ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ ఓ సెంటిమెంటు జోరుగా ప్ర‌చారం అవుతోంది. అదికూడా వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశించ‌టంతో మొద‌లై తూర్పు గోదావ‌రి జిల్లాలోకి అడుగుపెట్ట‌టంతో తార‌స్ధాయికి చేరుకుంది. ఇంత‌కీ ఆ సెంటిమెంటు ఏమిటంటే, గోదావ‌రి జిల్లాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వ‌స్తుందో అదే పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న‌ది ప్ర‌చారం. ఆ ప్ర‌చారం ఉత్త ప్ర‌చారంగా మిగిలిపోకుండా  పెద్ద సెంటిమెంటుగా త‌యారైంది. దాంతో రాజ‌కీయనేత‌లు కూడా  సెంటిమెంటును న‌మ్ముతున్నారు.  


సెంటిమెంటుకు ఎందుకంత ప్ర‌చారం ?

Related image

ఇంత‌కీ సెంటిమెంటుకున్న నేప‌ధ్య‌మేమిటంటే, ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్నికల సమయంలో డబ్బు కంటే కులం ప్రాధాన్యత ఒకింత ఎక్కువే. ఎలాగంటే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో కులాల  ప్ర‌భావం చాలా ఎక్కువ‌. ఫ‌లానా నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ కులాన్ని కాద‌ని ఇత‌ర కులానికి చెందిన నేత‌ను అభ్య‌ర్ధిగా నిల‌బెడితే ఓడించేంత ప‌ట్టుద‌లుంది. అందుక‌నే ఏ పార్టీ అయినా అభ్య‌ర్ధుల‌ను నిల‌బెట్టేట‌పుడు చాలా జాగ్ర‌త్త‌గా కులాల అంశాల‌ను భేరీజు వేసుకుంటుంది. ఆ అంశ‌మే ఇపుడు చంద్రబాబునాయుడు మెడ‌కు చుట్టుకుంది. పోయిన ఎన్నిక‌ల్లో కాపుల‌ను బిసిల్లోకి చేరుస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన సంగ‌తి అంద‌ర‌కి తెలిసిందే. అయితే, హామిని నిలుపుకోలేక‌పోవ‌టంతో స‌మ‌స్య మొద‌లైంది. పోయిన ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బెడిసికొట్టేట్లుంది. 


2004లో  ఏం జ‌రిగింది ?

Image result for ysr swearing in 2004 elections

పోయిన ఎన్నిక‌ల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఫ‌లితాలు చూసిన త‌ర్వాత ఆ సెంటిమెంటు ఇంకా బ‌లంగా నాటుకుపోయింది.  2004 లో తూర్పు గోదావ‌రి జిల్లాలోని  21 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ 18 నియోజ‌క‌వ‌ర్గాల్లో  గెలిచింది.  తెలుగుదేశం పార్టీ 2 చోట్ల గెల‌వ‌గా బిజెపి ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచింది. అదే విధంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని 16 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 12 చోట్ల గెలిచింది.  తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్ధులు 4 సీట్ల‌లో గెలిచారు. అంటే ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని మొత్తం 37 అసెంబ్లీ సీట్లకు గాను కాంగ్రెస్ కి 30 సీట్లు రాగా,  తెలుగుదేశంకు 6 స్ధానాలు, బిజెపికి ఒక్క స్ధానం ద‌క్కింది. 


2009లో ఏ పార్టీకెన్ని ?

Image result for 2009 election and ysr swearing

2009లో  నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగింది. దాని ఫ‌లితంగా తూర్పుగోదావ‌రి జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య 21 కాస్త 19 కి త‌గ్గింది. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య 16 నుంచి 15కి ప‌డిపోయింది. 2009 ఎన్నికలలో వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి తూర్పుగోదావరి జిల్లాలో 11 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 4 ,  ప్రజారాజ్యం పార్టీకి  4 సీట్లు ద‌క్కాయి. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి  9, తెలుగుదేశం పార్టీకి 5, ప్రజారాజ్యం పార్టీ 1 సీటు వ‌చ్చింది. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశం ఏంటంటే ప్ర‌జారాజ్యం పార్టీ వ్య‌వ‌స్ధాప‌కుడు చిరంజీవిది ప‌శ్చిమ గోదావ‌రి జిల్లానే. అయినా జ‌నాలు మాత్రం వైఎస్సార్ పైనే న‌మ్మ‌కం ఉంచి మెజారిటి సీట్లు ఇచ్చారు. మొత్తం మీద ఉభయగోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో కాంగ్రెస్  20, తెలుగుదేశం పార్టీకి  9,  ప్రజారాజ్యంకు 5 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 


2014లో టిడిపికెన్ని ?

Related image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014 లో ఎన్నిక‌లు జ‌రిగాయి. అప్పుడు తూర్పుగోదావ‌రి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 5,  తెలుగుదేశం పార్టీకి 13, ఒక‌ స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అలాగే పశ్చిమ గోదావ‌రి జిల్లాలోని 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం పార్టీ 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెల‌వ‌గా మిత్ర‌ప‌క్షం  బిజెపి ఒక స్ధానం ద‌క్కించుకుంది. మొత్తం మీద‌ ఉభయగోదావరి జిల్లాల్లోని మొత్తం 34 సీట్లకు గాను తెలుగుదేశం పార్టీకి 27, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి  5, బిజెపి, స్వ‌తంత్ర అభ్య‌ర్ధికి చెరో సీటు ద‌క్కింది. అంటే 2004 లో కాంగ్రెస్ పార్టీ 37 స్ధానాల‌కు గాను 30 గెలుచుకుని అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, 2009లో కాంగ్రెస్ 34 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 20 గెలుచుకుని  అధికారం నిల‌బెట్టుకుంది. అదే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014లో  జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశంపార్టీ 34 సీట్ల‌లో 27 గెలుచుకుని అధికారంలోకి వ‌చ్చింది.

2019లో ఏమ‌వుతుందో ?

Image result for ys jagan padayatra godavari bridge

మొద‌టి రెండు ఎన్నిక‌ల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కావ‌చ్చు లేదా రాష్ట్ర‌మంత‌టా కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు వ‌చ్చాయంటే వైఎస్ఆర్ చ‌రిష్మానే కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 2009లో అధికారం నిల‌బెట్టుకున్న వెంట‌నే వైఎస్ మ‌ర‌ణించిన సంగ‌తి అందరికీ తెలిసిందే.  త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాంగ్రెస్ నుండి విడిపోయి వైఎసార్సిపి పెట్టుకోవ‌టం, రాష్ట్ర విభ‌జ‌న‌, 2014లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం తెలిసిందే. పోయిన ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ కు ఒక్క సీటు కూడా రాలేదు. తూర్పులో కేవ‌లం 5 చోట్ల మాత్ర‌మే గెలిచింది. మ‌ళ్ళీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కార‌ణంగా వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లుపెట్టారు.  పాద‌యాత్ర‌లో భాగంగానే గోదావ‌రి జ‌నాలు  జ‌గ‌న్ కు బ్ర‌హ్మ‌రధం ప‌డుతున్నారు. కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఈ రెండు జిల్లాల్లో త‌న స‌త్తా చాటితే అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌నే సెంటిమెంటు బ‌లంగా ప్రచార‌మ‌వుతోంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: