కృష్ణాజిల్లా నందిగామ రిజర్వ్డ్ నియోజకవర్గం టీడీపీ అధీనంలో ఉంది. ఇక్కడ నుంచి 2014లో టీడీపీ తరఫున తంగిరాల ప్రభాకరరావు గెలుపొందారు. అయితే,ఆయన ఎన్నికైన కొద్దికాలానికే అకస్మాత్తుగా మృతి చెందారు. దీంతో ఆయన కుమార్తె తంగిరాల సౌమ్య ఏకగ్రీవంగా ఇక్కడ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆమె పనితీరు విషయంలో సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. తండ్రి తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మృతితో జరిగిన ఉప ఎన్నికలో నందిగామ ఎమ్మెల్యేగా సౌమ్య ఎన్నికయ్యారు. పోటీ చేసే సమయానికి సౌమ్యకు నియోజకవర్గ సమస్యలపై పెద్దగా అవగాహన లేదు. తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానని మాత్రం చెప్పారు. చేసిన వాగ్దానాలలో చెప్పుకోదగినవి ఏమీ లేనప్పటికీ మంత్రి దేవినేని ఉమా సహకారంతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఎంపీ కేశినేని నాని చొరవతో మూడు వందల కోట్లతో కంచికచర్ల, నందిగామ బైపాస్ విస్తరణకు మోక్షం లభించింది. ఎస్పీఎం బాధిత సుబాబుల్ రైతులకు ప్రభుత్వం నుంచి సొమ్ములు ఇప్పించటంలో ఆమె కృతకృత్యులయ్యారు. నియోజకవర్గంలోని నందిగామ, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండ లాల్లో 80 శాతం రోడ్ల రూపురేఖలు మారాయి. 2016లో పుష్కరాల నిదులతో పలు రోడ్లకు మోక్షం కల్గింది. చందర్లపాడు నుంచి ఉస్తేపల్లి రోడ్డు, కోనాయపాలెం నుంచి పాతబెల్లంకొండవారిపాలెం, కంచికచర్ల జాతీయ రహదారి నుంచి గనిఆత్కూరు రోడ్లు నిర్మించారు. ఈ నాలుగేళ్లలో రోడ్ల అభివృద్ధికి వందల కోట్లు ఖర్చు చేశారు. పేరకలపాడు నుంచి గండేపల్లి వెళ్లే డొంక రోడ్డును రూ. 2.25 కోట్లతో బీటీ రోడ్డుగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో అంతర్గత రహదారులు బాగుపడ్డాయి.
సాగు నీరందించేందుకు మొత్తం రూ. 85 కోట్లతో నియోజకవర్గంలో ఐదు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. వీరులపాడు మండలం జయంతి, కంచికచర్ల మండలం మోగులూరు, కంచికచర్ల, గనిఆత్కూరు, చందర్లపాడు మండలం చింతలపాడు-2 ఎత్తిపోతల పథకాల వల్ల 18 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. నియోజకవర్గంలో 50కి పైగా ఎత్తిపోతల పథకాలున్నాయి. నిర్వహణ సక్రమంగా లేనందున పలు పథకాలు మూలనపడ్డాయి. వీటికి రూ. ఆరు కోట్ల నిధులు తీసుకువచ్చి మరమ్మతులు చేయించారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తుర్లపాడు, గుత్తావారిపాలెం, కేతవీరునిపాడు, బొబ్బిళ్లపాడు, గుడిమెట్ల-3, కంచెల, వెల్లంకి, కాసరబాద-3, కాట్రేనిపల్లి పథకాల కోసం కృషి చేస్తున్నారు.
