హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీకి మ‌ళ్లీ ఎదురుదెబ్బ త‌గిలింది. ఇప్ప‌టికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంప‌త్‌కుమార్‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి శాస‌న స‌భ స‌భ్వ‌త్వాల‌ను అనైతికంగా ర‌ద్దు చేసింద‌న్న అప‌వాదును మూట‌గ‌ట్టుకున్న ఆ పార్టీకి ఇదే విష‌యంలో కోర్టు మొట్టికాయ‌లు వేసింది.  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలు రద్దు చేయడాన్ని కొట్టివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ 12మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఆ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ కు విచార‌ణ అర్హ‌త లేద‌ని సోమ‌వారం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో గులాబీ నేత‌లు మ‌రోసారి ప‌రువు పోగొట్టుకున్నారు. 


అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్‌ ప్రసంగిస్తుండ‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ స‌భా మ‌ర్యాద‌ల‌కు భంగం క‌లిగించారంటూ వారి సభ్యత్వాలను ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించి వెనువెంట‌నే ఎన్నిక‌ల క‌మిష‌న్ కు కూడా ఆ రెండు స్థానాలు న‌ల్ల‌గొండ‌, ఆలంపూర్ ఖాళీ అయ్యాయ‌ని, ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని లేఖ‌లు కూడా రాసింది. ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ  హైకోర్టు తలుపుతట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాస‌న స‌భ్వ‌త్వం ర‌ద్దును  కొట్టివేస్తూ సభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.


అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ 12 మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ముందుగా ఈ పిటిష‌న్ విచార‌ణార్హంపై వాద‌న‌లు వినేంద‌కు కోర్టు అంగీక‌రించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి, టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం మాత్రమే ఉన్నందున వారి అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకోవాలని.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని కాంగ్రెస్‌ తరపు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కొట్టివేసింది. 

Image result for high court

నిజానికి ఈ కేసులో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మొద‌టి నుంచీ కూడా అనైతికంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. అంతేగాకుండా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌తో పిటిష‌న్ వేయించి, కాల‌యాప‌న చేసేందుకు ప్ర‌య‌త్నం చేసింద‌నే వాద‌న కూడా బ‌లంగా వినిపించింది. ఈ వ్య‌వ‌హారంతో సంబంధం లేని ఎమ్మెల్యేలు కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ పిటిష‌న్ వేయ‌డాన్ని కూడా ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు త‌ప్పుబ‌ట్టారు. కాగా,  సంప‌త్‌, కోమ‌టిరెడ్డిని ఎమ్మెల్యేలుగా కొన‌సాగించాల‌ని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్ప‌టికీ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌లేదు. దీనిపై ఇటీవ‌ల కాంగ్రెస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్‌ను కూడా క‌లిశారు. ఈ క్రమంలోనే కోర్టులో మ‌రోసారి టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా తీర్పు రావ‌డంతో ఇప్ప‌టికైనా వారిని ఎమ్మెల్యేలుగా గుర్తిస్తుంద‌దో లేదో చూడాలి మ‌రి. 


మరింత సమాచారం తెలుసుకోండి: