మూడు రోజుల క్రితం జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోని పెద్ద‌దండ్లూరులో జ‌రిగిన గొడ‌వ‌లో మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి భార్య అరుణ‌, కొడుకు సుధీర్ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టారు.  పై గ్రామంలో సంప‌త్ అనే యువ‌కుడి వివాహ రిసెప్ష‌న్ కు హాజ‌రైన వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి త‌దిత‌రుల‌పై మంత్రి మ‌ద్ద‌తుదారులు దాడి చేసిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. దాడిలో ఎంపికి ఏమీ కాక‌పోయినా మ‌ద్ద‌తుదారుల్లో కొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గ్రామంలోకి ఎవ‌రు ప్ర‌వేశించాల‌న్నా మంత్రి మ‌ద్ద‌తుదారుల అనుమ‌తి తీసుకోవాల‌న్న నిబంధ‌నే విచిత్రంగా ఉంది. అన్నింటిక‌న్నా విచిత్ర‌మేమిటంటే ఎంపి మ‌ద్ద‌తుదారుల‌తో పాటు టిడిపికే చెందిన ఎంఎల్సీ రామ‌సుబ్బారెడ్డి మద్ద‌తుదారుల‌పైన కూడా మంత్రి మ‌ద్ద‌తుదారులు దాడి చేసి గాయ‌ప‌ర‌చ‌టం. 


మొత్తం 136 మందిపై కేసులు
దాడులు జ‌ర‌గ‌టం, గాయ‌ప‌ర‌చ‌టం ఒక ఎత్తైతే జ‌రిగిన దాడికి మంత్రి భార్య అరుణ ప్ర‌త్య‌క్ష పాత్ర పోషించ‌టం మ‌రొక ఎత్తు. మంత్రి కొడుకు సుధీర్ రెడ్డి మద్ద‌తుదారుల‌తో ప్ర‌త్య‌ర్ధి వ‌ర్గాల‌పై దాడులు చేస్తుంటే మంత్రి భార్య అక్క‌డే ఉండి ప్రోత్స‌హించ‌టంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. మంత్రి భార్య ఘ‌ట‌నా స్ధ‌లంలో ఉన్న ఫొటోల‌ను వైసిపి వ‌ర్గాలు విడుద‌ల చేశాయి. అంతేకాకుండా భార్య‌, కొడుకు, మంత్రి సోద‌రుల‌పైన కూడా పోలీసుస్టేష‌న్లో ఫిర్యాదు చేశాయి. త‌మ ఫిర్యాదుకు మ‌ద్ద‌తుగా వీడియో, ఫొటో సాక్ష్యాల‌ను కూడా జ‌త చేశాయి. దాంతో పోలీసులు కూడా ఏమీ చేయ‌లేక‌పోయారు. 


ఎస్సీ, ఎస్టీ కేసుకు స‌సేమిరా ?
మంత్రి కొడుకు, భార్య‌, సోద‌రుల‌పై ఎస్సీ, ఎస్టీ కేసులు న‌మోదు చేయాల‌ని బాధితులు ఎంత ఒత్తిడి పెట్టినా పోలీసులు ప‌ట్టించుకోలేదు. త‌మ‌ను కులం పేరుతో బ‌హిరంగంగా దూషించారని బాధితులు ఎంత మొత్తుకున్న పోలీసులు లెక్క చేయ‌లేదు. అయితే, మంత్రి మ‌ద్ద‌తుదారుల్లో కొంద‌రిపైన మాత్రం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటిస్ కేసు న‌మోదు చేయ‌టం గ‌మ‌నార్హం. మొత్తం మీద  మంగ‌ళ‌వారం నాడు మంత్రి భార్య‌, కొడుకు, సోద‌రులతో పాటు మొత్తం 136 మందిపై నాన్ బెయిల‌బుల్ కేసులు న‌మోదు చేశారు. ఏకంగా భార్య‌, కొడుకు, సోద‌రులపైనే పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు న‌మోదు చేయ‌టంపై మంత్రి ఏ  విధంగా స్పందిస్తారో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: