మధ్యప్రదేశ్‌కు చెందిన ఆధ్యాత్మిక వేత్త భయ్యూజీ మహరాజ్ మంగళవారంనాడు ఆత్మహత్య చేసుకున్నారు.  తనను తాను కాల్చుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడంతో ఆయనను హుటాహుటిన ఇండోర్‌లోని ముంబై ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే ఆయన కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. మహరాజ్ నివాసంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సూసైడ్ నోట్‌లో మానసిక ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉందని, అయితే మహరాజ్ మృతి వెనుక పూర్తి కారణాలపై ఇపుడే ఏం చెప్పలేమని డీఐజీ హరినారాయణ చారి మిశ్రా తెలిపారు. నిస్వార్థమైన సేవలతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించిన భయ్యూజ్ మహరాజ్ మరణం పట్ల మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, భయ్యూజ్ మహరాజ్ చనిపోవాలనే నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

  'మేమిచ్చింది నువ్వు తీసుకుని ప్రభుత్వానికి మద్దతిమ్మని ఆయనపై ప్రభుత్వం ఒత్తిడి చేసింది. అందుకు మహరాజ్ నిరాకరించారు' అని కాంగ్రెస్ మానక్ అగర్వాల్ ఆరోపించారు. మహరాజ్ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారని, దీని వెనుకనున్న కారణాలు వెలికితీయడానికి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: