దేశవ్యాప్తంగా రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ కూటమిలో చేరతారో, ఎవరి కిందకి నీళ్లొస్తాయో తెలియని పరిస్థితి. ఎన్నికలకు సరిగ్గా ఏడాది కూడా లేని వేళ.. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నేతలు ఒక్కటవుతున్నారు. మరి ఎవరు ఎప్పుడు ఎవరితో ఉంటారు.. అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

Image result for bjp vs all

జాతీయస్థాయి రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఫ్రంటు, రాష్ట్రాల్లో అధికార పార్టీలకు వ్యతిరేకంగా కూటములు ఏర్పడుతున్నాయి. ఏర్పడబోతున్నాయి. వీటిల్లో పవిత్ర కూటములు, అపవిత్ర పొత్తులు, అనైతిక కలయికలు...ఇలా అనేక రకాలున్నాయి. ఎవరు ఎవరితో పొత్తు కడతారో, అది ఎన్నికల ముందు జరుగుతుందో, ఎన్నికల తరువాత జరుగుతుందో తెలియదు కానీ.. కొన్ని పార్టీల మధ్య లింకులపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాల లక్ష్యం ఒకరినొకరు బద్నాం చేసుకోవడమే. ఏపీలో చూస్తే.. బీజేపీ, వైసీపీ, జనసేన ఒక్కటయ్యాయని టీడీపీ నేతలు విమర్శల విల్లు ఎక్కుబెట్టారు. జగన్‌, పవన్‌ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ డైరెక్షన్‌లో నడుస్తున్నారని చంద్రబాబు నేరుగా విమర్శిస్తున్నారు.

Image result for bjp vs all

టీడీపీకి విమర్శలకు ధీటుగా ప్రతిపక్షాలు టీడీపీకి, కాంగ్రెసుకు లింకు అంటగడుతున్నాయి. బాబు కాంగ్రెసుతో అంటకాగుతున్నారని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పార్టీతో చేతులు కలిపారని బీజేపీ, వైసీపీ, జనసేన దాడి చేస్తున్నాయి. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబు ప్రతిపక్షాల ఐక్యత గురించి అక్కడ నాయకులతో మాట్లాడటం, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో కలివిడిగా ఉండి, నవ్వుకుంటూ కరచాలనం చేయడం, రాహుల్ ను భుజం తట్టి అభినందించడం వంటి వాటిని ఉదాహరణగా చూపుతూ.. టీడీపీ-కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ-కాంగ్రెసు పొత్తుపై ప్రచారం జోరందుకుంది.  పైకి చూస్తే అన్ని పార్టీలు ఒకదానికొకటి ప్రత్యర్థులే. అలాగని ఎప్పటికీ అలాగే ఉండవు. అవసరమైతే పొత్తులు పెట్టుకోక తప్పదు. అది ఎప్పుడన్నదే ప్రశ్న. ఈమధ్య కర్నాటక రాజకీయ పరిణామాలు చూశాక మెజారిటీ సీట్లు వచ్చిన పార్టీయే అధికారం చేపట్టనక్కర్లేదని, ఎన్నికల తరువాత పొత్తులు పెట్టుకొని అధికారం దక్కించుకోవచ్చనే నమ్మకం చాలా చిన్న పార్టీలకు ఏర్పడింది. తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో చంద్రబాబులను అధికారంలోకి రాకుండా చేయాలంటే ఎన్నికల తరువాత పొత్తులు పెట్టుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి.

Image result for jagan chandrababu

బలం తక్కువగా ఉన్న పార్టీలు సైతం కింగ్‌మేకరో, కింగో కావచ్చని ఆశపడుతున్నాయి. తెలంగాణలో టీడీపీ నేతలు ఇలాగే ఆశిస్తున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెసులకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ రాదని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తమ మద్దతు అవసరమవుతుంది కాబట్టి టీడీపీ కింగ్‌ మేకర్‌ అవుతుందని టీటీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెసు, టీడీపీ పొత్తు పెట్టుకుంటే అధికార పార్టీని సులభంగా ఓడించవచ్చనేది వారి అభిప్రాయం. ఇక ఏపీలో చంద్రబాబును అధికారంలోకి రానివ్వకుండా చూసేందుకు ఎన్నికల తరువాత బీజేపీ, వైసీపీ, జనసేన ఒక్కటి కావచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. వైసీపీ కాకుండా బీజేపీ, జనసేన కలవొచ్చన్న ప్రచారమూ ఉంది. జనసేనతో పొత్తుపై అప్పుడే ఏపీ బీజేపీ నాయకులు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఆ పార్టీతో పొత్తుపై హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి రాకుండా ఉండటానికి టీడీపీ అవసరమైతే కాంగ్రెస్ సహాయం తీసుకోవడానికి కూడా వెనుకాడదన్న ప్రచారమూ జరుగుతోంది.

Image result for chandrababu kcr

ఒకటీ రెండూ కాదు.. పార్టీల పొత్తులపై అనేక ప్రచారాలు. వాటిలో కొన్ని నిజం కావచ్చు. మరికొన్ని కేవలం వ్యాఖ్యలు, ప్రచారాలకే పరిమితం కావచ్చు. ఎన్నికల్లో విపరీతంగా విమర్శలు చేసుకున్నా.. ఎన్నికల అనంతరం అధికారం కోసం కాంగ్రెస్, జేడీఎస్ లు ఏకమైన ఉదంతం కన్నడ నాట కనిపిస్తున్న నేపధ్యంలో ఏ పొత్తునూ కొట్టిపారేయలేం. మరి ఆ పొత్తుల లెక్కలు ఏ తీరానికి చేరుతాయో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: