ఏపీలో 25 లోక్‌స‌భ సెగ్మెంట్లు ఉన్నా కొన్ని లోక్‌స‌భ సెగ్మెంట్ల‌లో రాజ‌కీయం చాలా ర‌స‌కందాయంలో న‌డుస్తుంటుంది. అక్క‌డ ఎవ‌రు పోటీ చేసేవారి గురించి ?  గెలుపు ఓట‌ముల గురించి స్టేట్ అంతా ఆస‌క్తితో ఆరా తీస్తుంటుంది. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు లోక్‌స‌భ సీటు కోసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు సాగ‌నుంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పోటీ చేయ‌నున్నారు. వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరిని ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్ ఈ సారి జ‌య‌దేవ్‌కు ధీటైన అభ్య‌ర్థిని రంగంలోకి దింపుతున్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థ‌ల డైరెక్ట‌ర్ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు వైసీపీ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్నారు.


ఇద్ద‌రూ యంగ్‌స్ట‌ర్సే, ఉన్న‌త విద్యావంతులు... ఆర్థికంగాను, సామాజికంగాను ఇద్ద‌రూ బ‌ల‌వంతులే కావ‌డంతో గుంటూరు పోరు మామూలుగా ఉండేలా లేదు. వాస్త‌వంగా చూస్తే గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత మూడేళ్ల వ‌ర‌కు జ‌య‌దేవ్ ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేక‌పోయినా ఆయ‌న‌కు స‌రైన పోటీయే లేకుండా పోయింది. ఎప్పుడైతే జ‌గ‌న్ శ్రీకృష్ణ‌దేవ‌రాయులు పేరు ఎనౌన్స్ చేశారో అప్ప‌టి నుంచే ఇక్క‌డ వైసీపీ బ‌లంగా పుంజుకుంది. క్ర‌మ‌క్ర‌మంగా ఆయ‌న లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని సెగ్మెంట్ల‌లో ప‌ట్టు పెంచుకున్నారు.


జ‌య‌దేవ్ విష‌యానికి వ‌స్తే సిట్టింగ్ ఎంపీగా ఉన్నా నాలుగేళ్లలో జ‌నాల‌కు కేవ‌లం రోజుల్లోనే అందుబాటులో ఉన్నారు. స్థానికేత‌రుడు కావ‌డంతో ఎంపీ ఎప్పుడు వ‌స్తున్నారో ?  ఎప్పుడు వెళుతున్నారో ?  కూడా ఎవ్వ‌రికి తెలియ‌ని ప‌రిస్థితి. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌నంటూ ప్ర‌త్యేకంగా చేసిన అభివృద్ది కూడా లేదు. ఇక శ్రీకృష్ణ‌దేవ‌రాయులు స్థానికుడు కావ‌డంతో పాటు వారి విద్యాసంస్థ‌ల్లో చ‌దువుకున్న ల‌క్ష‌లాది మంది యువ‌త‌తో పాటు దేశ‌విదేశాల్లో ఉన్న వారు సైతం ఆయ‌న‌కు పార్టీల‌కు అతీతంగా స‌పోర్ట్ చేస్తున్నారు.


ఇక లోక్‌స‌భ సెగ్మెంట్ల‌లోని అసెంబ్లీ సీట్ల విష‌యానికి వ‌స్తే గుంటూరు తూర్పులో వైసీపీ బ‌లంగా ఉండ‌డానికి స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యే ముస్త‌ఫా ఉండ‌డ‌మే కార‌ణం. ప్ర‌త్తిపాడులో టీడీపీ గ్రూపు రాజ‌కీయాల‌తో బ‌ల‌హీన‌ప‌డ‌గా ఆ మేర‌కు వైసీపీ బ‌లంగా పుంజుకుంది. ఈ సీటు విజ్ఞాన్ ర‌త్త‌య్య సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఇక్క‌డ కూడా ఎంపీకి వ‌చ్చేస‌రికి వైసీపీకి ప్ల‌స్ కానుంది. 


తాడికొండ‌లో గ్రూపు రాజ‌కీయాల‌తో టీడీపీ స‌గం బ‌ల‌హీన‌ప‌డింది. ఇక్క‌డ వైసీపీకి స‌రైన క్యాండెట్ లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌. పొన్నూరులో వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తోన్న న‌రేంద్ర‌కు ఈ సారి ఎదురుగాలి బ‌లంగా వీస్తోంది. తెనాలిలో ఆల‌పాటి రాజా క‌బ్జా రాజ‌కీయాల దెబ్బ‌తో నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక్క‌డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న అన్నాబ‌త్తుని శివ‌కుమార్ గ‌త ఎన్నిక‌ల నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మ‌వ్వ‌డం వైసీపీకి బాగా క‌లిసొచ్చింది. 


ఇక గుంటూరు వెస్ట్‌లో ఎప్పుడు ఎవ‌రికి అనుకూలంగా స‌మీక‌ర‌ణ‌లు మార‌తాయో ?  చెప్ప‌డం క‌ష్టం. కానీ శ్రీకృష్ణ‌దేవ‌రాయులు గుంటూరు వెస్ట్‌కు స్థానికుడు కావ‌డంతో విస్తృత ప‌రిచ‌యాలు వ‌ర్గాల‌కు అతీతంగా ఆయ‌న వైపు మొగ్గు చూపుతున్నారు. మంగ‌ళ‌గిరిలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి గెలిచినా ప్ర‌స్తుతం అక్క‌డ వైసీపీకి అంత సానుకూల ప‌వ‌నాలు లేవు. వ‌ర్గ విబేధాల‌తో నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ కునారిల్లుతోంది. బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం అయిన ప‌ద్మ‌సాలీలు వైసీపీ వైపు మొగ్గుతున్నారు. ఏదేమైనా గుంటూరు లోక్‌స‌భ సంగ్రామంలో ఈ సారి జ‌య‌దేవ్ వ‌ర్సెస్ శ్రీకృష్ణ‌దేవ‌రాయుల మ‌ధ్య వార్ కురుక్షేత్ర సంగ్రామాన్ని త‌ల‌పించేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: