇలా క‌న్ఫ్యూజ్‌లోనే పోరాటాలు, దీక్ష‌లు చేస్తూ.. ప్ర‌జ‌లను మ‌రింత డైల‌మాలోకి నెట్టేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. జూన్ 2.. న‌వ నిర్మాణ దీక్ష‌ల పేరుతో ఏపీకి జ‌రిగిన అన్యాయ‌న్ని గుర్తుచేసేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌భ‌లు నిర్వ‌హిస్తుంటే.. ఇందుకు పోటీగా వంచ‌న దీక్ష‌ల పేరుతో ప్ర‌తిప‌క్ష నాయ‌కులు పోటీగా రెడీ అవుతున్నారు. విభ‌జ‌న స‌రిగా జ‌ర‌గ‌లేదని అందుకే ఈ క‌ష్టాల‌ని మొన్న‌టివ‌ర‌కూ కాంగ్రెస్‌పైనే విమ‌ర్శ‌లు గుప్పించే చంద్ర‌బాబు ఇప్పుడు.. బీజేపీని టార్గెట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 


మ‌రి వంచనపై గ‌ర్జ‌న స‌భ‌ల్లో  వైసీపీ నాయ‌కులు కూడా బీజేపీని టార్గెట్ చేస్తారా లేక ష‌రామామూలుగానే టీడీపీనే ల‌క్ష్యంగా చేసుకుంటారా అనేది అంద‌రినీ వెంటాడుతోంది. వంచ‌న‌పై గ‌ర్జ‌న పేరుతో మ‌రో స‌భ నిర్వ‌హించేందుకు ప్ర‌తిప‌క్ష వైసీపీ శ్రేణులు సిద్ధ‌మ‌వుతున్నాయి. జూన్ 2న నెల్లూరులో స‌భ నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ వంచ‌న‌పై గ‌ర్జ‌న స‌భ‌కి రాజీనామా చేసిన ఐదుగురు ఎంపీల‌తోపాటు, రాజ్య‌స‌భ స‌భ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేట‌ర్లు హాజ‌ర‌వబోతున్నారు. స‌రిగ్గా ఇలాంటి స‌భే ఏప్రిల్ 30న విశాఖ‌లో జ‌రిగింది. ఈ స‌భకి అంతంత‌మాత్రంగానే స్పంద‌న వ‌చ్చింది. 


అయితే ఇక ఈ వంచ‌నపై గ‌ర్జ‌న స‌భ‌లో వైకాపా నేత‌లు ఏం మాట్లాడ‌తారు? అంటే, ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో టీడీపీ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌న్న‌దే అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నార‌ట‌. అనుభ‌వ‌జ్ఞుడ‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి, అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు.. నాలుగేళ్ల‌పాటు భాజ‌పాతో మిత్ర‌పక్షంగా ఉండి కూడా హోదా సాధించ‌లేక‌పో యార‌న్న వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించార‌ట‌. హోదా కోసం టీడీపీ చేస్తున్న ధ‌ర్మ పోరాట దీక్ష‌ల్లో డొల్ల‌త‌నాన్ని ఎండ‌గడ‌తార‌ట‌. వాస్త‌వానికి ప్ర‌త్యేక హోదా సాధన‌లో టీడీపీ వైఫ‌ల్యం ఎంత ఉందో.. ఇస్తామ‌ని చెప్పి మాట మార్చిన బీజేపీది అంతే ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రి కేవ‌లం టీడీపీని మాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకుంటామ‌ని.. చెప్ప‌డం ఎంత వ‌ర‌కూ స‌మంజ‌స‌మ‌నేది విశ్లేష‌కుల ప్ర‌శ్న‌. 


నిజానికి, గ‌ర్జ‌న దీక్ష‌లు అంటూ వైకాపా నేత‌లు కొత్త‌గా వినిపిస్తున్న‌దేమీ లేదు. పాద‌యాత్ర‌లో ప్ర‌తీరోజూ జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌లే.. నాయ‌కులంతా మ‌రో చోట‌కి చేరి చేస్తున్నారు. ఇంకోటి, ప్ర‌త్యేక హోదాపై వైసీపీ పోరాటం అంటోందేగానీ.. దానిపై కొంత గంద‌ర‌గోళం కొన‌సాగిస్తూనే ఉంది. మొద‌టిది.. హోదా ఇవ్వాల్సిన కేంద్రంపై వైసీపీ స‌మ‌రం సాగ‌డం లేదు. రెండోది.. ప్ర‌త్యేక హోదా ఎలా సాధిస్తారు అనేదానిపై కూడా వైకాపా వాద‌న‌లో స్ప‌ష్ట‌త లేదు. 


ఎందుకంటే, ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీకి వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తుందా? లేదంటే, కాంగ్రెస్ కి మ‌ద్ద‌తు ఇస్తుందా? ఇంకోటి… 2019 నాటికి ఏర్పాటు కాబోతున్న ప్రాంతీయ పార్టీల జాతీయ కూట‌మిలో వైసీపీ ఉంటుంద‌నే స్ప‌ష్ట‌తా ఇంకా లేదు. ఒక‌వేళ ఆ కూట‌మికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు వైసీపీ వైఖ‌రి స్ప‌ష్ట‌మైతే.. అది బీజేపీకి వ్య‌తిరేక‌మ‌వుతుంది! అందుకే దీనిపై జ‌గ‌న్ మౌనంగా ఉంటున్నారా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప‌రిస్థితుల మ‌ధ్య ప్ర‌త్యేక హోదాను వైసీపీ ఎలా సాధిస్తుంద‌నే స్ప‌ష్ట‌త జ‌గ‌న్ ఇంకా ఇవ్వ‌లేక‌పోతున్నారు. ఆ క‌న్ఫ్యూజ‌న్ తోనే జ‌గ‌న్ పాద‌యాత్ర‌, కొత్త‌గా ఈ గ‌ర్జ‌న స‌భ‌లూ చేసుకుంటూ పోతున్నారు! మ‌రి వీటికి ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ఎంత వ‌ర‌కూ వ‌స్తుందో!!


మరింత సమాచారం తెలుసుకోండి: