ఏపీ రాజ‌కీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికారం మ‌ళ్లీ ఎలాగైనా నిల‌బెట్టుకోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు చారిత్ర‌క అవ‌స‌రం అంటూ.. 2014లో చెప్పిన మాట‌ల‌నే మ‌ళ్లీ రివైండ్ చేసి గ‌ట్టిగా చెబుతున్నారు. మ‌రోప‌క్క వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప‌యాత్ర‌,  జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పోరాట యాత్ర పోరాతో రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్నో స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ.. గంద‌ర‌గోళంలో ఉన్న చంద్ర‌బాబుకు ప‌లు జిల్లాల్లోని న‌లుగురు కీల‌క నాయ‌కులు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌. అధికార పార్టీకి చెందిన ఎంపీతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు చాప‌కింద నీరులా.. పార్టీ మారే వ్య‌వ‌హారంపై మంత‌నాలు కొన‌సాగిస్తున్నార‌ని తెలుస్తోంది. వీరు ఎప్పుడు సైకిల్ దిగిపోతార‌నే విష‌యంపై ఇంకా క్లారిటీ లేక‌పోయినా.. దిగిపోవ‌డం మాత్రం ప‌క్కా అనే చ‌ర్చ పార్టీలో మొద‌లైంది. 

Image result for jenasena

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉండటంతో నాయ‌కులు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరుగుతున్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. గెలుపు సులువు కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో కొంద‌రు నేత‌లు ఆందోళ‌న చెందుతుండ‌గా.. మ‌రికొంద‌రు త‌మ త‌మ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో పార్టీకి దూరంగా ఉంటున్నారు. అంతేగాక ఇత‌ర పార్టీలో చేరేందుకు రెడీ అయిపోతున్నారు. ఇందులో భాగంగా ఏపీలో అధికార టీడీపీ అధిష్టానానికి కూడా ఝలక్ లు ఇచ్చేందుకు నేతలు రెడీ అవుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ ఎంపీ, పలు ప్రాంతాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. 

Image result for chandrababu naidu

ఓ మంత్రితో నెలకొన్న విభేదాల కారణంగా ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీ ఒకరు పార్టీ మారాల‌ని భావిస్తున్నార‌ట‌. వేరే పార్టీలోకి చేరి ఎమ్మెల్యేగా పోటీచేసి మంత్రి కావాలనే ఆలోచనలో ఉన్నార‌ట‌. టీడీపీలో ఉండగా తనకు మంత్రి ఛాన్స్ రాదనేది ఆయన అభిప్రాయమ‌ని తెలుస్తోంది. ఒకప్పుడు పీఆర్పీలో ఉండి తర్వాత కాంగ్రెస్ లో చేరి మళ్లీ ఇఫ్పుడు టీడీపీలో చేరి ఎంపీ అయిన ఆయన భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. వైజాగ్ భూ కుంభకోణానికి సంబంధించి సిట్ దర్యాప్తులో తన పేరు బహిర్గతం చేస్తే తాను కూడా పార్టీ మారేందుకు సిద్ధ‌మంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే. ఆయన వియ్యంకుడు ఎమ్మెల్సీ. దీంతో పాటు రాయలసీమకు  చెందిన మరో ఎమ్మెల్యే కూడా పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.


ఆయన కూడా పార్టీ మారటానికే రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. మరో ఎమ్మెల్యే కూడా జనసేన వైపు చూస్తున్నారు. కొంత మంది వైసీపీ వైపు, మరికొంత మంది జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ నుంచి ఈ తరహా వలసలు అంటే ఎన్నికలకు ముందే టీడీపీపై ప్రతికూల సంకేతాలు చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారే ప్రచారం తెరపైకి తెచ్చి అధిష్టానం దగ్గర పనులు చేయించుకుని బయటపడాలని ప్లాన్ చేస్తున్నారా? లేక నిజంగా పార్టీ మారతారా? అనే అంశం కొద్ది కాలం పోతే కానీ క్లారిటీ వ‌స్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి! 



మరింత సమాచారం తెలుసుకోండి: