ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వ‌రి ప‌రిస్ధితి తెలుగుదేశంపార్టీలో ద‌య‌నీయంగా త‌యారైంది. వైసీపీలో ఉన్నప్పుడు ఏకంగా చంద్రబాబునే గొడ్డలి పట్టుకుని నరుకుతానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది.  అటువంటి అనూహ్యంగా వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించారు. అప్ప‌ట్లో ఆమె ఫిరాయింపుతో జ‌గ‌న్ కూడా షాక్ కు గుర‌య్యారు.  మంత్రి పదవి  ఆశ చూపి టీడీపీ అమెను బుట్టలో పడేసిందని అప్పట్లో టాక్. రోజులు గడచినా పదవి దక్కలేదు సరి కదా పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే రేపటి రోజున గిడ్డికి టిక్కెట్ కూడా దక్కే అవకాశమే లేదంటున్నారు. ఇందుకు కారణం గిడ్డి స్వ‌యంకృత‌మనే చెప్ప‌క త‌ప్ప‌దు. ఏ ముహూర్తంలో గిడ్డి పార్టీ మారారో కానీ అప్ప‌టి నుండి నియోజ‌క‌వ‌ర్గంలో స్వేచ్చ‌గా తిర‌గ‌లేకున్నారు. 

నాడు ఆడ పులి


వైసీపీలో ఉన్నంత కాలం గిడ్డి ఈశ్వరిని అంద‌రూ ఆడ‌పులి అంటూ చెప్పుకునే వారు.  అమె మాటే వేదంగా పార్టీలో నడిచింది. అధినేత జగన్ సైతం గిడ్డికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.  గిరిజన మహిళా ఎమ్మెల్యేగా అసెంబ్లీ లోను ఆమెకు బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. మీడియాలో కూడా గిడ్డి ఈశ్వరికి ప్రాధాన్యత లభించేది. 2019న వైసీపీ అధికారంలోకి వస్తే గిడ్ది మంత్రి అవుతుందన్నంతగా ప్రచారం జరిగింది. ఏజెన్సీ లో కూడా వైసీపీకి మంచి పట్టు ఉండడంతో గిడ్డి సరైన పార్టీలో ఉన్నారని అంతా భావించారు.  తెర‌వెనుక ఏం జరిగిందో గానీ గిడ్డి ఒక్క‌సారిగా ప్లేటు ఫిరాయించేశారు. పార్టీ ఫిరాయించేట‌పుడున్న ప‌రిస్ధితి గిడ్డికి ఇపుడు లేద‌ని స‌మాచారం. 

జనంలో తీవ్ర వ్యతిరేకత

Image result for గిడ్డి ఈశ్వ‌రి

దానికితోడు పార్టీ ఫిరాయించ‌గానే నియోజ‌క‌వ‌ర్గంలో గిడ్డి ప‌రిస్ధితి ఒక్క‌సారిగా తిర‌గ‌బ‌డింది. అస‌లే, గిడ్డి ఈశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న పాడేరు నియోజకవర్గంలో సైకిల్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. పైగా పార్టీ మారిన ఈశ్వరిపై గిరిజనులు ఆగ్రహంగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ గనుల తవ్వకానికి ఒకసారి  అనుమతులు ఇచ్చి  వెనక్కు వెళ్ళింది. దాంతో సర్కార్ పై జనానికి నమ్మకం పోయింది. చంద్రబాబు అధికారంలో ఉంటే ఎపుడైనా తవ్వకాలకు అనుమతించడం ఖాయమని జనం అనుమానిస్తున్నారు. ఇక్కడ టీడీపీ కి కేడర్ కూడా సరిగా లేదు. ఉన్న వారిలోనే ఎన్నో వర్గాలు. గిడ్డి రాకను మాజీ మంత్రి మణికుమారి వర్గీయులు  ఇప్పటికీ వ్య‌తిరేకిస్తున్నారు. రేపటి ఎన్నికలలొ అమెకు టికెట్ ఇచ్చినా  టిడిపిలో ఎంత‌మంది స‌హ‌క‌రిస్తార‌న్న‌ది అనుమాన‌మే. 
 
టికెట్ హుళక్కేనా
మరో వైపు టీడీపీ అధినాయకత్వం జరిపిన అంతర్గత సర్వేలో పాడేరు లొ గిడ్ది ఈశ్వరి ఓడిపోవడం ఖాయమని తేలిందట. దాంతో అమెను పక్కన పెట్టేందుకే బాబు సిద్ధమైపోయారని ప్ర‌చారం జ‌రుగుతోంది. బాబుని నమ్ముకుని జగన్ ని, పవన్ ని దారుణంగా తిట్టిపోసిన గిడ్డికి రాజకీయంగా ఇబ్బందికరమైన స్థితేనని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా పది నెలలు కూడా లేని వేళ ఉన్నంతలో అధికార పార్టీ ఎంఎల్ఏ అనిపించుకుని  కుర్చీ దిగిపోవడమే అమెకు మిగిలిందంటున్నారు.

వైసీపీకే జనం మొగ్గు

YS Jagan Continuous Padayatra In Rain Photos

రానున్న ఎన్నిక‌ల్లో మరో మారు పాడేరు నియోజకవర్గంలో వైసీపీ జెండానే ఎగిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పటిష్టమైన కేడర్ పార్టీకి ఉండడం ప్లస్ పాయింట్ అయితే అదే సమయంలో పార్టీ పట్ల  కూడా  జనంలో అభిమానం కనిపిస్తోంది. సరైన అభ్యర్ధిని కనుక పోటీలో పెడితే వైసీపీ ఇక్కడ జయ భేరి మోగించడం ఖాయమంటున్నారు.  ఎన్నికల నాటికి వైసీపీ తరఫున బలమైన నేతను దింపేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. పార్టీని కాదని వెళ్ళిన గిడ్డిని ఎలాగైనా ఓడించాలని జగన్ సైతం పట్టుదలగా ఉన్నట్లు టాక్. మొత్తం మీద గిడ్డి కి అన్ని వైపులా చుక్కెదురే అవుతోందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: