ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేరువయ్యేందుకు ఎంతో శ్రమిస్తున్న బీజేపీ ప్రయత్నాలు ఫలించడం లేదు. ఎప్పటికప్పుడు ఆ పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి అంత చేశాం.. ఇంత చేశాం.. అని ఎంత చెప్తున్నా.. ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ ప్రజలకు మరింత దూరం చేస్తున్నాయి. ఇది కావాలని చేస్తున్నారో లేదో తెలీదు కానీ ఏపీ బీజేపీ నేతలకు మాత్రం అధిష్టానం నిర్ణయాలు అశనిపాతంలాగే మిగిలిపోతున్నాయి.

Image result for ap bjp

          దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి బీజేపీ ఎంతో శ్రమిస్తోంది. కర్నాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా అధికారానికి అర్రులు చాచి అడ్డంగా మునిగిపోయింది. కాంగ్రెస్ – జేడీఎస్ ల వ్యూహాత్మక ఒప్పందంతో బీజేపీ అధికారానికి దూరమైపోయింది. తమిళనాడులో, తెలంగాణలో ఆ పార్టీ అనుకూలురే అధికారంలో ఉండడంతో ఆ రెండు రాష్ట్రాలపై బీజేపీ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇక కేరళలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. అయితే అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో ఇప్పుడే ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టే పరిస్థితి లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ నే టార్గెట్ గా చేసుకుంది బీజేపీ.

Image result for ap bjp

          ఆంధ్రప్రదేశ్ ను బీజేపీ టార్గెట్ గా చేసుకోవడానికి అనేక కారణాలున్నాయి. 2014 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన టీడీపీ నాలుగేళ్లపాటు కలిసి కాపురం చేసింది. అయితే నాలుగేళ్లయినా కూడా రాష్ట్రానికి రావాల్సిన న్యాయం చేయడంలో బీజేపీ తాత్సారం ప్రదర్శిస్తోందని, విభజనచట్టంలోని హామీలను నెరవేర్చడంలో ఆ పార్టీ వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదని ఆరోపిస్తూ టీడీపీ ఎన్డీయే నుంచి బయటికొచ్చేసింది. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ ఆరోపణలను తట్టుకోలేని బీజేపీ కౌంటర్ ఎటాక్స్ ఇస్తోంది. మిగతా రాష్ట్రాల్లో లాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం తథ్యమని చెప్తోంది. ఇందుకు అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తామని చెప్తోంది.

Image result for kadapa steel factoryImage result for vizag railway zone

          అధికారంలోకి రావడమే రాజకీయ పార్టీల పరమావధి. అందులో ఆయా పార్టీల ఎత్తుగడలను ఏమాత్రం తప్పుబట్టలేం. అయితే విభజనవల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాల్సిందిపోయి కించపరిచేవిధంగా మాట్లాడడం, విభజనచట్టంలోని అంశాలను సైతం పట్టించుకోకుండా విమర్శలు చేస్తుండడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లోపు విభజనచట్టంలోని రెండు ప్రధాన డిమాండ్లైన విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ సాధించగలిగితే పార్టీపై ఉన్న చెడ్డపేరు తొలగిపోతుందని ఇక్కడి బీజేపీ నేతలు ఆశించారు. అయితే వారి ఆశలపైన కూడా నీళ్లు చల్లింది కేంద్రం. కడప స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించడం ద్వారా దానిపైన కూడా ఆశలు చచ్చిపోయాయి.

Image result for ap bjp

          కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే పరిస్థితులు ఉత్పన్నం కావడంతో కేంద్రం నుంచి మరిన్ని తాయిలాలు, ప్రజోపయోగ పథకాలను తీసుకురావడం ద్వారా ప్రజల్లోకి వెళ్లొచ్చని రాష్ట్ర బీజేపీ నేతలు భావించారు. అయితే ఇప్పుడు వారికి ఏమొహం పెట్టుకుని ఓట్లు అడగాలా.. అని అంతర్మథనంలో పడిపోయారు. రాష్ట్రనేతలు ఢిల్లీ వెళ్లినప్పుడు మాటలతో ఊరించి పంపిస్తున్న అధిష్టానం పెద్దలు.. ఆచరణలో మాత్రం ఆ స్థాయిలో పనిచేయడం లేదనే ఫీలింగ్ ఇక్కడి నేతల్లో ఉంది. కన్నా లక్ష్మినారాయణ పదవిమోజులో ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప.. వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని బీజేపీ సీనియర్ నేతలే తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమని బీజేపీ చెప్తూ వస్తోంది. ఇందుకు రాష్ట్రమే విముఖంగా ఉందని ఆరోపిస్తోంది. ఈ విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. వైజాగ్ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ పై కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకుండా తమ రాజకీయ మనుగడే కష్టమవుతుందనే అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల నాటికి ఈ రెండు అంశాలపైన స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే ఎన్నికలబరిలోకి దిగడం కష్టమేనని ప్రస్తుత ఎంపీ ఒకరు వ్యాఖ్యానించడం వారిలోని భయానికి అద్దం పడుతోంది. కేంద్రం, బీజేపీ అధిష్టానం ఇదే వైఖరి కంటిన్యూ చేస్తే తాము మరోదారి చూసుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని తాజా మాజీ మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు. మరి బీజేపీ అధిష్టానం ఏం చేయబోతుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: