నాలుగేళ్లుగా దేశవ్యాప్తంగా అప్రహతిహత విజయాలు నమోదు చేస్తూ వచ్చిన బీజేపీకి ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. ఆ పార్టీ హవా నానాటికీ దిగజారిపోతోంది. కొంతకాలంగా జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీ పతనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ పతనం ఖాయం. ఈ ఏడాది మార్చిలో గోరఖ్ పూర్.. ఫూల్పూర్.. ఈ మేలో అల్వార్‌, అజ్‌మేర్‌, కైరానా, భండారా-గోండియా.. ఒక్కో ఉపఎన్నికలలో ఒక్క సిట్టింగ్ ఎంపీ సీటు బీజేపీ ఖాతా నుంచి మాయమైపోయాయి. 2014 ఎన్నికల్లో.. తన మ్యానియాతో బీజేపీ శ్రేణులు ఊహించని విజయాన్ని అందించిన మోదీ ప్రభంజనం మాయమవుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కమలం ఓడిపోతోంది. ఉపఎన్నికల్లో సత్తా చాటలేక చతికిలపడుతోంది. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ తదితర విపక్షాలు కలిసి బరిలోకి దిగితే... కమలదళం ఖంగు తినాల్సిందేనా అన్న అనుమానం కలుగుతోంది. 2014లో కేంద్రంలో అధికారం చేపట్టడానికి అవసరమైన మెజార్టీని బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఈ నాలుగేళ్లలో 11 రాష్ట్రాల్లో కమలం పాగా వేసే స్థాయిలో ఉపయోగపడింది. కానీ వరుసగా జరుగుతున్న ఉపఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన రాజకీయ సమీకరణాల్నే మార్చేస్తోంది.

Image result for BJP VS ALL PARTIES

యూపీ 2014 నుంచి బీజేపీ కంచుకోటాగా మారింది. 2014లో లోక్ సభ ఎన్నికల్లో 71 సీట్లు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 323 సీట్లలో పాగావేసిన బీజేపీ యూపీలో గట్టి పునాదులున్నాయన్న విషయాన్ని నిరూపించుకుంది. అలాంటి రాష్ట్రంలో మూడు లోక్‌సభ సిట్టింగ్‌ స్థానాల్ని రెండు నెలల వ్యవధిలో జరగిన ఉపఎన్నికల్లో  చేజార్చుకుంది. సీట్లతోపాటు ఓట్లనూ కోల్పోయి శ్రేణుల్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. గత మార్చిలో జరిగిన గోరఖ్ పూర్ ఉపఎన్నిక విషయాన్ని తీసుకుంటే 2014లో బీజేపీ ఎంపీ అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ 51.80 శాతం ఓట్లతో గోరఖ్ పూర్ లోక్ సభా స్థానాన్ని వరుసగా ఐదోసారి బీజేపీ ఖాతాలో వేశారు. అలాంటి చోట గత ఉపఎన్నికలో తొలిసారి సమాజ్ వాదీ పార్టీ పాగా వేసింది. గోరఖ్ పూర్ ఉపఎన్నిక తోపాటు జరిగిన ఫూల్పూర్ ఎన్నికలోనూ బీజేపీకి నిరాశే ఎదురైంది. తాజాగా జరిగిన కైరానా ఉపఎన్నికలోనూ బీజేపీకి నిరాశే ఎదురైంది. 2014లో బీజేపీ ఎంపీ అభ్యర్థి హుకుం సింగ్ 50.54 శాతం ఓట్లతో కైరానా లోక్ సభా స్థానంలో రెండోసారి బీజేపీ జెండా ఎగరేశారు. మోదీ హావాతో చరిత్ర సృష్టించారు. అలాంటి నియోజకవర్గంలోనూ కమలం ఆనందం ఆవిరైంది. ఆ రాష్ట్రంలో బద్ధశత్రువులైన ఎస్పీ,  బీఎస్పీలు విడివిడిగా పోటీ చేసినప్పుడు వరుసగా 22.20%, 19.60% శాతం ఓట్లకు పమితం కావటం కమలానికి ఇన్నాళ్లూ కలిసి వచ్చింది. ఎప్పుడైతే విపక్ష పార్టీలు ఏకపక్షంగా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడుతున్నాయో.. బీజేపీ పునాదులు కదిలిపోతున్నాయి.

Image result for BJP VS ALL PARTIES

2014 ఎన్నికల్లో 40 లోక్‌సభ సీట్లున్న బిహార్‌లో బీజేపీ 29.40 శాతం ఓట్లను, 22 లోక్ సభ సీట్లను దక్కించుకుంది. జేడీయూ కూడా మధ్యలో కలవటంతో., ఆ రాష్ట్రంలో బీజేపీ బలం 35.20 శాతానికి పెరిగింది. కానీ ముఖ్యమంత్రి నీతీశ్‌కు ఉన్న పలుకుబడి, పాలనాదక్షత విషయంలో ప్రజల నాడి మరోలా ఉందని తాజా ఉపఎన్నికలు తేల్చేశాయి. బీహార్ లో కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఎన్సీపీ తదితర విపక్షాలు కలిసి పోటీచేస్తే... ఆ కూటమికి 30 శాతానికిపైగా ఓట్లు పోలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఇక్కడ కూడా బీజేపీ చాలా సీట్లను కోల్పోవాల్సి రావచ్చు. ఎన్నికలకు ముందే విపక్షాల మధ్య పొత్తు వికసిస్తే... పలు హిందీ రాష్ట్రాల్లోనూ బీజేపీ గట్టి పోటీని ఎదుర్కోక తప్పదు.

Image result for BJP VS ALL PARTIES

రాజస్థాన్‌లో ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా కనిపిస్తున్నాయి. అధికారం ఉన్నప్పటికీ అల్వార్‌, అజ్‌ మేర్‌ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. కనీసం మండల్‌ గఢ్‌ శాసనసభ స్థానాన్ని కూడా నిలుపుకోలేకపోయింది. ఈ మూడింటినీ కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకోవటంతో, బీజేపీకి ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. 14 లోక్ సభ స్థానాలున్న ఝార్ఖండ్‌లోనూ బీజేపీకి 2019లో ఎదురీత తప్పేలా లేదు. సిల్లీ, గోమియా శాసనసభ స్థానాలను జేఎంఎం నిలబెట్టుకోగలిగింది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో 40.10 శాతం ఓట్లు సాధించిన బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది. ఇక్కడ కాంగ్రెస్‌, జేఎంఎంలు పొత్తు పెట్టుకుంటే కొన్నిస్థానాల్లోనైనా కమలం పై పైచేయి సాధించే వీలుంది

Image result for BJP VS ALL PARTIES

బీజేపీతో బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్న శివసేన... ఒంటరిగా పోటీచేస్తే మహారాష్ట్రలోకమలం మట్టి కరవాల్సిన దుస్థితి. తాము అధికారంలోకి రాకపోయినా, బీజేపీని అధికారానికి దూరం చేయాలన్న తాపత్రయం శివసేనలో తీవ్రంగా ఉంది. ఇక గుజరాత్‌లో గతసార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్లు 60.11 శాతం. ఆ తర్వాత జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అతి కష్టం మీద 40.1 శాతం ఓట్లను తెచ్చుకోగలిగింది. అంటే ఆ రాష్ట్రంలో బీజేపీకి సుమారు 16 లోక్‌సభ సీట్లు తగ్గిపోయినట్లే.ఉపఎన్నికల ఫలితాల తర్వాత విపక్షాల ఐక్యతను దెబ్బతీయడమే బీజేపీ ముందున్న అతి పెద్ద సవాలు. ‘విభజించి గెలవడం’ ఒక ఎత్తయితే... ఏదైనా ఒక బలమైన సెంటిమెంటుతో గంపగుత్తగా ఓటర్లను ఆకర్షించడం, ఎన్నికల అనంతరం చాకచక్యంగా కొత్తపొత్తులకు వెళ్లడం వంటి ప్రత్యామ్నాయాలపై ఆ పార్టీ దృష్టి సారిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఒంటెద్దుపోకడలను స్వాగతించేవారెవరూ లేరు. అవసరమైతే మోదీని గద్దె దించేందుకు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. కర్నాటక ఎన్నికలకు ఇందుకు పునాది వేశాయి. ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్తే బీజేపీ కంగుతినడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: