ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ సామాజిక వ‌ర్గాల ఉద్య‌మాలు మ‌ళ్ళీ ఊపిరిపోసుకుంటున్నాయ్. పోయిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన హామీలు ఒక కార‌ణ‌మైతే సుదీర్ఘంగా త‌మ‌ను ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యానికి గురిచేస్తున్నాయ‌ని ఆయా వ‌ర్గాలు భావించ‌ట‌మే మ‌రో కార‌ణం. మొన్న‌టి వ‌ర‌కూ బిసిల్లో చేర్చాలంటూ కాపులు రాష్ట్రంలో న‌డిపిన ఉద్య‌మం అంద‌రికీ తెలిసిందే. తాజాగా అనంతపురం కేంద్రంగా వాల్మీకి బోయ‌లు ఉద్య‌మం మొద‌లుపెట్టారు. ప్ర‌స్తుతం బిసిలుగా ఉన్న త‌మ‌ను ఎస్టీల్లో చేర్చాలంటూ బోయ‌లు ఈమ‌ధ్య‌నే ఒక్క రోజు దీక్ష చేసి కేంద్ర‌, రాష్ట్ర  ప్ర‌భుత్వాల‌కు హెచ్చరిక‌లు జారీ చేయ‌టం గ‌మ‌నార్హం. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌ది కాబ‌ట్టే ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి పెట్టి త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చుకోవాల‌న్న‌ది సామాజిక‌వ‌ర్గాల వ్యూహంగా క‌న‌బ‌డుతోంది. 


అస‌లు నేప‌ధ్య‌మేంటి ?
ఎస్టీల్లో చేర్చాల‌న్న బిసిల ఉద్య‌మానికి నేప‌ధ్య‌మేంటి ? అంటే, 1956కు ముందున్న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బోయ‌లు ఎస్టీల్లోనే ఉండేవారు. అయితే, అప్ప‌ట్లో జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా ప‌లువురు బోయ‌లు క‌ర్నాట‌క రాష్ట్రంలోకి వెళ్లిపోగా ఇంకొంద‌రు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోకి వ‌చ్చారు. క‌ర్నాట‌క‌లోకి వెళ్ళిపోయిన బోయ‌ల‌ను  అక్క‌డి ప్ర‌భుత్వం ఎస్టీలుగానే ఉంచింది. త‌ర్వాత నీలం సంజీవ‌రెడ్డి ముఖ్య‌మంత్రైన త‌ర్వాత ఆంధ్రాలోని బోయ‌లను రెండుగా చీల్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటున్న బోయ‌ల‌ను ఎస్టీలుగాను మైదాన‌ప్రాంతాల్లో ఉంటున్న వారిని మాత్రం బిసి క్యాట‌గిరిలో చేర్చారు. దాంతో అప్ప‌టి నుండి బిసిలైన బోయ‌లు త‌మ‌ను ఎస్టీల్లోకి మార్చాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. పార్టీలుగా వీళ్ళ డిమాండ్ ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ అవ‌స‌రాల‌కు వాడుకోవాల‌ని మాత్ర‌మే అనుకోవ‌టంతో వాళ్ళ డిమాండ్ డిమాండ్ గానే మిగిలిపోతోంది. 


చంద్ర‌బాబు హామీల మాటేంటి ?
2014  రాష్ట్ర విభ‌జ‌న నేప‌ధ్యంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎలాగైనా గ‌ట్టెక్కాల‌న్న ఉద్దేశ్యంతో చంద్ర‌బాబు త‌న ప‌రిధిలో లేద‌ని తెలిసినా బోయ‌ల‌ను ఎస్టీల్లో చేరుస్తానని హామీ ఇచ్చారు. అయితే,  అధికారంలోకి రాగానే కాపుల‌కు ఇచ్చిన హామీలాగా ఈ హామీని కూడా గాలికొదిలేశారు. అయితే, రానున్న ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కాపుల‌ను బిసిల్లో చేర్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన‌ట్లే బోయ‌ల‌ను ఎస్టీల్లో చేర్చాలంటూ మ‌రో తీర్మానం చేశారు. రెండు తీర్మానాల‌ను కేంద్రానికి పంపేసి చేతులు దులిపేసుకున్నారు. త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల్లో చంద్ర‌బాబు ఎన్డీఏలో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌టంతో రాష్ట్రం నుండి వెళ్ళిన తీర్మానాల‌ను కేంద్ర‌ప్ర‌భుత్వంలో ప‌ట్టించుకునే దిక్కులేకుండా పోయింది.


తాజా ఆందోళన ఎందుకు ?
జిల్లాలోని బోయ‌లందరూ కలిసి పార్టీల‌కు అతీతంగా ఈమ‌ధ్య ఒక్క రోజు దీక్ష చేశారు. ఎస్టీ సాధ‌న దీక్ష పేరుతో జ‌రిగిన ఆందోళ‌న‌కు అన్నీ పార్టీల‌ను ఆందోళ‌నకారులు మ‌ద్ద‌తుకోరారు. త‌మ‌ను ఎస్టీల్లో చేరుస్తామంటూ పోయిన ఎన్నిక‌ల్లో అన్నీ పార్టీలు హామీలిచ్చాయి కాబ‌ట్టి హామీల‌ను నెర‌వేర్చేబాధ్య‌త అన్నీ పార్టీల‌పైనా ఉంద‌నేది ఆందోళ‌న‌కారుల వాద‌న‌. అందుకే అన్నీ పార్టీల నేత‌ల‌నే మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ కోరారు. విచిత్ర‌మేమిటంటే, అధికార‌పార్టీకి చెందిన ఎంఎల్ఏలే దీక్ష‌ను ప‌ట్టించుకోలేదు. పోయిన ఎన్నిక‌ల్లో జిల్లాలోని 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో టిడిపి 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచింది. పైగా బోయ‌ల‌ను ఎస్టీల్లో చేరుస్తూ చంద్ర‌బాబు అసెంబ్లీలో తీర్మానం కూడా చేయించారు. అయినా వీళ్ళ డిమాండ్ అధికార పార్టీ ఎంఎల్ఏల‌కు ప‌ట్ట‌లేదు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బోయ‌ల పాత్రేంటి ?
అనంత‌పురం జిల్లాలో బోయ‌ల జ‌నాభా చాలా ఎక్కువే ఉంది. 14 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ స‌గ‌టున 40 వేల వ‌ర‌కూ వీరి జ‌నాభా ఉంటుంది. వీళ్ళ స‌హ‌కారం లేకుండా ఏ పార్టీ కూడా గెలిచే అవ‌కాశాలు త‌క్కువే. ఆ విష‌యం గ‌త ఎన్నిక‌ల్లో అన్నీ పార్టీల‌కూ అనుభ‌వ‌మే. బోయ‌ల సామాజిక‌వ‌ర్గం వ‌ల్ల పోయిన ఎన్నిక‌ల్లో ఎక్కువ ల‌బ్దిపొందింది చంద్ర‌బాబే. ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోలేక‌పోయిన చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాళ్ళ‌కి మ‌ళ్ళీ ఏమి హామీలిస్తారో చూడాల్సిందే. అదే విధంగా వైసిపి అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లో కూడా బోయ సామాజిక‌వ‌ర్గం జిల్లాలో సానుకూలంగానే  స్పందించింది. ఎన్నిక‌ల అంశంగా మాత్ర‌మే చూడ‌కుండా త‌మ‌ను ఎస్టీల్లో మార్చాల‌న్న వాల్మీకి బోయ‌ల ఆందోళ‌న ఎప్ప‌టికి  స‌క్సెస్ అవుతుందో చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: