పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. అధికార తెలుగుదేశం పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. కొంతకాలం క్రితం వరకూ ఆ పార్టీతో అంటకాగిన పవన్ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించి ఆ పార్టీని టార్గెట్ చేసుకున్నారు. ఎందుకు పవన్ యూటర్న్ తీసుకున్నారు? పవన్ వెనుక ఎవరున్నారు..?


          పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన హుషారుగా సాగుతోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం పర్యటన పూర్తి చేసుకున్న పవన్.. విశాఖ జిల్లాలో పోరాటయాత్ర చేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్థానికులతో చర్చించి ఆరా తీస్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనానికి చంద్రబాబే కారణమని విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతంపై చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో పవన్ ప్రాంతాలవారీగా చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు కౌంటర్ అయ్యారు. దీనిపైన కూడా పవన్ రియాక్ట్ అయ్యారు. నాకు అలాంటి కుల, ప్రాంతాభిమానాలు లేవని తేల్చి చెప్పారు.


          అయితే పవన్ కల్యాణ్ కేవలం కులరాజకీయాలే చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్న నేతలంతా కాపులేనని, ఆయన ఇప్పటివరకూ చేర్చుకున్న వారంతా కాపు సామాజిక వర్గానికి చెందినవారేనని చెప్తున్నారు. నిన్న మొన్నటివరకూ చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్ని పొగిడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడానికి కారణాలు చెప్పాలన్నారు. నాలుగేళ్లుగా కనిపించని అవినీతి ఇప్పుడే కనిపించడం వెనుక ఎవరున్నారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ, వైసీపీ చెప్పుచేతల్లో పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని విమర్శిస్తున్నారు.


          పవన్ కల్యాణ్ మాత్రం తన వెనుక ఎవరూ లేరని చెప్పుకొస్తున్నారు. అయితే టీడీపీని ఓ వైపు దుమ్మెత్తిపోస్తున్న పవన్... వైసీపీ, బీజేపీలపై పల్లెత్తు మాట అనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవే అనుమానాలను టీడీపీ నేతలు లేవనెత్తుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానన్న పవన్ ఆ మాట ఎందుకు ఎత్తడం లేదంటున్నారు. ప్రత్యేకహోదా కోసం ఎంపీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అవసరమైతే ఢిల్లీ వస్తానన్న పవన్ ఎక్కడికి పారిపోయారని ప్రశ్నిస్తున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ వేసి కేంద్రమే రాష్ట్రానికి అన్యాయం చేసిందని తేల్చిన పవన్.. వాటిని ఇప్పుడు ఎందుకు లేవనెత్తడం లేదని అడుగుతున్నారు.


          అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి పవన్ దేన్నీ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. ప్రత్యేక హోదా నినాదాన్ని ఫస్ట్ లేవనెత్తింది పవన్. అయితే దాన్ని ఇప్పుడు మరుగన పడేశారు. ప్రత్యేకహోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానన్నప్పుడు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు దాని ఊసే లేదు. ఇప్పుడు పవన్ టూర్ అంతా వైసీపీ అధినేత జగన్ లాగా మారిపోయింది. జగన్ ఎక్కడికెళ్లినా చంద్రబాబును తిట్టేందుకు తప్ప మిగిలన అంశాలపై ఫోకస్ చేయడం లేదు. ఇప్పుడు పవన్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. మరి పవన్ ప్రత్యామ్నాయ రాజకీయం ఎలా తీసుకొస్తారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: